స్పీడ్ అందుకున్న రేషన్.. వారంలోనే 50 శాతానికి పైగా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ

స్పీడ్ అందుకున్న రేషన్.. వారంలోనే 50 శాతానికి పైగా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ
  • వెంటవెంటనే స్టాక్​ తెప్పిస్తున్న ఆఫీసర్లు 
  • షాపుల వద్ద తగ్గుతున్న జనం
  • నెలాఖరు వరకు కొనసాగనున్న పంపిణీ 

యాదాద్రి, వెలుగు : జిల్లాలో రేషన్​ బియ్యం పంపిణీ స్పీడందుకున్నది. మూడు నెలల రైస్​ఒకేసారి ఇస్తుండడంతో లబ్ధిదారులు రేషన్​ షాపులకు పోటెత్తినా నెట్​వర్క్​స్లో కారణంగా మొదట్లో కొంత ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత పంపిణీ సాఫీగానే సాగుతోంది.  

వానాకాలం దృష్టిలో పెట్టుకొని..

ఈ వానాకాలం సీజన్​లో మూడు నెలల రేషన్​బియ్యం ఒకేసారి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన స్టాక్​ను సమకూర్చి ఈనెల 3 నుంచి రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీ షురూ చేసింది. మూడు నెలలకు సంబంధించిన సన్నబియ్యం ఒకేసారి ఇస్తుండడంతో లబ్ధిదారులు షాపుల ఎదుటబారులు తీరుతున్నారు. 

యాదాద్రిలో 2,18,963 కార్డులు..

యాదాద్రి జిల్లాలో గతంలో మార్చి వరకు 2,16,904 కార్డులు ఉండగా, ఇప్పుడా సంఖ్య 2,18,963కు చేరింది. కుటుంబ సభ్యుల సంఖ్య 6,76,188 నుంచి 7.20 లక్షలకు చేరింది. వీరికి ప్రతినెలా 4,483 టన్నుల బియ్యం అవసరం పడుతోంది. ఈ లెక్కన జూన్​ నుంచి ఆగస్టు వరకు ఇచ్చే మూడు నెలల కోటాకు 13,517 టన్నుల బియ్యం అవసరం. అయితే మే నెల బియ్యం పంపిణీ తర్వాత జిల్లాలో కేవలం 2 వేల టన్నులు మాత్రమే స్టాక్ ఉంది. దీంతో  జనగామ, వరంగల్, నల్గొండ నుంచి అవసరమైన స్టాక్ తెప్పిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 4 వేల టన్నులు జనగామ, వరంగల్​నుంచి జిల్లాలోని ఎంఎల్ఎస్​ పాయింట్లకు చేరింది.. అక్కడి నుంచి 515 షాపులకు బియ్యం చేరుతోంది. రేషన్ షాపుల్లో ఎంతమేర స్టాక్​ నిల్వ చేయగలిగితే ఆ స్థాయిలో బియ్యం అన్​లోడ్
 చేస్తున్నారు. 

50 శాతానికి పైగా బియ్యం పంపిణీ..

రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీ ఈనెల 3న జిల్లాలో ప్రారంభమైంది. ఎప్పటిలాగే 15 వరకే బియ్యం ఇస్తారన్న ఉద్దేశంతో లబ్ధిదారులు షాపులకు పోటెత్తున్నారు. నెలాఖరు వరకు పంపిణీ సాగుతుందని చెప్పినా లబ్ధిదారులు షాపుల వద్ద క్యూ కడుతున్నారు. మూడు నెలల కోటా కావడంతో ప్రతి లబ్ధిదారుడు మూడుసార్లు తంబ్ పెట్టడం లేదా ఐరీస్ నమోదు చేయాల్సి ఉంది. నెట్​వర్క్​సరిగా లేకపోవడం వల్ల స్లోగా నమోదు కావడం జరుగుతోంది. 

ఈ పరిణామాలతో ఒక్కో లబ్ధిదారుడికి దాదాపు 20 నుంచి 30 నిమిషాల టైం పడుతోంది. అయినప్పటికీ రేషన్​ పంపిణీ మాత్రం స్పీడ్​గానే సాగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 50 శాతానికి పైగా లబ్ధిదారులు బియ్యం తీసుకున్నారు. 

నెలాఖరు వరకు రేషన్ 

రేషన్​ పంపిణీపై ఎవరూ ఆందోళన చెందవద్దు. ప్రతి లబ్ధిదారుడికి బియ్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మూడు నెలల కోటా రైస్ జూన్ నెలాఖరు వరకు పంపిణీ చేస్తాం. - హనుమంతరావు, కలెక్టర్, యాదాద్రి