చైనాలో కంచె దూకి పారిపోతున్న కార్మికులు

చైనాలో కంచె దూకి పారిపోతున్న కార్మికులు

చైనా ప్రభుత్వం అమలు చేస్తున్న జీరో కోవిడ్ విధానం అక్కడి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. లాక్ డౌన్ పేరు చెబితేనే అక్కడి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కోవిడ్ ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు.. చైనాలోని అతిపెద్ద కంపెనీ అయిన ఐఫోన్ ఫ్యాక్టరీ నుంచి కార్మికులు దొంగచాటుగా పారిపోతున్నారు. జెంగ్ ఝౌలోని ఫాక్స్ కాన్ ప్లాంట్ లోని వలస కార్మికులు.. కంచె దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారంతా తమ స్వస్థలాలకు వెళ్లేందుకు కాలినడకనే బయలు దేరారు. 

సిబ్బంది కదలికలపై నిఘా

ఫాక్స్ కాన్ కార్మికులు ఇంటికి తిరిగి వస్తున్నట్లు.. పగటిపూట పొలాల మీదుగా.. రాత్రి రోడ్ల వెంట ట్రెకింగ్ చేస్తున్నట్లుగా ఫోటోలు చైనీస్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మెంగ్‌జౌ, లుయోయాంగ్ వంటి నగరాలు కార్మికులను ఐసోలేషన్ సైట్‌లకు తీసుకెళ్లేందుకు బస్సులను ఏర్పాటు చేశాయి. లాక్ డౌన్ సమయంలో ఈ కంపెనీలు.. కార్మికులు పనిచేసేందుకు వీలు కల్పిస్తాయి. అయితే వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతాయి. కొంతమంది ఫ్యాక్టరీలోనే నిద్రపోవాల్సి వస్తుంది. గత మే నెలలో
షాంఘైలోని క్వాంటా కంప్యూటర్ ఫ్యాక్టరీలో వందలాది మంది కార్మికులు భద్రతా సిబ్బందితో ఘర్షణ పడ్డారు. మరికొంతమంది బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా నెలల తరబడి నిషేధించబడ్డారు.

కార్మికుల ఇబ్బందులు

ఫాక్స్‌కాన్‌ ప్లాంట్ లో గత వారం రోజుల్లో 167 మంది కోవిడ్ పాజిటివ్ సోకింది. దీంతో ఇన్ ఫెక్షన్ల సంఖ్య కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో కోవిడ్ కేసులను అరికట్టేందుకు పలువురు సిబ్బందిని ప్లాంట్ లోని క్వారంటైన్ లో ఉంచారు. అయితే అక్కడ వారికి ఆహారంతో పాటు సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్లాంట్ యాజమాన్యం విఫలమైంది. దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అక్కడి నుంచి తప్పించుకుని తమ స్వస్థలాలకు వెళ్లేందుకు గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. 

తగ్గనున్న ఉత్పత్తి

చైనా కొవిడ్ ఆంక్షలను కఠినతరం చేయడంతో యాపిల్‌ ఐ ఫోన్ల ఉత్పత్తి వచ్చే నెలలో దాదాపు 30 శాతం పడిపోవచ్చని విశ్వసనీయ వర్గాలు అంచనావేస్తున్నాయి. ఈ లోటును భర్తీ చేసుకోవడానికి షెన్‌జెన్‌ నగరంలోని మరో కేంద్రంలో ఉత్పత్తిని పెంచనున్నట్టు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ తయారీదారులకు అత్యంత కీలకమైన సెలవుల సీజన్‌లో ఈ ఆంక్షలు రావడంతో ఉత్పత్తిపై ప్రభావం పడనుంది. దీనిపై ఫాక్స్‌కాన్‌ స్పందించింది. లోటును భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.