హెల్దీగా ఉండేందుకు ఫిట్​నెస్ మంత్ర

హెల్దీగా ఉండేందుకు ఫిట్​నెస్ మంత్ర
  • 30 ఏండ్లు దాటినా జిమ్ లో చేరుతున్న మహిళలు

హైదరాబాద్, వెలుగు: సిటీలో జిమ్, ఫిట్ నెస్ సెంటర్లు యువతకు అడ్డాలాంటివి. బాడీ బిల్డర్స్, ఫిట్ నెస్ ప్రీక్స్ మాత్రమే అక్కడ రెగ్యులర్ గా కనిపిస్తుంటారు. ఫిట్ నెస్ సెంటర్లకు వెళ్లే అమ్మాయిలు కూడా తక్కువే.  కానీ కరోనా ఎఫెక్ట్ తో ఇంటికే  పరిమితం కావడంతో ఆ టైమ్ లో చాలామంది అధిక బరువు పెరిగారు. ఎంతో మంది మహిళలు  పీసీవోఎస్(పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్), ఒబెసిటీ థైరాయిడ్ బారిన పడ్డారు. దీంతో పాటు బోన్ డెన్సిటీ తగ్గడం లాంటి సమస్యలతో డాక్టర్లను కన్సల్ట్ అవుతున్నారు. ఫిట్ నెస్,  డైట్ తప్పనిసరిగా ఫాలో కావాలని వారికి డాక్టర్లు సూచిస్తున్నారు. కరోనా టైమ్ లో జిమ్ లు క్లోజ్ ఉండడంతో చాలామంది యువత ఆన్ లైన్ క్లాసులు చూస్తూ వర్క్ అవుట్స్ చేశారు. మిడిల్ ఏజ్ మహిళలకు ఆన్ లైన్ క్లాసులకు ఎక్కువగా కనెక్ట్  కాలేకపోయారు. సెకండ్ వేవ్ తర్వాత అన్ లాక్ లో  జిమ్ లు, ఫిట్ నెస్ సెంటర్లు ఓపెన్ కాగానే మహిళలు నేరుగా వెళ్లి జాయిన్ అయ్యారు. గతంతో పోలిస్తే జిమ్​లలో మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారు.

10 మందిలో ఆరుగురు మిడిల్ ఏజ్ గ్రూప్ వారే 
సిటీలో ఒకప్పుడు మెన్స్ జిమ్ లే ఎక్కువగా ఉండేవి. ఆ తర్వాత అమ్మాయిలు సైతం ఫిట్ నెస్  పై  ఇంట్రెస్ట్ చూపడంతో యూనిసెక్స్ జిమ్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు స్పెషల్ గా లేడీస్ కోసం కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే కరోనా పాండమిక్ ముందు వరకు అమ్మాయిలే  ఎక్కువగా వర్క్ అవుట్స్ కోసం వచ్చేవారని, ప్రస్తుతం వారికంటే 30ఏళ్లు పైబడిన వారు  అధికంగా వస్తున్నారని జిమ్ ట్రైనర్లు చెప్తున్నారు. పదిమంది లేడీస్ లో ఆరుగురు 30 ప్లస్ ఏజ్​ వాళ్లు ఉంటున్నారని అంటున్నారు.  ఉదాహరణకు ప్రస్తుతం 100శాతంలో 50శాతం మగవాళ్లు ఉంటే 20శాతం లేడీస్ ఉంటున్నారని ట్రైనర్లు తెలిపారు. మారుతున్న లైఫ్ స్టైల్, ఒబెసిటీ   ప్రధాన కారణాలని చెప్తున్నారు. డాక్టర్ల సజేషన్, ఫిట్ గా, హెల్దీ గా ఉండే కారణాలే మహిళలను జిమ్ ల బాట పట్టిస్తున్నాయని వారు చెప్తున్నారు. ఇందుకోసం జిమ్ లో సపరేట్ ట్రైనర్లు ఉండడంతో పాటు వారికి వీక్లీ వైజ్ గా డైట్ ప్లాన్ కూడా ఇస్తున్నారు. చాలామంది యోగాను, జిమ్ ను చేస్తూ ప్రస్తుతం హెల్దీ లైఫ్ ని లీడ్ చేస్తున్నామని చెబుతున్నారు.  

