యాసంగి పంట నష్టం రూ.8,700 కోట్లు

యాసంగి పంట నష్టం రూ.8,700 కోట్లు
  • యాసంగి పంట నష్టం రూ.8,700 కోట్లు
  • రైతులను నిండాముంచిన చెడగొట్టు వానలు
  • 12 లక్షల ఎకరాల్లో వరి.. 2 లక్షల ఎకరాల్లో మామిడి లాస్​
  • మొదటి విడతలో 1.51 లక్షల ఎకరాలుగా తేల్చిన సర్కార్​
  • రూ.151.64 కోట్ల సాయం ప్రకటన.. ఇంతవరకు పైసా అందలే


హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  రాష్ట్రంలో చెడగొట్టు వానలతో రైతులు భారీగా నష్టపోయారు. మార్చి 16 నుంచి కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తున్నది. ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగిన దాఖలాలు ఉన్నా 33శాతం దెబ్బతిన్న పంటలే విపత్తు నిర్వహణ కిందకు వస్తాయనే రూల్​తో సర్కార్ క్షేత్రస్థాయి సర్వే చేస్తున్నది. దీంతో పంట నష్టం భారీగా జరిగినా సర్కారు అంచనాలు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తున్నాయని వ్యవసాయరంగ నిపుణులు అంటున్నారు. ఫలితంగా రైతులకు అరకొర పరిహారం మాత్రమే అందే పరిస్థితి కనిపిస్తున్నది. 

రికార్డు స్థాయిలో సాగు.. నష్టం

ఈసారి యాసంగిలో రికార్డుస్థాయిలో పంటలు సాగయ్యాయి. యేటా సాధారణ సాగు 47.85 లక్షల ఎకరాలు కాగా.. ఈ సారి యాసంగిలో 72.63 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. యాసం గిలో వరి సాగులో కూడా రికార్డు సృష్టించింది. వరి సాధారణ సాగు 33.53 లక్షల ఎకరాలు కాగా, ఈ యేడు 56.44 లక్షల ఎకరాల్లో వరి వేశారు.

70 శాతం మామిడి లాస్

రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక టైమ్​లో వానలు పడుతూ యాసంగి పంటలకు తీవ్ర నష్టం కలిగించాయి. దీంతో ఈయేడు సాగైన 56.44 లక్షల ఎకరాల వరిలో దాదాపు 12 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అదే విధంగా మక్కలు, మామిడి, ఉద్యాన పంటలన్నీ కలిపి మరో 3 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది. 12 లక్షల ఎకరాల్లో నష్టపోయిన వరికి తక్కువలో తక్కువ అంచనా వేసినా రూ.4,800 కోట్ల లాస్ ఉంటుందని ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ చెప్తున్నారు. ఉద్యాన పంటల్లో మామిడికి తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్రంలో 3.05 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు  ఉండగా, దాదాపు 2 లక్షల ఎకరాల్లో దెబ్బతింది. 70 నుంచి 80 శాతం తోటలు దెబ్బతిన్నాయి. ఏటా సాధారణంగా 12 లక్షల టన్నుల మామిడి దిగుబడి వస్తుంది. ఈ ఏడాది దిగుబడి 9 లక్షల టన్నుల మామిడి దిగుబడిపై వర్షాల ఎఫెక్ట్‌‌‌‌ పడింది. యావరేజీగా రూ.40 వేలకు టన్ను ధర కట్టినా రూ.3,600 కోట్ల మేర నష్టం జరిగింది. మిగతా ఉద్యాన పంటలు ఎకరానికి యావరేజీగా రూ.30 వేల చొప్పున పంట నష్టం జరిగిందని ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ అంటున్నరు. ఇలా లక్షల ఎకరాలకు మరో రూ.300 కోట్ల నష్టం వాటిల్లిందనే అంచనాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ యాసంగి పంటలకు రూ.8,700 కోట్ల నష్టం జరిగినట్లు ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ అంచనా వేస్తున్నారు.

ఎక్కువ వర్షపాతం నమోదైన జిల్లాల్లో ఎఫెక్ట్‌‌‌‌ 

రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షపాతం రికార్డయ్యింది. 17 జిల్లాల్లో సాధారణం కన్నా అధికం, 15 జిల్లాల్లో సాధారణం కన్నా అత్యధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 879.6 మిల్లీ మీటర్లు కాగా.. అంతకు మించి 1,357 మిల్లీ మీటర్ల వర్షం పడింది. ఇది సాధారణం కన్నా 54% అధికం. మొత్తంగా ఇప్పటి దాకా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 1,914.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.  వర్షపాతం భారీగా నమోదైన జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైన జిల్లాల్లోనూ పంటలకు నష్టం జరిగింది.

సాయానికి భారీగా కోత

ఫీల్డ్‌‌‌‌ లెవల్‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌ ఆఫీసర్లు 32 అంశా లతో పంట నష్టం లెక్కింపు చేపట్టారు. మార్చి నెల 16 నుంచి కురిసిన అకాల వర్షా లు, వడగండ్ల వానలతో మొదట 5 లక్షల ఎకరాల్లో నష్టం జరిగిందని అంచనాలున్నా యి. ప్రతి జిల్లాలోని క్లస్టర్ల వారీగా పంట లెక్కలు ఏవోలు, డీఏవోల ద్వారా జిల్లా కలెక్టర్లకు పంపించారు. కలెక్టర్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2.28లక్షల ఎకరాల్లో నష్టం జరిగిందని తేల్చి రాష్ట్ర వ్యవసాయశాఖకు రిపోర్టు పంపించారు. వీటికి భారీగా కోత పెట్టిన అగ్రికల్చర్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్ లక్షా 51 వేల 645 ఎకరాలల్లో మాత్రమే నష్టం జరిగిందని తేల్చింది. 26 జిల్లాల్లోని లక్షా 30 వేల 988 మంది రైతులు పంట నష్టపోయారని, వారికి రూ.151 కోట్ల 64లక్షల 55 వేల పరిహారం అందిస్తామని ప్రకటించారు. కానీ సాయం ఇంత వరకు అందలేదు.