నకిలీ బంగారం అంటగట్టి.. నగదు, బంగారంతో ఉడాయించిన మహిళ

నకిలీ బంగారం అంటగట్టి..  నగదు, బంగారంతో ఉడాయించిన మహిళ

అచ్చంపేట, వెలుగు: నకిలీ బంగారం బిస్కెట్లను ఓ మహిళకు అంటగట్టి ఆమె వద్ద నుంచి రూ.3 లక్షల నగదు, 3 తులాల బంగారు గొలుసును తీసుకొని ఉడాయించిన ఘటన బల్మూరు మండలంలో జరిగింది. బల్మూర్  ఎస్సై రాజేందర్  తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మంగలికుంటపల్లి గ్రామానికి చెందిన మన్నెం తిరుపతమ్మ  కూరగాయలు అమ్ముకుంటూ బతుకుతోంది. 5 రోజుల కింద అచ్చంపేటలో  కూరగాయలు అమ్ముతుండగా, ఓ మహిళ పరిచయం చేసుకుంది.  తాము ఇక్కడే కాంట్రాక్ట్  వర్క్స్  చేపిస్తున్నామని, పెద్ద మొత్తంలో కూరగాయలు అవసరం అవుతాయని చెప్పి ఫోన్  నంబర్​ తీసుకుంది. 

ఈ నెల 15న తిరుపతమ్మ ఇంటికి వచ్చి తనకు యాదాద్రిలో రెండు బంగారు బిస్కెట్లు దొరికాయని, వాటిని రూ.6 లక్షలకు అమ్మాలని చెప్పింది. నమూనా ముక్క ఇచ్చి అచ్చంపేటలోని షాపులో పరీక్షించగా, బంగారం అని తేలింది. ఆదివారం తిరుపతమ్మ సదరు మహిళను ఇంటికి పిలిచి రూ.3 లక్షలు, 3 తులాల 2 మాసాల బంగారు ఆభరణాలు ఇచ్చి రెండు బంగారు బిస్కెట్లను తీసుకుంది. ఆ తరువాత ఆ మహిళ ఓ వ్యక్తి బైక్ పై అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆ తరువాత పరిశీలించగా, అవి నకిలీ బంగారు బిస్కెట్లు అని తేలింది. సదరు మహిళకు ఫోన్  చేయగా ఫోన్  స్విచ్  ఆఫ్  రావడంతో తిరుపతమ్మ బల్మూర్  పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేందర్  తెలిపారు.