ఇండ్లలోనే యోగా.. ఆన్​లైన్​లో బాబా రామ్​దేవ్ లైవ్ సెషన్

ఇండ్లలోనే యోగా.. ఆన్​లైన్​లో బాబా రామ్​దేవ్ లైవ్ సెషన్
  • ‘యోగా ఫ్రమ్ హోమ్’ క్యాప్షన్ తో అమెరికాలో యోగా డే నిర్వహణ

వాషింగ్టన్: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈసారి అమెరికాలో ప్రపంచ యోగా డేను ఇళ్లలోనే జరుపుకోవాలని నిర్ణయించారు. ‘యోగా ఫ్రమ్ హోమ్’ అనే క్యాప్షన్ తో యోగా డేను జరుపుకుంటామని అమెరికాలో ఇండియన్ అంబాసిడర్ తరంజిత్ సింగ్ సంధు ఆదివారం మీడియాకు వెల్లడించారు. ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ యోగా ప్రొటోకాల్ పై ఆసనాలు, ప్రాణాయామం, మెడిటేషన్ కి సంబంధించిన వర్చువల్ సెషన్ ను హ్యూస్టన్ లోని ఇండియన్ కాన్సులేట్ సహకారంతో ఆన్ లైన్ లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధాన వర్చువల్ ఈవెంట్ వాషింగ్టన్ లోని ఇండియన్ హౌస్ నుంచి లైవ్ టెలికాస్ట్ అవుతుందని చెప్పారు. గడిచిన ఐదేళ్లలో ప్రతిసారీ వాషింగ్టన్ లోని జాతీయ స్మారక చిహ్నం వద్ద వేలాది మంది ఔత్సాహికులతో జూన్ 21 న అంతర్జాతీయ యోగా డే ను నిర్వహించారు. ఈ సారి కరోనా ఎఫెక్టుతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని నిర్ణయించారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా అమెరికాలో వైరస్ ఇన్​ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 20 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా 1.17 లక్షల మంది చనిపోయారు.