బ్రెస్ట్ క్యాన్సరా భయం వద్దు

బ్రెస్ట్ క్యాన్సరా భయం వద్దు

ఈరోజుల్లో బ్రెస్ట్ క్యాన్సర్​ అనే మాట బాగా వినిపిస్తోంది. దాదాపు ప్రతి యాభై మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్​ ఉంటోందని సర్వేలు చెప్తున్నాయి. అది ఒక్కసారి వచ్చిందంటే.. శారీరకంగానే కాదు, మానసికంగానూ దెబ్బతీస్తుంది. వెంటనే కనుక్కుని ట్రీట్​మెంట్ చేయించుకోవాలి అంటున్నారు డాక్టర్లు. కానీ, దాని లక్షణాలు కనిపెట్టడంలోనే పెద్ద చిక్కుంది. కొంతమందిలో అసలు లక్షణాలే కనిపించవు అంటున్నారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? దీని లక్షణాలను ఎలా గుర్తించాలి?ఏమేం ట్రీట్​మెంట్​లు ఉంటాయి? వంటి ప్రశ్నలకు డాక్టర్. పాలంకి సత్య దత్తాత్రేయ ఈ విధంగా జవాబిచ్చారు. అవేంటో ఆయన మాటల్లోనే...  
  
బ్రెస్ట్ క్యాన్సర్ అనేది క్యాన్సర్లలో ఒక రకం. రొమ్ములో ఉండే కణాలు కంట్రోల్ లేకుండా విపరీతంగా పెరిగిపోయే స్థితిని బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. ఈ క్యాన్సర్​ కణాలు పెరగడం అనేది ఒకవైపు రొమ్ములో లేదా రెండింటిలో మొదలుకావచ్చు. ఇది ఎక్కువగా ఆడవాళ్లలో వస్తుంది. కొన్నిసార్లు మగవాళ్లకు కూడా రావొచ్చు. 

నాలుగు స్టేజ్​లు

క్యాన్సర్ ఏ స్టేజీలో ఉందో తెలిస్తే ఏ ట్రీట్​మెంట్​ ఇవ్వాలనేది క్లారిటీ వస్తుంది. కాబట్టి ఎవరికైనా బ్రెస్ట్​ క్యాన్సర్​ ఉందని తెలిస్తే, అది శరీరంలో ఏ స్టేజీలో ఉందో టెస్ట్ చేస్తారు. మామూలుగా ఇందులో నాలుగు స్టేజ్​లు ఉంటాయి. రూల్ ప్రకారం, క్యాన్సర్ కణాల సంఖ్య తగ్గించడం, వ్యాప్తిని అడ్డుకోవడం చేస్తారు. మరీ ఎక్కువగా ఉంటే నాలుగో స్టేజ్​ అని అర్థం. అప్పుడు అది మిగతా అవయవాలకు కూడా వ్యాపిస్తుంది. 

వయసు పెరిగేకొద్దీ..

బ్రెస్ట్ క్యాన్సర్​ అనేది ఒకసారి వచ్చిందంటే, వయసుతోపాటు సమస్య కూడా పెరుగుతుంది. అయితే, 45 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ఆడవాళ్లలోనే 80 శాతం ఈ సమస్య కనిపిస్తుంది. వాళ్లలో 69​ శాతం రిస్క్​ కూడా ఎక్కువే. అలాగే, 65 లేదా ఆపైబడిన వారిలో 40 శాతం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వీళ్లలో అయితే, 43 మందిలో ఒకరికి ఈ సమస్య ఉంటోంది. 60–70 వయసున్న వాళ్లలో 29 మందిలో ఒకరికి, 70 పైబడిన వాళ్లలో అయితే 26 మందిలో ఒకరికి బ్రెస్ట్​ క్యాన్సర్ రిస్క్​ ఉంటుంది.

ఈ లక్షణాలు ఉంటే..

