చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మరోసారి హిస్టరీ క్రియేట్ చేశారు. ముచ్చటగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జిన్ పింగ్ అధ్యక్ష పదవిని ఉన్నతస్థాయి సభ్యులు ఆమోదించారు. మావో తర్వాత దేశంలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఇక మార్చిలో జరగబోయే ప్రభుత్వ వార్షిక శాసనసభ సమావేశాల్లో జిన్ పింగ్ పేరును అధికారికంగా మరోసారి చైనా అధ్యక్షుడిగా ప్రకటించనున్నారు.
ఈ సందర్భంగా పార్టీ తనపై పెట్టిన నమ్మకానికి జిన్ పింగ్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచినందుకు శ్రద్ధగా పనిచేస్తానని.. పార్టీకి, ప్రజలకు మాటిచ్చారు. మావో జెడాంగ్ తరువాత అంతటి శక్తివంతమైన నాయకుడిగా జిన్ పింగ్ పేరు సంపాదించుకున్నారు. గతంలో పార్టీలో రెండు పర్యాయాలు మాత్రమే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలనే నియమం ఉండేది. అయితే 2018లో జిన్ పింగ్ ఈ నియమాన్ని రద్దు చేశారు. దీంతో మూడోసారి మాత్రమే కాదు... ఎన్ని సార్లు అయినా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం ఏర్పడింది.
షాంఘైలో చైనా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేసిన లీ కియాంగ్ ను... ప్రధానిగా ఎన్నుకున్నారు. కియాంగ్ పేరును.. జిన్ పింగ్ అధికారికంగా ప్రకటించారు. దీంతో పాటు పార్టీ పొలిట్‌బ్యూరో.. స్టాండింగ్ కమిటీ కొత్త సభ్యల పేర్లను కూడా వెల్లడించారు. ఈ కమిటీలో షీ జిన్‌పింగ్, లీ కియాంగ్‌తో పాటు ఝావో లిజి, వాంగ్ హునింగ్, కాయి కి, డింగ్ షూషాంగ్, లీషీకు స్థానం కల్పించారు. శనివారం వరకు జరిగిన పార్టీ కాంగ్రెస్ సమావేశాలను విజయవంగా ముగించామని జిన్ పింగ్ అన్నారు. ఇక వివిధ దేశాల అధిపతులు తనను అభినందిస్తూ.. సందేశాలు పంపుతున్నట్లు షీ జిన్‌పింగ్ వెల్లడించారు.
