
రాష్ట్ర రాజధానిలో అడుగుపెట్టిన వేళ.. మన సంస్కృతి ఉట్టిపడేలా బొట్టుపెట్టి..డప్పు చప్పుళ్లు.. కళాకారుల నృత్యాలతో ఆహ్వానించడం ఆరుదైన ఘట్టానికి హైదరాబాద్ వేదికైంది. రాష్ట్ర చరిత్ర.. పర్యాటకానికి ప్రపంచస్థాయి గుర్తింపు.. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ విశ్వవ్యాప్తంగా చాటి చెప్పే సమయం ఇది. తెలంగాణ హెరిటేజ్, మెడికల్, టెంపుల్ టూరిజానికి అంతర్జాతీయస్థాయిలో కలకాలం గుర్తిండిపోయేలా.. రాష్ట్రం కీర్తి ప్రతిష్టలు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో చిరస్థాయిగా నిలిచేలా.. రాష్ట్ర ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలను విశ్వనగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది.
మిస్ వరల్డ్ పోటీలు ఈ నెల 10 వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి 120 మంది ప్రపంచ సుందరీమణులు తరలి వచ్చారు. అందాల పోటీలంటే అదేదో సరదాకు నిర్వహించేవి కావు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకే ప్రభుత్వం నిర్వహిస్తోంది. తద్వారా పెట్టుబడులు పెద్ద ఎత్తున్న ఆకర్షించాలనే ఆలోచనతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర అభివృద్ధితోపాటు ఇక్కడ సంస్కృతీ సంప్రదాయాలకు పర్యాటకపరంగా ఉన్న అవకాశాలను అన్నింటినీ ప్రపంచానికి చాటేలా 'తెలంగాణ జరూర్ ఆనా' పేరుతో అందాల పోటీలు జరగనున్నాయి.
పర్యాటక స్థలాల్లో అందాల పోటీలు
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు 120 దేశాల నుంచి అందాల భామలు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. 10వ తేదీన తెలంగాణ జానపద, గిరిజన నృత్యాలతో వేడుకలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 12వ తేదీన నాగార్జునసాగర్‌లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును, బుద్ధిస్ట్ థీమ్ పార్కును కంటెస్టెంట్లు సందర్శించనున్నారు. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద బౌద్ధక్షేత్రం. 12వ తేదీ రోజు హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వం చార్మినార్, లాడ్ బజార్లలో అందాల తారలు హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. మే 13వ తేదీన చౌమొహల్ల ప్యాలెస్‌ను సందర్శించి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ లో పాల్గొంటారు.
ఓరుగల్లు ఆధ్యాత్మిక అందాలు
మే 14న వరంగల్లోని వెయ్యిస్తంభాల గుడి, పోర్ట్, యునెస్కో వారసత్వ సంపద అయిన రామప్ప ఆలయాన్ని సందర్శించి, అక్కడే పేరిణీ నృత్యాన్ని తిలకించేలా కార్యక్రమం జరగనుంది. వరంగల్లోని వేయి స్తంభాల గుడి కాకతీయుల కళాత్మక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఒక అద్భుత కట్టడం. తెలంగాణలోనే అత్యంత పురాతమైన దేవాలయంగా పేరు గాంచింది. ఈ ఆలయం 2021లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది.
యాదగిరిగుట్ట, పోచంపల్లి
15వ తేదీన యాదగిరిగుట్టను సందర్శించనున్నారు. పోచంపల్లిలోని చేనేత వస్త్రాల తయారీని తెలుసుకోవడంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకిస్తారు. ఈ వస్త్రాలు, ముఖ్యంగా ఇక్కత్ (ఇకత్) చీరలు, సంప్రదాయ జ్యామితీయ నమూనాలు..అద్భుతమైన నేత కళకు ప్రసిద్ధి. అందాల తారలు అత్యంత ప్రసిద్ధి గాంచిన ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు తిలకించేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. తద్వారా తెలంగాణ ప్రపంచానికే పరిచయం చేసేలా ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తున్నది.