హెల్త్ ఇష్యూస్ కారణంగా..   
హెల్త్ ఈజ్ వెల్త్ సూత్రాన్ని ఇప్పుడు మహిళలు ఎక్కువగా పాటిస్తున్నారు. అన్ని రంగాల్లో ఆడవాళ్లు దీన్ని ఫాలో అవుతున్నారు. అటు ప్రొఫెషనల్ లైఫ్ ని, ఇటు పర్సనల్ ని లీడ్ చేస్తున్నట్లుగానే తమ ఆరోగ్యంపైన కూడా దృష్టిపెట్టడం ముఖ్యమని రియలైజ్ అవుతున్నారు. అందులో భాగంగానే కొత్తగా జిమ్ లు, వర్క్ అవుట్‌‌లు చేస్తున్నారు. మాములుగా ఆడవాళ్లు యోగా, ఆసనాలు లైట్ వర్క్ అవుట్స్ మాత్రమే చేస్తారని అనుకుంటున్నారని, కానీ వాటితో పాటు వెయిట్ స్ట్రెంథినింగ్ వర్క్ అవుట్స్ కూడా చేస్తుంటామని తారుణ్య తెలిపారు. తాము ఆరోగ్యంగా ఉంటేనే ఫ్యామిలీని సరిగా చూసుకోగలమని భావిస్తున్నారు. వయసు మీదపడే కొద్దీ బాడీలో మార్పులు, ఎముకలు అరిగిపోవడం వంటి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వాటినుంచి బయటపడేందుకు ఫిట్నెస్ పై కాన్సట్రేట్ చేయడం ముఖ్యమని అనుకుంటున్నారు. 

పీసీవోఎస్ నుంచి బయటపడ్డా..
స్కూల్ ఏజ్ నుంచే  ఫిట్​నెస్​పై ఫోకస్ చేసేదాన్ని. ఆ టైమ్ లో స్పోర్ట్స్ ఎక్కువగా ఆడేదాన్ని.   ప్రొఫెషనల్ లైఫ్ లోకి ఎంటర్ అయ్యాక వర్క్ మాత్రమే ఉండేది.  ఆఫీసులో  షిఫ్ట్ సిస్టం వల్ల తెలియకుండానే రెండు, మూడు నెలల్లో 8 కిలోల వెయిట్ పెరిగా. డాక్టర్ ని కన్సల్ట్ అయితే పీసీవోఎస్(పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) అన్నారు. షిఫ్ట్ చేంజ్ చేసుకుని ఫిట్ నెస్ పై ఫోకస్ చేయమని చెప్పారు.  అలా యోగా స్టార్ట్ చేశాను.  జిమ్ కి కూడా వెళుతున్నా. ఈ  రెండింతో మూడు, నాలుగు నెలల్లోనే పీసీవోఎస్ నుంచి పూర్తిగా బయట పడ్డా. ప్రస్తుతం న్యూట్రిషన్ అండ్ ఫిట్ నెస్ పై డిప్లొమా చేస్తున్నా.
 - తారుణ్య, నారాయణగూడ

20 శాతం మహిళలే.. 
విమెన్స్ కి ఫంక్షనింగ్ అండ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇందులో యోగా, జుంబా, ఏరోబిక్స్ ఉంటాయి. మహిళలు గ్రూప్ గా చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు కాబట్టి వీరికోసం కల్ట్ ఫిట్ సెంటర్లు కూడా చాలావచ్చాయి.  కొంతకాలంగా మహిళలు జిమ్ కి రావడం చూస్తున్నాం. ప్రస్తుతం ఆ జిమ్ లో 20శాతం మహిళలే . ఎక్కువగా 30, 35, 45 ఏజ్ గ్రూప్ వాళ్లే ఉన్నారు. వీరికి ట్రైనర్ ని అలాట్ చేయడంతో పాటు వీక్లీ ప్రోగ్రాం ప్లాన్ ఇస్తాం. అందులో వర్క్ అవుట్ ప్లాన్ తో పాటు డైట్ కూడా ఉంటుంది. 
- వెంకట్ మడమల, ఫిట్ నెస్ ట్రైనర్