డబ్ల్యూటీవో షరతులే ఎమ్ఎస్​పీకి అడ్డంకి! : దొంతి నర్సింహారెడ్డి

డబ్ల్యూటీవో షరతులే ఎమ్ఎస్​పీకి అడ్డంకి! : దొంతి నర్సింహారెడ్డి

స్వాతంత్ర్య భారత దేశంలో రైతుల పరిస్థితి ఏమీ మారలేదు. ఇంకా దిగజారింది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ విధానాలు. ఈ మార్పులు మూడు దశలలో చూడవచ్చు. 1960వ దశాబ్దం మధ్యలో మొదలుపెట్టిన హరిత విప్లవం, 1990లలో ఆర్థిక సంస్కరణలు.. ఆ తరువాత ప్రపంచ వాణిజ్య ఒప్పందం, 2005 నుంచి మొదలు అయిన ‘స్వేచ్ఛా వాణిజ్య’ దశ.  ఈ మూడు దశలు ఒకదానికొకటి ముడిపడి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మొదటి దశ మార్పు వ్యవసాయ పద్ధతులను గురి పెట్టింది. భారత వ్యవసాయాన్ని ‘వెనుకబడిన’ పద్ధతిగా చిత్రీకరించి అధిక హైబ్రిడ్ వంగడాలు, అధిక దిగుబడి పేరుమీద సాగు పద్ధతులను లక్ష్యంగా చేసుకుంది.

అమెరికన్ శాస్త్రవేత్తలు, సంస్థలు, నిధులు, వారు సూచించిన విధానాల మార్పు మొత్తంగా ‘హరిత విప్లవంగా’ నామకరణం చేసి మొదట్లో పెద్ద ఎత్తున, ఆ తరువాత నిరంతరంగా వ్యవసాయ పెట్టుబడులను ప్రభుత్వం పెడుతూనే ఉన్నది. అయినా హైబ్రిడ్ వంగ డాలు- కేంద్రంగా కృత్రిమ ఎరువుల మీద ఆధారపడిన సాగువైపు రైతులు మళ్లడం లేదు అని ప్రభుత్వం ఉచితంగా, సబ్సిడీల వ్యూహం తీసుకువచ్చింది. పంచ వర్ష ప్రణాళికలు హరిత విప్లవానికి దన్నుగా బడ్జెట్ కేటాయింపులు మళ్లించడంలో సహకరించాయి. 

ధనిక దేశాల్లోనూ రైతులకు సబ్సిడీ

పబ్లిక్ స్టాక్‌‌ హోల్డింగ్ (PSH) అనేది దేశంలో ఆహార కొరతను నివారించడం, అందరికి ఆహారాన్ని అందించడం, ఆహార భద్రతకు ప్రభుత్వం ఉపయోగించే విధానం. సాగు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఆహారం ధరలు పెరుగుతాయి. కాబట్టి ప్రజల అవసరాలను తీర్చడానికి పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ ప్రోగ్రామ్‌‌లను నిర్వహిస్తాయి. మరి ఆహారయేతర పంటలకు సబ్సీడీలు ఎందుకు ఇస్తారంటే ఆధునిక సాగు విధానాలను కొనసాగించడానికి. అందుకే, మార్కెట్ల మీద ఆధారపడే పెట్టుబడిదారి వ్యవస్థకు కేంద్రంగా భావించే అమెరికా, పశ్చిమ ధనిక దేశాలు కూడా రైతులకు సబ్సిడీలు ఇస్తాయి. 

2005 నుంచి ప్రతి ఏటా ఈ సబ్సిడీ భారం తగ్గించుకునే యుక్తులు వార్షిక కేంద్ర బడ్జెట్లో కనపడుతాయి. 2024–-25 బడ్జెట్లో కూడా తగ్గించారు. W.T.O నిబంధనల ప్రకారం ఆహారం నిలువలు, పంపిణీ వరకు సబ్సిడీల మీద కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆహార భద్రతకు అనుగుణంగా పేద ప్రజలకు ఆహారం ఇవ్వడానికి రైతుల నుంచి పంటల సేకరణకు ప్రభుత్వ పెట్టుబడుల మీద 10% పరిమితి ఉన్నది. గతంలో అభివృద్ధి చెందిన దేశాలకు 5% , అభివృద్ధి చెందుతున్న దేశాలకు 10% సబ్సిడీ ఉండేది. దీనిమీద 1995 నుంచి వివాదం నడుస్తున్నది. 

