
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఫ్రెండ్ను కిరాతంగా హత్య చేశారు ఇద్దరు యువకులు. వివరాల ప్రకారం.. ఆఫ్రోజ్, నవాజ్, యాదగిరి ముగ్గురు స్నేహితులు. సోమవారం (సెప్టెంబర్ 29) రాత్రి నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట్ డబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ దగ్గర ముగ్గురు కలిసి మద్యం సేవించారు. ఓ చిన్న విషయంలో ఆఫ్రోజ్, నవాజ్, యాదగిరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆఫ్రోజ్, నవాజ్ కత్తితో యాదగిరిపై విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు.
యాదగిరి అరుపులు విని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఆఫ్రోజ్, నవాజ్లను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మద్యం మత్తులోనే హత్య చేశారా..? లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.