ఫ్రీ జర్నీతో మహిళల ఆమ్దానీ పెరిగింది

ఫ్రీ జర్నీతో మహిళల ఆమ్దానీ పెరిగింది
  • చార్జీల ఆదాతో నెలకు రూ.3 వేల నుంచి 5 వేలు మిగులు
  • ఆ మొత్తమంతా సేవింగ్స్ చేస్తున్న మహిళలు
  • గతంలో ట్రావెలింగ్​కే 30 శాతంపైగా ఖర్చు
  • వర్కింగ్ ఉమెన్ సంఖ్యలోనూ వృద్ధి
  • రాష్ట్ర ప్రభుత్వం చేసిన స్టడీలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఫ్రీ బస్ జర్నీతో మహిళల ఆమ్దానీ పెరిగింది. గతంతో చూస్తే వర్కింగ్ ఉమెన్ ఆదాయం యావరేజ్​గా నెలకు రూ.3 వేల నుంచి 5 వేల వరకు పెరిగింది. అదే టైమ్​లో హైదరాబాద్​ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సిటీలో పనిచేసేందుకు వచ్చే మహిళల సంఖ్య కూడా పెరిగినట్లు ప్రభుత్వ స్టడీలో తేలింది. మహిళ సాధికారతకు ఫ్రీ బస్ జర్నీ చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తున్నట్టు తెలుస్తున్నది. డిసెంబర్ 9వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యాన్ని కల్పించింది. 

దీంతో తొలి రెండు నెలల్లో వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేసేందుకు మహిళలు ఆసక్తి చూపించారు. ఫలితంగా బస్సుల్లో విపరీతమైన రద్దీ నెలకొన్నది. వంద శాతానికి మించి ఆక్యుపెన్సీతో బస్సులు నడిచాయి. ఇక ఫిబ్రవరి నుంచి ఈ తరహా ప్రయాణాలు తగ్గాయి. రోజువారీగా పనుల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే మహిళలు మాత్రం రెగ్యులర్​గా ఫ్రీ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో అన్ని ప్రాంతాల నుంచి ఫ్రీ బస్సు జర్నీ చేస్తున్న వర్కింగ్ వుమెన్స్ నుంచి తీసుకున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా వారి ఆదాయం పెరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం స్టడీలో వెల్లడైంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే చాన్స్ ఉన్నదని అధికారులు చెబుతున్నారు.

ఇతర ఖర్చులు మిగిలినయ్

ఉచిత బస్సు ప్రయాణంతో కేవలం టికెట్ డబ్బులే కాకుండా.. మహిళలకు ఇతర ఖర్చులు కూడా మిగిలినట్లు ప్రభుత్వ స్టడీలో వెల్లడైంది. కొంతమంది వర్కింగ్ వుమెన్స్​ రోజు ప్రయాణం బదులు పట్టణ ప్రాంతాల్లో ఇండ్లు కిరాయి తీసుకుని వర్క్ చేసేవాళ్లు. ఇంటి కిరాయి కోసం రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు చెల్లించాల్సిన పరిస్థితి. ఉంటున్న ఇంటి దగ్గర నుంచి పనిచేసే ప్రాంతానికి వెళ్లాలంటే బస్సు, ప్రైవేటు వెహికల్స్​లో వెళ్లినా ఖర్చు అయ్యేది. ఇప్పుడ ఫ్రీ జర్నీతో వంద కిలో మీటర్ల పరిధిలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు రోజువారీగా మహిళలు అప్ అండ్ డౌన్ చేస్తూ వర్క్​ చేస్తున్నారు. డిసెంబర్ 9 కంటే ముందు కేవలం బస్సు చార్జీలే రోజుకు యావరేజ్​గా రూ.50ల నుంచి రూ.120 వరకు ఖర్చు చేసేవారు. ఇంకా ఎక్కువ దూరం ప్రయాణం చేసేవాళ్లు, ఎక్స్​ప్రెస్ బస్సులో వెళ్లేవారికి మరింత ఎక్కువ టికెట్ చార్జీలు అయ్యేవి. దీంతో చేస్తున్న పనికి వస్తున్న ఆదాయంలో 30 శాతంకు పైనే ట్రావెలింగ్​కు పెట్టినట్లు తేలింది. ఇప్పుడు ఈ ఖర్చులన్నీ వర్కింగ్ వుమెన్స్​కు మిగిలాయి. గతంలో సిటీలో బస్సు పాస్ లు, బస్సు చార్జీలకు మహిళలకు ఒక్కొక్కరు యావరేజ్ గా రూ.1500 వరకు ఖర్చు చేసేవారు. ఓవరాల్​గా చూస్తే రాష్ట్రంలో ఫ్రీ జర్నీతో మహిళల సేవింగ్స్ కూడా పెరిగినట్లు గుర్తించారు. ఆ మొత్తాన్ని కుటుంబ అవసరాలకు, పిల్లల స్టడీస్​కు వినియోగిస్తున్నట్లు మహిళలు వెల్లడించారు.

వర్కింగ్ ఉమెన్​ సంఖ్య పెరిగింది

ఫ్రీ బస్​జర్నీ ఎఫెక్ట్​తో పనిచేసే మహిళల సంఖ్య కూడా పెరుగుతున్నది. ఇంతకు ముందు కొంత దూర ప్రాంతంలో ఏదైనా పనికి వెళ్లినా.. ఉద్యోగం చేసినా నెల మొత్తానికి రూ.8 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే వస్తుండే. అందులో కేవలం ట్రాన్స్ పోర్ట్ చార్జీలకు ఎక్కువ ఖర్చయ్యేది. దీంతో కొంతమంది మహిళలు పనిచేసే అవకాశం ఉన్నా.. ఏ మాత్రం మిగలడం లేదనే ఆలోచనతో ఉద్యోగాన్ని మానుకున్నట్టు ప్రభుత్వం స్టడీలో తేలింది. ఇప్పుడు ఫ్రీ బస్ జర్నీ సౌకర్యంతో మళ్లీ చాలామంది తిరిగి పనిలో చేరినట్లు వెల్లడైంది. ప్రధానంగా సిటీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వచ్చి ఏదో ఒక పని చేసుకొని వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇటు జనగామ, తుఫ్రాన్ నుంచి ఇటు సంగారెడ్డి, జడ్చర్ల ప్రాంతాల నుంచి సిటీకి వచ్చి ఏదో ఒక పని చేసుకుని వెళ్లడం, రోజువారీగా ఉద్యోగానికి అటెండ్ అయి వెళ్లడానికి మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు.

నాలుగు నెలల్లో రూ.1,200 కోట్లు ఆదా  

ఓవరాల్​గా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.1,200 కోట్ల విలువైన టికెట్లు మహిళలకు ఫ్రీగా ఇచ్చారు. ఇందులో శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలు, పండుగలకు, సెలవులకు ఇంటికి వెళ్లి వచ్చిన వారికి సంబంధించి 40 శాతం ఉండగా.. మిగిలిన 60 శాతం వర్కింగ్ వుమెన్​కు సంబంధించినవే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. స్కీమ్ ప్రారంభమైనప్పుడు సగటున రోజు 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. ఇప్పుడు సగటున రోజుకు 29.67 లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. సగటున డిసెంబర్​లో 26.99 లక్షలు, జనవరిలో 28.10 లక్షలు, ఫిబ్రవరిలో 30.56 లక్షలు, మార్చిలో 31.42 లక్షల మంది మహిళలు ఫ్రీ జర్నీ చేశారు.