  • బ్రెస్ట్ క్యాన్సర్​ వచ్చినవాళ్లలో లక్షణాలు అందరికీ ఒకేలా ఉండవు. అలాగే కొంతమందికి అసలు లక్షణాలే కనిపించవు. లక్షణాలు ఉన్నవాళ్లలో ముఖ్యంగా కనిపించేవి ఏంటంటే.. రొమ్ములో లేదా చంక కింద (లంప్) గడ్డ ఏర్పడుతుంది. 
  • రొమ్ము గట్టిగా ఉండడం, రొమ్ము భాగంలో ఎక్కడైనా వాపు కనిపిస్తే అది బ్రెస్ట్ క్యాన్సర్​ లక్షణం. ఇరిటేషన్, రొమ్ము భాగంలో సొట్ట పడడం, రొమ్ము లేదా చనుమొన దగ్గర ఎర్రగా మారడం, లేదా పొరలాగా కనిపించడం వంటివి. 
  • చనుమొన (నిపుల్) భాగంలో నొప్పి, పాలు కాకుండా ఏదైనా ద్రవం లేదా రక్తం కారడం. బ్రెస్ట్ సైజ్, ఆకారంలో తేడాలు కనిపిస్తే అనుమానించాల్సిందే.
  • బ్రెస్ట్​ భాగంలో ఎక్కడైనా నొప్పిగా అనిపిస్తే క్యాన్సర్​ లక్షణం అని గుర్తించాలి. 
  • కొన్ని పరిస్థితులను బట్టి ఈ లక్షణాలు క్యాన్సర్​ లేని వాళ్లలోనూ కనిపించే అవకాశం ఉంది. 
  • అయితే, ఈ లక్షణాలు కనిపించినంత మాత్రాన
  • బ్రెస్ట్ క్యాన్సర్ ఉండాలని లేదు. కాబట్టి డాక్టర్​ 
  • దగ్గరకి వెళ్లి సమస్య ఏంటో తెలుసుకుంటే బెటర్. 

టెస్ట్​లు – ట్రీట్​మెంట్​లు

బ్రెస్ట్ క్యాన్సర్ కొన్నిసార్లు మాత్రమే లక్షణాలు చూపించాక క్యాన్సర్ వస్తుంది. ఎక్కువశాతం లక్షణాలు ఉండవు. అందువల్ల రెగ్యులర్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం ముఖ్యం. అయితే టెస్టుల్లో కొన్ని రకాలున్నాయి. వాటిలో మమ్మోగ్రామ్, బ్రెస్ట్ అల్ట్రాసౌండ్, బ్రెస్ట్ ఎం.ఆర్​.ఐ చేస్తారు. వాటితోపాటు క్యాన్సర్ కణాల మీద ఉన్న  వేర్వేరు రిసెప్టార్లను కనిపెట్టేందుకు బయాప్సి టెస్ట్ కూడా చేస్తారు. ట్రీట్​మెంట్ల విషయానికొస్తే.. సర్జరీ, రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ ట్రీట్​మెంట్​లు చేస్తారు. వీటిని రేడియాలజిస్ట్, పాతాలజిస్ట్​లు కలిసి పనిచేస్తారు. ఇందులో కూడా రకరకాల ట్రీట్​మెంట్​లు ఉన్నాయి. దీన్ని మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటారు. క్యాన్సర్ గడ్డలు చిన్నగా ఉన్నప్పటికీ త్వరగా పెరుగుతాయి. కొన్ని పెద్దగా ఉన్నా, నిదానంగా పెరుగుతాయి. వీటికి ట్రీట్​మెంట్ చేయాలంటే కొన్ని అంశాలు పరిశీలించాలి. అవేంటంటే... ట్యూమర్ (క్యాన్సర్​ గడ్డ) సబ్​ టైప్​లో ఉండడం, దానిపై హార్మోన్ రిసెప్టార్ల స్థితి, హెఇఆర్​2, నోడల్ స్టేటస్​లను బట్టి ఉంటుంది. తర్వాత ట్యూమర్ స్టేజ్​ని బట్టి ట్రీట్​మెంట్ ఇస్తారు. అవసరమైతే ఆంకోటైప్ డిఎక్స్ లేదా మామ్మా ప్రింట్ అనే స్పెషల్ టెస్ట్ చేస్తారు. పేషెంట్ వయసు, హెల్త్, మెనోపాజల్ స్థితి వంటివి చూసి ట్రీట్​మెంట్ ఇస్తారు. జన్యుపరంగా వచ్చినవైతే వాటి పరిస్థితి చూసి ట్రీట్​మెంట్​ చేస్తారు.  

