
ఆ తల్లికి ఏమైందో ఏమో ఉన్నట్లుండి కుమారుడ్ని అత్యంత క్రూరంగా చంపాలని ప్లాన్ వేసింది. పథకం ప్రకారం నాలుగవ అంతస్తునుంచి కిందకు నెట్టింది. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
ఫాక్స్ న్యూస్ కథనం ప్రకారం అమెరికా మిన్నెసోటా రాష్ట్రంలో దారుణం జరిగింది. 33ఏళ్ల ఇటాయివియా లాయిడ్ అనే మహిళ తన 11ఏళ్ల కుమారుణ్ని హత్య చేసేందుకు దారుణానికి ఒడిగట్టింది.
అనుకున్నట్లు గా నే 4వ అంతస్తుపై నుంచి బాలుణ్నికిందకి తోసేసి ఏమీ ఎరగనట్లుగా నటించింది. అయితే నిందితురాలు చిన్నారి కిందకు తోసేయడాన్ని ప్రత్యక్షసాక్షి ఒకరు గుర్తించారు. కిందపడిన బాలుణ్ని స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాల్ని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. విచారణలో నిందితురాలు కుమారుణ్ని హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిపింది. అయితే హత్య ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయాల్ని వెల్లడించలేదని పోలీస్ అధికారి రాబర్ట్ వెల్లడించారు.