క్రికెట్‌ను వదిలి.. వరల్డ్​లోనే రిచెస్ట్​​ బ్యాంకర్‌గా మారి..‌

క్రికెట్‌ను వదిలి.. వరల్డ్​లోనే రిచెస్ట్​​ బ్యాంకర్‌గా మారి..‌

వరల్డ్​లోనే రిచెస్ట్​​ బ్యాంకర్‌‌‌‌ ఉదయ్ కొటక్

రూ.1.17 లక్షల కోట్లుగా సంపద
బ్యాంక్‌ పై ఇన్వెస్టర్లలో పెరిగిన నమ్మకం
గుడ్ గవర్నెన్స్‌‌లో మంచి పేరు
క్రికెట్ నుంచి ప్రముఖ బ్యాంకర్‌‌‌‌గా మలుపు తిరిగిన కెరీర్

బిజినెస్ డెస్క్, వెలుగు: క్రికెటర్ అవుదామనుకుని చావు అంచుల దాకా వెళ్లొచ్చిన ప్రముఖ బ్యాంకర్‌‌ ఉదయ్ కొటక్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమే. 26 ఏళ్ల వయసులోనే ఫైనాన్స్ వ్యాపారం ప్రారంభించిన ఉదయ్.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న బ్యాంకర్‌‌‌‌గా ఎదిగారు. బ్లూమ్‌‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ ఉదయ్ కొటక్ సంపద సుమారు 16 బిలియన్ డాలర్లుగా అంటే రూ.1,17,660 కోట్లుగా ఉండొచ్చని లెక్కకట్టింది. ఒకవైపు ఇండియాలో షాడో బ్యాంక్‌‌లు లిక్విడిటీ కొరతతో ఇబ్బందులు పడుతోన్న సమయంలో.. కొటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ ఒక వెలుగు వెలుగుతోంది. రిస్క్ ఎక్కువగా ఉన్న రంగాలకు రుణాలను తగ్గించడం ద్వారా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పొందింది. గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్‌‌తో ప్రైవేట్ బ్యాంక్‌‌లలో మంచి పేరును సంపాదించుకుంది. కరోనా వైరస్‌‌తో బ్యాంకింగ్ సిస్టమ్‌‌లో అప్పులు తీసుకున్న వారు చెల్లించలేక ఇబ్బందులు పడిన క్రమంలో కూడా కొటక్ మహీంద్రా బ్యాంక్‌‌ ఇన్వెస్టర్లలో తన కాన్ఫిడెన్స్‌‌ను కోల్పోలేదు. బారోవర్స్ అప్పులు తిరిగి చెల్లించలేకపోతుండటంతో.. తన బ్యాలెన్స్ షీటును మెరుగుపర్చుకునేందుకు అవసరమైన క్యాపిటల్ సేకరించింది. అంతేకాక తన కస్టమర్లకు నిరంతరాయ సేవలను అందించింది. దీంతో ఈ బ్యాంక్‌‌పై ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. కరోనా సంక్షోభ సమయంలో బిగ్గెస్ట్ విన్నర్లలో ఇది ఒకటిగా నిలిచింది.

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా బ్యాంక్‌‌ల షేర్లు కొంచెం అటుఇటూగా ఉంటే..  కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు మాత్రం 17 శాతం వరకు లాభపడి ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపించాయి. మరో మూడేళ్ల వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌‌‌‌గా ఉదయ్ కొటక్‌‌ పదవీ కాలాన్ని పొడిగించడంతో బ్యాంక్ షేర్లకు జోష్ వచ్చింది.  ప్రస్తుతం కొటక్ మహీంద్రా బ్యాంక్ షేరు రూ.1,914 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రూ.3.86 లక్షల కోట్లను మించిపోయింది.  మార్కెట్ వాల్యూ పరంగా తీసుకుంటే రెండో అతిపెద్ద బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంకే కావడం విశేషం. సెప్టెంబర్ 30తో ముగిసిన క్వార్టర్‌‌‌‌లో బ్యాంక్ నికర లాభం అనూహ్యంగా 27 శాతం పెరిగింది. గత మూడేళ్లుగా ఈ బ్యాంక్ షేర్లు 24 శాతానికి పైగా లాభాలు పండించాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంక్‌‌లు బ్యాడ్ లోన్ రేషియోలతో ఇబ్బందులు పడుతున్నాయి. షాడో బ్యాంక్‌‌లు, కొన్ని బ్యాంక్‌‌లు లిక్విడిటీ సమస్యను ఎదుర్కొంటున్నాయి. లెక్కల్లో చూపకుండా కొన్ని బ్యాంక్‌‌లు ఇబ్బడిముబ్బడిగా లోన్లు ఇచ్చి ఇరకాటంలో పడ్డాయి. దీంతో దివాలా స్థితికి వచ్చాయి. వాటి అసెట్ క్వాలిటీ దెబ్బతింది. ప్రాఫిట్స్ తగ్గాయి. దీనికి తోడు కరోనా బ్యాంక్‌‌లను మరింత ఇబ్బందుల్లో పడేసింది. ఈ సమయంలో రిస్క్‌‌ ఎక్కువగా ఉన్న సెక్టార్లకు రుణాలను ఇవ్వడాన్ని కొటక్ మహీంద్రా బ్యాంక్ తగ్గించింది. చిన్న, మధ్య తరహా సంస్థలకు, అన్‌‌సెక్యూర్డ్ ఇండివిడ్యువల్స్‌‌కు లోన్ల జారీలో జాగ్రత్తలు వహించింది. దీంతో ఇన్వెస్టర్ల నుంచి మంచి పేరును పొందింది.  కొటక్ మహీంద్రా బ్యాంక్ బ్యాడ్ లోన్ రేషియో కొంచెం పెరిగినప్పటికీ.. మిగతా వాటితో పోలిస్తే చాలా తక్కువగానే ఉంది. క్యాపిటల్ అడిక్వసీ స్కోర్‌‌‌‌లో ఇది ముందంజలో ఉంది. గత నెలలోనే బ్యాంక్‌‌లలో ఫౌండర్లు వాటా పెంచుకోవచ్చని ఆర్‌‌‌‌బీఐ చెప్పడంతో బ్యాంక్‌‌కు ఇది మరో బూస్టప్‌‌గా నిలిచింది.

