ఖమ్మంలో ఇక ఎంపీ సీటు​పై కాంగ్రెస్​ నేతల కన్ను

ఖమ్మంలో ఇక ఎంపీ సీటు​పై  కాంగ్రెస్​ నేతల కన్ను
  • రెండు జిల్లాల్లో పెరుగుతున్న ఆశావహులు

ఖమ్మం, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ విజయంతో ఇక ఆ పార్టీ నేతల కన్ను ఎంపీ సీట్లపై పడింది. ఖమ్మం లోక్​సభ​టికెట్ కు డిమాండ్ పెరుగుతోంది. రోజురోజుకూ ఆశావహుల సంఖ్య ఎక్కువవుతోంది.  ఈ టికెట్​పై ఇప్పటికే కొంత మంది మాజీ ప్రజా ప్రతినిధులు గురిపెట్టగా.. ఇటీవల మారిన రాజకీయ పరిణామాలతో మరికొందరు లిస్ట్ లో చేరారు.

ఎలక్షన్లకు ఇంకా ఉన్నప్పటికీ అప్పుడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హైకమాండ్​ ఆశీస్సుల కోసం కొందరు ఎదురు చూస్తుంటే, ఉమ్మడి జిల్లాలోని ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునేందుకు మరికొందరు ట్రై చేస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాజాగా కాంగ్రెస్​ అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలుపొందారు.

ఏడు సెగ్మెంట్లలో కలిపి బీఆర్ఎస్​ కు వచ్చిన ఓట్ల కంటే కాంగ్రెస్​ కు రెండున్నర లక్షల ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. దీంతో కాంగ్రెస్​ టికెట్ కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. 

పార్టీనే నమ్ముకున్నామని... 

ఖమ్మం లోక్​ సభ కు కాంగ్రెస్​ టికెట్ కోసం మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి ప్రధాన పోటీదారుగా ఉన్నారు. ఆమె 1999, 2004 ఎన్నికల్లో ఖమ్మం నుంచి కాంగ్రెస్​ తరఫున ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోగా, 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీపీఐకి సీటు కేటాయించడంతో కాంగ్రెస్​ పోటీలో లేదు.

2019లో కాంగ్రెస్​ తరపున రేణుకా చౌదరి పోటీ చేయగా ఓటమిపాలయ్యారు. ఈసారి కూడా తనకే టికెట్ ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. ఇక ఖమ్మంలో చాలా ఏండ్ల నుంచి పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న ఓ మైనార్టీ లీడర్​ తనకు పార్లమెంట్ సీటు ఇవ్వాలని అడుగుతున్నారు. అసెంబ్లీ టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించిన ఆయన మరో ముఖ్య నేత కోసం తప్పుకోవాల్సి వచ్చింది.

దీంతో పార్లమెంట్ సీటయినా తనకు కేటాయించాలని కోరుతున్నారు. వీళ్లిద్దరే కాకుండా రేసులో ప్రధానంగా మరో ఇద్దరు ఉన్నారు. అందులో ఒకరు ప్రముఖ వ్యాపారవేత్త. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్​ తరఫున టికెట్ ఆశించిన ఆయన చివరి నిమిషంలో ఆ చాన్స్​ కోల్పోయారు. రాష్ట్ర స్థాయిలో తనకున్న పరిచయాలకు తోడు, వ్యాపారవేత్తగా ఆర్థిక బలంతో ఈసారి ఎంపీ టికెట్ కన్ఫామ్​ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇందుకోసం ఉమ్మడి జిల్లాలో పార్టీ నుంచి కీలకంగా ఉన్న ముఖ్యనేతలను కన్విన్స్​ చేసేందుకు ట్రై చేస్తున్నట్టు సమాచారం. ఇక మరో వ్యక్తి ప్రస్తుతం కాంగ్రెస్​ పాలిటిక్స్​ లో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధికి సమీప బంధువు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్​ పార్టీలో జాతీయ స్థాయి గుర్తింపు ఉన్నా గతంలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కూడా టికెట్ వర్కవుట్ కాలేదు. ఈసారి పార్టీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అన్ని ఈక్వేషన్లు కలిసి వస్తాయనే అంచనాలో ఆయన ఉన్నారు. వీరే కాకుండా రోజులు గడస్తున్న కొద్దీ మరికొందరు కాంగ్రెస్​ బీఫామ్​ రేసులోకి వస్తున్నారు.