వుహాన్ ల్యాబ్​లో కరోనా లేనేలేదు

వుహాన్ ల్యాబ్​లో కరోనా లేనేలేదు
  • డబ్ల్యూహెచ్​వో దర్యాప్తుకు ఒప్పుకోబోమన్న చైనా

బీజింగ్: కరోనా పుట్టుకపై దర్యాప్తు చేయాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) నిర్ణయంపై చైనా అసహనం వ్యక్తం చేసింది. వైరస్ ల్యాబ్​ నుంచి లీకైందన్న దానికి ఆధారాలే లేవని తేల్చి చెప్పింది. దానిపై మరోసారి దర్యాప్తు చేసేందుకు ఒప్పుకోబోమని స్పష్టం చేసింది. ఈ విషయంపై గురువారం చైనా అధికారులు మీడియాతో మాట్లాడారు. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందని నేషనల్ హెల్త్​ కమిషన్​ వైస్​మినిస్టర్​ జెంగ్ యిషిన్​ చెప్పారు. వైరస్​పై ప్రయోగాలు చేస్తుండగా కొందరు సైంటిస్టులకు వైరస్​ సోకిందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. వుహాన్​లోని ల్యాబ్​ నుంచే కరోనా వైరస్​ లీకైందని ఎప్పటి నుంచో అమెరికా సహా కొన్ని దేశాల సైంటిస్టులు, నిపుణులు చెప్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కొద్దినెలల క్రితం డబ్ల్యూహెచ్​వో నిపుణులు చైనా వెళ్లి దర్యాప్తు చేశారు కూడా.  తాజాగా దానిపై మరోసారి దర్యాప్తుకు డబ్ల్యూహెచ్​వో నిర్ణయం తీసుకుంది. దీనిపై మండిపడిన జెంగ్​.. అసలు వుహాన్​ ల్యాబ్​లో కరోనా వైరస్సే లేదని అన్నారు. ల్యాబ్​ నుంచి లీకైందన్న విషయాన్ని తేల్చడం కోసం నిర్ణయించిన దర్యాప్తుపై మరిన్ని వనరులను పెట్టేందుకు తాము సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. కరోనా ఎలా పుట్టిందన్న దానిపై స్టడీలు జరగాల్సిందేనని, రాజకీయ దురుద్దేశాలతోనే మళ్లీ ల్యాబ్​ లీక్​ థియరీలపై రెండో దశ దర్యాప్తు జరిపేందుకు సిద్ధమైందని విమర్శించారు. దానికి  సహకరించబోమని అన్నారు. 

ఫ్రాన్స్​లో నాలుగో వేవ్​

ఫ్రాన్స్​లో కరోనా నాలుగో వేవ్​ మొదలైపోయింది. ఇప్పటికే అన్నింటినీ ఓపెన్​ చేసేయడంతో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో వేరే దేశాల నుంచి వచ్చే వారికి ‘వ్యాక్సిన్​ సర్టిఫికెట్​’లను ఆ దేశ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. సినిమాలు, షికార్లు, మ్యూజియాలు, స్టేడియాలకు వెళ్లే వారు కచ్చితంగా కరోనా నెగెటివ్​ సర్టిఫికెట్​ను ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దానికి ఫ్రాన్స్​ ‘హెల్త్​ పాస్​’ అని పిలుస్తోంది. కాఫీ షాపులు, రెస్టారెంట్లు, షాపింగ్​ మాళ్లకు వెళ్లానుకున్నా హెల్త్​పాస్​ ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇక, ఐఫిల్​ టవర్​, ద లూవర్​ మ్యూజియం వంటి పర్యాటక ప్రాంతాల్లో వ్యాక్సిన్​ సర్టిఫికెట్లను పరిశీలించాకే లోపలికి అనుమతిస్తున్నారు. మాస్కులను తప్పనిసరి చేశారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. హెల్త్​పాస్​లు, వ్యాక్సిన్​ సర్టిఫికెట్లంటే హక్కుల ఉల్లంఘనేనని మండిపడుతున్నాయి. కాగా, అమెరికాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 83 % డెల్టా వేరియంట్లేనని సెంటర్​ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​ అండ్​ ప్రివెన్షన్​ (సీడీసీ) వెల్లడించింది.