రూ.30 లక్షలు అప్పుగా తెచ్చి…

గుజరాత్‌‌కు చెందిన ఉదయ్ కొటక్, 1985లో తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌‌ను నుంచి రూ.30 లక్షలు అప్పుగా తీసుకుని ఇన్వెస్ట్‌‌మెంట్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏడాది మహీంద్రాతో పార్టనర్‌‌‌‌షిప్ కుదుర్చుకున్నారు. ఇన్వెస్ట్‌‌మెంట్ కంపెనీ క్రమంగా లోన్ ఇవ్వడం ప్రారంభించింది. ఆ తర్వాత స్టాక్ బ్రోకింగ్‌‌లోకి, ఇన్వెస్ట్‌‌మెంట్ బ్యాంకింగ్‌‌లోకి, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ సెక్టార్‌‌‌‌లోకి అడుగు పెట్టింది. ఆర్‌‌‌‌బీఐ ఆమోదంతో 2003లో ఇది కొటక్ మహీంద్రా బ్యాంక్‌‌గా ఏర్పడింది. ప్రారంభం నుంచి ఈ బ్యాంక్‌‌కు సీఈవోగా ఉదయ్ కొటక్‌‌నే ఉంటున్నారు. గోల్డ్ మ్యాన్ శాచ్స్‌‌తో పార్టనర్‌‌‌‌షిప్‌‌ను తెంచేసుకోవడంతో ఈ బ్యాంక్‌‌పై మరింత కంట్రోల్‌‌ను ఉదయ్ కొటక్ పొందారు. రిస్క్ ఎక్కువగా ఉన్న రంగాలకు అప్పులు ఇవ్వడం తగ్గించడం, ఫార్మ్ ఎక్విప్‌‌మెంట్‌‌కు, వెహికల్స్‌‌కు లోన్లు ఇవ్వడం ద్వారా కొటక్ మహీంద్రా బ్యాంక్ లాభపడినట్టు హెచ్‌‌డీఎఫ్‌‌సీ సెక్యూరిటీస్ లిమిటెడ్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని అన్నారు. ఇండియాలోని ఫ్యామిలీ ఓన్డ్ ఎంటర్‌‌‌‌ప్రైజస్ మాదిరిగా.. టాప్ ఎగ్జిక్యూటివ్ స్థానాల్లో లేదా బ్యాంక్ బోర్డులో తన ఫ్యామిలీ మెంబర్లను ఎవర్ని నియమించలేదు. ఇన్వెస్టర్ల, డిపాజిటర్ల కాన్ఫిడెన్స్‌‌ను కోల్పోకుండా ఉండేందుకు గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్‌‌ను అమలు చేస్తున్నారు. పారదర్శకత లోపించకుండా చూసుకుంటున్నారు. ఇదంతా ఉదయ్ వల్లే సాధ్యమైందని మాజీ బ్యాంకర్ అనంత్ నారాయణ్ అన్నారు. ఆయన కింద చాలా మంది మంచి వారు పనిచేస్తున్నారని,  వీళ్లందర్ని ఉదయ్ బాగా చూసుకుంటారని పేర్కొన్నారు.  ఇప్పుడు ఉదయ్ ఉన్న జాబ్‌‌లోకి ఎవరైనా వెళ్లాలనుకుంటే అది చాలా కష్టమేనని, ఉదయ్ కేవలం ఒక వ్యక్తి కాదని ఆయనే ఒక సంస్థ  అని కొనియాడారు. ప్రస్తుతం కొటక్ మహీంద్రా బ్యాంక్ ఇండస్‌‌ఇండ్ బ్యాంక్ లిమిటెడ్‌‌ను కొనేందుకు చూస్తోంది.

బాల్ దెబ్బకు చావు అంచుల వరకు…

కొటక్‌‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం . ప్రొఫెషనల్ ప్లేయర్‌‌గా గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన చాలా కలలు కన్నారు. కానీ ఒకే ఒక్క సంఘటన ఆయన కెరీర్‌‌‌‌ను మలుపుతిప్పింది. 20 ఏళ్ల వయసులో ఒకసారి క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ వచ్చి బలంగా తన తలకు తగలడంతో ఆయనకు పెద్ద సర్జరీ
చేయాల్సి వచ్చింది. చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు. ఆ దెబ్బకు ఉదయ్ కొటక్ ఫ్యామిలీ అంతా ఇంకోసారి క్రికెట్ ఆడితే బాగోదని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆయన క్రికెట్‌ ను వదలి ఫ్యామిలీ బిజినెస్‌‌ల కోసం ఎంబీఏ చేయాల్సి వచ్చింది.