హైదరాబాద్ ఆధునికత
16వ తేదీన హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో నిర్వహించే మెడికల్ టూరిజం ఈవెంట్‌కు హాజరవుతారు. మహబూబ్‌నగర్‌లోని పిల్లల మర్రి వృక్ష సందర్శన, హైదరాబాద్‌లోని ఎక్స్పీరియన్ ఏకో పార్కును సందర్శిస్తారు. అనంతరం మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించే మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫైనల్ పోటీల్లో పాల్గొంటారు. ప్రపంచంలోనే పెద్ద ఫిల్మ్ సిటీల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శిస్తారు. 18వ తేదీన తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, తెలంగాణ సచివాలయాన్ని సందర్శిస్తారు. ట్యాంక్ బండ్‌పై నిర్వహించే సండే ఫండే కార్నివాల్లో పాల్గొంటారు.
మెడికల్ టూరిజం
మెడికల్ టూరిజంలో దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోంది. 2014లో 75 వేల 171 మంది విదేశీ హెల్త్ టూరిస్టులు వైద్యసేవలు పొందేందుకు హైదరాబాద్‌కు రాగా, 2024 వరకూ దశాబ్ద కాలంలో లక్షా 55 వేల 313 మంది వచ్చినట్లు రికార్డుల్లో
స్పష్టమవుతున్నది. అదే సమయంలో 2024లో 8కోట్ల 82 లక్షల 39 వేల 675 మంది రోగులు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వైద్య సేవల కోసం తెలంగాణకు రావడం చారిత్రాత్మకం. ఇపుడు మిస్ వరల్డ్ ఈవెంట్ నిర్వహణతో గ్లోబల్ మెడికల్ టూరిజాన్ని ప్రపంచంలోనే గొప్పగా తెలంగాణను నిలబెట్టనుంది.
31న ముగుస్తాయి
"తెలంగాణ జరూర్ ఆనా" నినాదం ప్రతి చోటా కనిపించేలా, వినిపించేలా పర్యాటకశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక 20వ తేదీ నుంచి మిస్ వరల్డ్ ప్రధాన పోటీల్లో కీలక ఘట్టాలు ప్రారంభం కానున్నాయి. ఆయా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారితో మే 31వ తేదీన మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే పోటీలు ఘనంగా నిర్వహించనున్నారు. 31న జరిగే ఫినాలేతో ఈ పోటీలు ముగుస్తాయి.
బ్రాండ్ ఇమేజ్ పెరగనుంది
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవనున్నాయి. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ఏ కంగా విశ్వవ్యాప్తం కావడం వల్ల ప్రపంచపటంలో హైదరాబాద్‌కు ప్రత్యేకమైన గుర్తింపు రానుంది. తెలంగాణ ప్రసిద్ధ స్థలాలు ప్రపంచానికి తెలియడంతోపాటు విదేశీ టూరిజం మరింత పెరిగే అవకాశముంది. తద్వారా వివిధ పరిశ్రమలు, ప్రాజెక్టుల ఏర్పాటుకు భారీగా పెట్టుబడులు ప్రవాహంలా వస్తాయి. తెలంగాణ సర్వతోముఖావృద్ధికి ఈ మిస్ వరల్డ్ పోటీలు దోహదపడుతాయనడంలో ఎలాంటి సందేహం అక్కర లేదు. విశ్యవ్యాప్తంగా తెలంగాణ పేరు మారుమోగనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంచి పేరు రావడం ఖాయం. ఇది రాష్ట్రానికి, ప్రజలకు శుభాపరిణామం.
-జి. లక్ష్మణ్ కుమార్,అసిస్టెంట్ డైరెక్టర్, సమాచార పౌరసంబంధాల శాఖ,కరీంనగర్-