సర్జరీలే ఎక్కువ

ఎక్కువశాతం ఆడవాళ్లు బ్రెస్ట్ క్యాన్సర్​కి సర్జరీ చేయించుకుంటారు. వాటిలో కూడా రకాలున్నాయి. అయితే, పేషెంట్ పరిస్థితులు, కొన్ని వేరే కారణాల రీత్యా ట్రీట్​మెంట్ ఇస్తారు. వాటిలో బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ లేదా మాస్టెక్టమీ ట్రీట్​మెంట్​లో క్యాన్సర్​ని వీలైనంతవరకు తొలగిస్తారు. మరో పద్ధతిలో చేతి కింద ఉన్న లింఫ్​ నోడ్స్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు యాక్జిలరీ లింఫ్ నోడ్ డిసెక్షన్ చేస్తారు. బ్రెస్ట్ రీకన్​స్ట్రక్షన్​ ట్రీట్​మెంట్​లో క్యాన్సర్ తొలగించి, రొమ్ము ఆకారాన్ని తిరిగి మామూలు స్థితికి తెస్తారు. చివరిగా పల్లేటివ్ ఇంటెంట్​లో అడ్వాన్స్​డ్​ సింప్టమ్స్​, అంటే లక్షణాల నుంచి కొంత ఉపశమనాన్ని ఇస్తారు.

రిస్క్ ఎప్పుడంటే..

బ్రెస్ట్ బయాప్సీ చేసినప్పుడు లోబ్యులార్ కార్సినోమా ఇన్ సిటు (ఎల్​సిఐఎస్) లేదా బ్రెస్ట్​లో కణాలు లేదా కణజాలం ఎక్కువగా ఉండడం (హైపర్ ప్లేసియా) వల్ల రిస్క్ పెరుగుతుంది. ఫ్యామిలీ హిస్టరీలో తల్లి, సోదరి, కూతురు ఉంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. యంగ్ ఏజ్​లో వస్తే, రిస్క్ కూడా ఎక్కువే. అయినప్పటికీ, ఫ్యామిలీ హిస్టరీ లేకున్నా ఎఫెక్ట్ అవుతున్నారు చాలామంది. రేడియేషన్​కి ఎక్స్​పోజ్ అవ్వడం వల్ల వచ్చే ఛాన్స్ ఉంది. చిన్నప్పుడు లేదా యంగ్ ఏజ్​లో రేడియేషన్ ట్రీట్​మెంట్ తీసుకుని ఉంటే బ్రెస్ట్​ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది. ఒబేసిటీ ఉన్నా, పెద్ద వయసులో లేదా 30 ఏండ్లు దాటాక మొదటి కాన్పు జరిగిన వాళ్లకు, పదకొండేండ్ల వయసులో పీరియడ్స్ రావడం మొదలయినా, మెనోపాజ్ మొదట్లో రిస్క్ ఎక్కువ. ఎక్కువసార్లు ప్రెగ్నెంట్ అయినవాళ్లతో పోలిస్తే అసలు ప్రెగ్నెంట్ కాకుండా ఉన్నవాళ్లకు రిస్క్. పోస్ట్ మెనోపాజల్ హార్మోన్ థెరపీ చేయించుకుంటున్న వాళ్లు, వాటికి హార్మోన్​ టాబ్లెట్స్ వాడేవాళ్లలో ఎక్కువ. మెడికేషన్స్ ఆపేస్తే రిస్క్ తగ్గుతుంది. సర్వైవల్ రేట్ చూస్తే, మొదటి రెండు స్టేజ్​ల్లో 90 పైనే ఉంది. మూడో స్టేజ్​లో 70 శాతం, చివరి స్టేజ్​లో 20 శాతం మాత్రమే ఉంది. కాబట్టి, ఒక్కమాటలో చెప్పాలంటే... ఒక పొలంలో అన్నీ మంచి మొక్కలే ఉండవు. పంటను పాడు చేసే పిచ్చి మొక్కలు కూడా పెరుగుతుంటాయి. వాటిని గుర్తించి వెంటనే పెరికివేయకపోతే, పంటకే నష్టం. బ్రెస్ట్ క్యాన్సర్​ కూడా అలాంటిదే. ఒక్కసారి క్యాన్సర్ కణాలు పెరిగితే వాటిని తీసేసే ప్రయత్నం చేయాలి. లేదంటే అది మిగతా భాగాలకు వ్యాపించి, ప్రాణాలకే ముప్పు తెస్తుంది. 

