
హైదరాబాద్: నవరాత్రులు భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న ఖైరతాబాద్ బడా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరేందుకు సమయం ఆసన్నమైంది. 2025, సెప్టెంబర్ 6న బడా గణేషుడిని నిమజ్జనం చేయనున్నారు. గురువారం (సెప్టెంబర్ 4) అర్ధరాత్రి 12 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతినిచ్చిన నిర్వాహకులు ఆ తర్వాత దర్శనాలను నిలిపివేసి నిమజ్జన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. శుక్రవారం (సెప్టెంబర్ 5) ఖైరతాబాద్ మహా గణేషుడి నిమజ్జనానికి ఉత్సవ సమితి ఏర్పాట్లు మొదలుపెట్టింది.
ఇందులో భాగంగా బడా గణేషుడి మండపం దగ్గర కర్రల తొలగింపు పనులు శరవేగంగా సాగుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి గణపతి మండపం చుట్టూ ఉన్న షెడ్ తొలగించి, రాత్రి 12 గంటలకు కలశ పూజ నిర్వహించి, విగ్రహాన్ని శోభాయాత్రకు సిద్ధం చేస్తారు. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో గణపతిని టస్కర్‌పైకి ఎక్కించి, మూడు గంటల పాటు సపోర్టింగ్ వెల్డింగ్ పనులు చేస్తారు.
శనివారం (సెప్టెంబర్ 6) ఉదయం పోలీసులకు అప్పగిస్తారు. ఖైరతాబాద్నుంచి నిమజ్జన పాయింట్వరకూ టెలిఫోన్‌భవన్, సెక్రటేరియేట్, ఎన్టీఆర్మార్గ్మీదుగా 2.5 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనున్నది. బడా గణేశుడి చుట్టూ ఉన్న శ్రీ జగన్నాథ స్వామి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, కన్యకా పరమేశ్వరి, గజ్జలమ్మ దేవి విగ్రహాలను కూడా తరలించేందుకు హైదరాబాద్‌కు చెందిన మరో ట్రక్‌ను ఉపయోగించనున్నారు.
►ALSO READ | హైదరాబాద్ సిటీలోకి ప్రైవేట్ ట్రావెల్స్ నో ఎంట్రీ: ఊర్ల నుంచి మీ వాళ్లు వస్తుంటే అలర్ట్ చేయండి..!
భారీ గణనాథుడిని ప్రతిష్ఠించిన చోటు నుంచి హుస్సేన్సాగర్తీరంలోని నాలుగో నంబర్క్రేన్వద్దకు తరలించేందుకు విజయవాడ నుంచి భారీ టస్కర్వచ్చింది. దీన్ని గణేశుడి ఎదుట నిలిపి వెల్డింగ్పనులు కూడా పూర్తి చేశారు. మూడు టన్నుల ఐరన్‌తో టస్కర్‌పై ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఉత్సవ సమితి.. ప్రత్యేక పూలతో టస్కర్‌ను అలంకరించారు. హూస్సేన్ సాగర్‌లో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన ప్రాంతంలో 25 ఫీట్ల వరకు ఇప్పటికే పూడికతీత చేపట్టారు హెచ్ఎండీఏ సిబ్బంది. హుస్సేన్ సాగర్ లో 69 అడుగుల బడా గణనాథుడి విగ్రహం పూర్తిగా నిమజ్జనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు.