
కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైంది. కాసేపట్లో గవర్నర్ వజుభాయ్ వాలాను కలవనున్నారు యడ్యూరప్ప. తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతానని చెప్పారు. ఇవాళే యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
కుమారస్వామి రాజీనామా చేసి ఇప్పటికే 2 రోజులు గడిచిపోయింది. కర్ణాటక బీజేపీ ముఖ్య నేతలు నిన్న ఢిల్లీ వెళ్లి పార్టీ అగ్రనేతలతోచర్చలు జరిపారు. హైకమాండ్ ఆదేశాలతో గవర్నర్ వద్దకు వెళుతున్నారు యడ్యూరప్ప. గవర్నర్ ఆహ్వానిస్తే.. ఇవాళే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు యెడ్డీ.
స్పీకర్ సంచలన నిర్ణయం
కర్ణాటకలో స్పీకర్ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం సంచలనం రేపింది. రెబెల్ ఎమ్మెల్యేలు, మంత్రిపదవి ఆశావహుల్లో గుబులు రేపుతూ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు స్పీకర్. రాజీనామా చేసిన 18(16+2ఇండిపెండెంట్) మంది రెబల్ ఎమ్మెల్యేల్లో కేవలం ముగ్గురిపై వేటు పడింది. 2023 మే నెల వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై అనర్హత వేటు వేశారు స్పీకర్. రాజ్యాంగంలోని టెన్త్ షెడ్యూల్ ప్రకారం ఆయన ఈ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ పరిణామాలతో… మిగతా 13 మంది రెబల్ ఎమ్మెల్యేల తీరుపై మార్పు వస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. దీంతో. .. కర్ణాటకలో రాజకీయ ఉత్కంఠ మరింత పెరిగింది. రాజకీయపరిణామాలు మారుతున్నాయా అన్న అంచనాల నడుమ.. బీజేపీ అలర్టైంది. ఆలస్యం మంచిది కాదని… గవర్నర్ ను కలవాలని డిసైడైంది. గవర్నర్ వజూభాయి వాలా పర్మిషన్ ఇస్తే.. ఇవాళే ప్రమాణ స్వీకారం చేయడానికి యెడ్యూరప్ప సిద్ధమయ్యారు.