డాక్టర్​తో పనిలేకుండా..

డాక్టర్​ దగ్గరికి వెళ్లకుండా బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో లేదో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ (బిఎస్​ఇ) ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఒక కామన్ స్క్రీనింగ్ మెథడ్. దీన్ని ఎవరైనా స్వయంగా టెస్ట్ చేసుకోవచ్చు. ఏం చేయాలంటే... రెండు రొమ్ము భాగాల్లో చేత్తో టచ్ చేసినప్పుడు గడ్డ (లంప్స్), వాపు, ఆకారంలో మార్పు ఉంటే అనుమానించాలి. అంతేకాకుండా, ఈ మెథడ్​లో ఏడు రకాల స్టెప్స్ ఉంటాయి. అవేంటంటే... పొజిషన్స్, పెరీమీటర్, పాల్పిటేషన్, ప్రెజర్, ప్యాటర్న్, ప్రాక్టీస్, ప్లానింగ్. ట్రీట్​మెంట్​ చేయాలంటే రెగ్యులర్​గా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది అవసరం. మొదటి రెండు స్టేజ్​ల్లో తెలిస్తే ట్రీట్​మెంట్ చేయడం ఈజీ అవుతుంది. రెగ్యులర్ స్ర్కీనింగ్ ద్వారా ఈ ముప్పును తగ్గించొచ్చు. 

రిస్క్ తగ్గించాలంటే.. 

వయసు పైబడడం లేదా జన్యుపరంగా వచ్చినా కూడా రిస్క్ తగ్గించొచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. అవేంటంటే... శరీర బరువు వయసుకు తగ్గట్టు ఉంచుకోవాలి. ఫిజికల్​ యాక్టివీటీలు ఎక్కువగా చేయాలి. ఆల్కహాల్ తాగడం మానేయాలి లేదా మోతాదు అయినా తగ్గించాలి. పసిపిల్లలకు తల్లి పాలు ఇవ్వడం వల్ల కూడా రిస్క్ తగ్గుతుంది. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఉండి ఆ వ్యక్తికి ఎఫెక్ట్​ అయి ఉంటే, BRCA1, BRCA2 జీన్స్ ఉన్నాయేమో చూడాలి. ఏదేమయినా ఈ సమస్య నుంచి బయటపడాలంటే హెల్దీగా ఉండాలి. అప్పుడే రిస్క్​ తగ్గుతుంది. ఎంత త్వరగా కనుక్కుని, ట్రీట్​మెంట్ తీసుకుంటే అంత బాగా నయం అవుతుంది. ట్రీట్​మెంట్​లో సర్జరీ, రేడియేషన్, మెడికేషన్స్​ మొదట్లోనే ట్రీట్​మెంట్ స్టార్ట్ చేయొచ్చు.  ‘ది అమెరికన్ క్యాన్సర్ సొసైటీ’ (ఎసిఎస్) రిపోర్ట్స్ ప్రకారం, మొదట్లోనే ట్రీట్మెంట్ చేయించుకున్నవాళ్లు ఐదేండ్లు, అంతకంటే ఎక్కువకాలం బతికినట్టు చెప్తున్నాయి. అయితే, చివరి స్టేజ్​లో అయితే ఎక్కువకాలం ట్రీట్​మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. 
–డాక్టర్. పాలంకి సత్య దత్తాత్రేయ డైరెక్టర్ & చీఫ్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ సర్వీసెస్, రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్,​కార్ఖానా, సికింద్రాబాద్