భారత్​పై అమెరికా ఒత్తిడి

 అమెరికా నుంచి గత 29 ఏండ్లుగా మన దేశీయ వ్యవసాయ, ఆర్థిక విధానాల మీద ఒత్తిడి కొనసాగుతున్నది. ఆహారం మీద సబ్సిడీ రైతుల కోసం కాదు. పేదలకు ఆహారం అందించడానికి, ఆహారం ధరలు పెరిగితే ఆర్థికాభివృద్ధికి ఆటంకం అవుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది అని ప్రభుత్వమే అనేక నివేదికలలో స్పష్టం చేసింది.  అమెరికా తన ఎగుమతి మార్కెట్లను కాపాడుకోవటానికి పత్తి మీద అక్కడి కంపెనీలకు ఒక్కోసారి 100 శాతం సబ్సిడీ ఇస్తుంది. ఇట్లా ఇవ్వడం ఆ ప్రభుత్వ ఖజానాకు భారం అవుతుంది కనుక తమ ఎగుమతులకు పోటీవచ్చే ఇతర దేశాల ఉత్పత్తుల ధరలు పడిపోకుండా, వాటికి ‘సబ్సిడీలు అందకుండా, అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా ఒత్తిడి తీసుకువస్తుంది.  

ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) 13వ వాణిజ్య మంత్రుల సమావేశం (MC13) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌‌లోని అబుదాబిలో జరిగింది. ఈ సమావేశంలో బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థ పనితీరును సమీక్షిస్తూ, భవిష్యత్తులో వాణిజ్యం మీద ఉమ్మడి అవగాహన కోసం చర్చలు జరిపారు. ఈ సమావేశంలో చర్చిస్తున్న ముఖ్యమైన అంశాలలో వ్యవసాయ వాణిజ్యం, ఈ–-కామర్స్ కస్టమ్స్ డ్యూటీలపై తాత్కాలిక నిషేధం, వివాద పరిష్కార సంస్కరణలు, మత్స్యరాయితీలు, వంటివి ఉన్నాయి. ఈ సమావేశంలో భారత వాణిజ్య మంత్రి ఆహార భద్రత కోసం దీర్ఘకాలంగా ఉన్న పబ్లిక్ స్టాక్‌‌హోల్డింగ్ అంశంపై శాశ్వత పరిష్కారానికి పిలుపునిచ్చారు. 

కేంద్రానికి షరతులే బంధనాలు

ఢిల్లీలో 2020–-21లో  రైతులు చేసిన ఉద్యమం కోరిన మార్పులు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవటానికి కారణం.. బాలిలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) 9వ వాణిజ్య మంత్రుల సమావేశంలో  జరిగిన ఒప్పందం. అభివృద్ధి చెందుతున్న దేశాలు పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ ప్రోగ్రామ్‌‌ల క్రింద సబ్సిడీలను డబ్ల్యూటీవో వివాద పరిష్కార వ్యవస్థలో సవాలు చేయకుండా అనుమతించే  మధ్యంతర "శాంతి నిబంధన" పై మంత్రులు బాలి సమావేశంలో అంగీకరించారు. 

అయితే, ఈ అంగీకారం వెనుక షరతులు ఉన్నాయి. ఆ షరతుల మీద సమాచారం ప్రజలకు చేరలేదు. చర్చ జరగడం లేదు. స్థూలంగా ఈ షరతులు ఏమంటే శాంతి నిబంధన కోరుకునే ప్రభుత్వాలు వాణిజ్యాన్ని వక్రీకరించవద్దు.  అంటే, ప్రపంచ మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, పరిమాణాలను ప్రభావితం చేయడం లేదా ఇతర దేశాల ఆహార భద్రతపై ప్రభావం చూపే చర్యలు (ఎగుమతులు, దిగుమతుల విధానాలు). ముఖ్యంగా, ఈ షరతులను పాటిస్తున్నట్లు నిరూపించే సమాచారాన్ని డబ్ల్యూటీవో కి అందించడం. 

ఈ షరతులలో భాగంగానే డబ్ల్యూటీవోకి 31 మార్చి 2023న ఒక నివేదిక సమర్పించింది. మొత్తంగా 9 నివేదికలు ఇచ్చింది. ఈ షరతులు ఉన్నందుకు, వాటిని ఒప్పుకున్నందుకు, కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరల మీద ప్రధాన మంత్రి హామీని అమలు చేయడం లేదు. ఎన్నికలలో ఓట్ల మీద దుష్ప్రభావం ఉంటుంది అని భావించినా ఇట్లాంటి వైఖరి అధికార పార్టీ తీసుకోవడానికి ఈ షరతులే బంధనాలు.

వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు

గడిచిన ముప్పై ఏండ్ల క్రితం వ్యవసాయ పద్ధతులు ఇప్పుడున్న పద్ధతులు చూస్తే సాగులో వచ్చిన మార్పులు స్పష్టంగా కనపడతాయి. అధిక దిగుబడి, కొత్త వంగడాలపై పూర్తిగా ఆధారపడే పరిస్థితికి తీసుకువచ్చారు. రసాయన ఎరువులు వల్ల మొదట్లో దిగుబడి పెరిగినప్పటికీ దీనితోపాటు పెట్టుబడులు పెరిగినవి. సారవంతమైన భూమి నిస్సారం అయిపోతున్నది. ఆహారంలో కూడా ఈ రసాయన అవశేషాలు చేరి అనారోగ్యం విస్తరిస్తున్నది.  రైతుకు సాగు ఖర్చు పెరిగింది. కానీ, రైతు పండించే పంటకు మాత్రం గిట్టుబాటు అదేస్థాయిలో ఉండటంలేదు.  సాగు విధానాలలో పెట్టుబడి పెట్టిన ప్రభుత్వం పంట గురించి మార్కెట్ మంత్రం మాట్లాడుతున్నది.  

ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ మూడు దశల వ్యవసాయ విధానాలు ఒకదానికొకటి పెనవేసుకుని కొనసాగుతూనే ఉన్నాయి. 1990లలో వచ్చిన ఆర్థిక సంస్కరణలు వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాల సంఖ్య తగ్గించడం ఒక సూత్రంగా పెట్టుకుని అమలు చేస్తున్నారు. సాగు పద్ధతిని మార్చి, సాగు ఖర్చుని పెంచిన విధానాలను సమీక్షించకుండా, వ్యవసాయ సబ్సిడీలు తగ్గించే పని పెట్టుకున్నారు. దాదాపు 15 ఏండ్లు (1990-–2005) మధ్య సబ్సిడీల తగ్గింపును  ప్రభుత్వం చేసింది.  క్రమంగా ప్రపంచ వాణిజ్య విధానాలు రావడంతో,  దేశీయ విధానాల మీద అంతర్జాతీయ ఒత్తిడులు పెరిగినాయి. 

‘బాలి నిర్ణయం’తో విఘాతం

5 ఆగస్ట్ 2014లో నిర్మల సీతారామన్ వాణిజ్య శాఖ మంత్రిగా డబ్ల్యూటీవో పట్ల భారత వైఖరి మీద ఒక 30 పేజీల స్టేట్మెంట్ ప్రవేశపెట్టిన సందర్భంలో పార్లమెంటులో చర్చ జరిగి దుమారం రేగింది.  తదుపరి, 27 నవంబర్ 2014, నిర్మల సీతారామన్ ఇంకొక స్టేట్మెంట్ పార్లమెంటులో ఇచ్చారు. ఒకరోజు ముందు జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థ బాలి నిర్ణయంగా విడుదల చేసిన సారాంశం భారత ప్రభుత్వం దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టలేదు అని నిరూపిస్తున్నది అనేది ఆ స్టేట్మెంట్ సారాంశం. 

‘బాలి నిర్ణయం’గా నామకరణం చేసిన ఈ ప్రకటనలో మొదటి పేరాలో స్పష్టంగా ఈ షరతులు ఉన్నాయి. ఆహార నిలువలపైన శాశ్వత పరిష్కారం 31 డిసెంబర్​ 2015 నాటికల్లా అంగీకరిం చాలని, అంగీకారం కుదరని పక్షంలో అది వచ్చేదాకా ‘బాలి నిర్ణయం’ అమలులో ఉంటుంది. స్థూలంగా, అంతర్జాతీయ వ్యవసాయ వాణిజ్యానికి కనీస మద్దతు ధరల వ్యవస్థ విఘాతం కలిగిస్తుంది అని మనం ఒప్పుకున్నట్లయ్యింది. అట్లా ఒప్పుకున్నందుకు అంతర్జాతీయంగా తన కీర్తిని, ప్రతిష్టను, గౌరవాన్ని  కాపాడుకునేందుకు రైతుల కోరికను కేంద్ర ప్రభుత్వం మన్నించే అవకాశం కనిపించడం లేదు.

- డా. దొంతి నర్సింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్​