హైదరాబాద్: ఇండియా టీమ్‌కు మూడు ఫార్మాట్లలో ఆడటం తన కల అని యంగ్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే అన్నాడు. అందుకోసం ఎంత కష్టమైనా పడతానన్నాడు. ‘పరిమ్యాచ్ స్పోర్ట్స్’ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో దూబే మీడియాతో మాట్లాడాడు. ‘నన్ను నేను ప్రతి రోజు ఎంతో కొంత మెరుగుపర్చుకుంటా. టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ఆడాలంటే ఇది తప్పనిసరి. ఆ లక్ష్యం దిశగా ముందుకెళ్తున్నాను. నా ఆలోచనలన్నీ వర్తమానంలోనే ఉంటాయి. ఆట తప్ప మరో దాని గురించి ఆలోచించను. సవాళ్లను ఎదుర్కొనేందుకు నేను ఎప్పుడూ రెడీగా ఉంటా’ అని దూబే వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్‌లో మెంబర్‌గా ఉండటం తన జీవితంలో అత్యంత విలువైన సందర్భమన్నాడు. ‘నువ్వు సొంతంగా మ్యాచ్‌లు గెలిపించగలవు’ అని ధోనీ చెప్పడం తనలో ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచిందన్నాడు.
