
- ప్రారంభించిన ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్
- భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు
యాదగిరిగుట్ట, వెలుగు: గుట్ట ఆలయంలో కొత్త ఎల్ఈడీ స్క్రీన్లను ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ప్రారంభించారు. అనంతరం ఆలయ క్షేత్ర బొమ్మల బుక్ ను ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆలయ అభివృద్ధి, టెంపుల్ సిటీ జియోగ్రాఫికల్ ఏరియా ఫైనలైజేషన్ పై ఆలయ, వైటీడీఏ అధికారులతో కలిసి రివ్యూ చేశారు. ఇప్పటికే డిజిటల్ సర్వే చేసిన ఆలయ, వైటీడీఏ భూములు, దేవస్థాన పరిధిలోని ప్రభుత్వ భూములకు హద్దులు, దేవాదాయ చట్ట అమెండమెంట్ వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చూశారు.
ఇటీవలే అందుబాటులోకి తెచ్చిన గరుడ ట్రస్ట్ విధివిధానాలు, ఈ – -ఆఫీస్ సేవలను పరిశీలించారు. గోశాల, వేద పాఠశాల, పుష్కరిణి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు దర్శన, మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే అభివృద్ధి పనులను కొనసాగిస్తున్న ఆలయ అధికారులను అభినందించారు.
భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శనం కల్పించి వేదాశీర్వచనం చేశారు. ఈవో వెంకటరావు లడ్డూ ప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేసి నారసింహుడి ఫొటోను బహూకరించారు.
కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్లు వినోద్ రెడ్డి, కృష్ణప్రసాద్, వెంకటేశ్, ఆర్డీవో కృష్ణారెడ్డి, తహసీల్దార్ గణేశ్ నాయక్, ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్ శర్మ, మున్సిపల్ కమిషనర్ లింగస్వామి ఉన్నారు.