యూట్యూబ్ షార్ట్స్.. చిన్న వీడియో చేస్తే డబ్బులే డబ్బులు

యూట్యూబ్ షార్ట్స్.. చిన్న వీడియో చేస్తే డబ్బులే డబ్బులు

 షార్ట్ వీడియోలకు రూ. 745 కోట్ల బహుమతి

గూగుల్ నేతృత్వంలోని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్.. షార్ట్ వీడియో క్రియేటర్ల కోసం యూట్యూబ్ షార్ట్స్ పేరుతో ఒక వేదికను ముందుకు తీసుకొస్తోంది. దీనికోసం తాజాగా 100 మిలియన్ డాలర్ల ఫండ్‌ను ప్రకటించింది. ఈ ఫండ్ 2021 మరియు 2022 సంవత్సరాలలో ఎంపిక చేయబడిన క్రియేటర్లకు పంపిణీ చేయబడుతుంది. కంపెనీ ప్రతి నెలా ఇచ్చే ఈ ఫండ్‌ను అందుకోవడానికి.. అర్హత కలిగిన క్రియేటర్లను ఆహ్వానిస్తుంది. క్రియేటర్లు పంపిన వీడియోలకు వచ్చిన వ్యూస్ ఆధారంగా.. వారికి 100 డాలర్ల నుంచి 10,000 డాలర్ల వరకు అందజేయబడతాయి.

కాంటెస్ట్‌లో పాల్గొనడానికి అర్హతలు
యూట్యూబ్ నిబంధనల ప్రకారం.. గత 180 రోజుల్లో నియమాలకనుగుణంగా చేసిన షార్ట్ వీడియోలు ఉన్న ఛానెల్‌లు ఈ కాంటెస్ట్‌లో పాల్గొనడానికి అర్హత పొందుతాయి. ఆ ఛానెల్‌లు తప్పనిసరిగా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ మరియు కాపీరైట్ నియమాలకు కట్టుబడి ఉండాలి. థర్డ్ పార్టీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలతో పాటు వాటర్‌మార్క్‌లు లేదా లోగోలు ఉన్న వీడియోలు, ఇతర ఛానెల్‌ల నుంచి కాపీ చేసిన వీడియోలు అప్‌లోడ్ చేయబడవు. బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా, ఇండియా, యునైటెడ్ కింగ్‌డమ్, మరియు యూఎస్‌కు చెందిన వారు ఈ ఫండ్ పొందడానికి అర్షులు. ఈ ఫండ్ పొందడానికి 13 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న వారు మాత్రమే అర్హులు. అయితే 13 నుంచి 18 ఏళ్లలోపు వారికి సపోర్ట్‌గా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఉండాలి. అందుకోసం పేరెంట్స్ గూగుల్ యాడ్‌సెన్స్ నిబంధనలు మరియు షరతులను అంగీకరించాలి. 

‘యూట్యూబ్‌లో మోనటైజేషన్ మోడల్‌ను రూపొందించడానికి షార్ట్స్ ఫండ్ మా మొదటి అడుగు. ఇది కేవలం యూట్యూబ్ షార్ట్స్ క్రియేటర్లకు మాత్రమే పరిమితం కాదు’ అని యూట్యూబ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రాబర్ట్ కైన్క్ల్ అన్నారు.

క్రియేటర్లను ఆకర్షించడానికి ఈ నిధులు ఒక సాధనంగా పనిచేస్తాయి. ఇలాంటి నిధులు, కాంటెస్ట్‌లు ప్రకటించడం కొత్తేం కాదు. జూలైలో చైనీస్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ 1 బిలియన్ డాలర్లను ప్రకటించింది. ఈ డబ్బును వచ్చే మూడు సంవత్సరాలలో ఖర్చు చేస్తామని కంపెనీ ప్రకటించింది. స్నాప్‌చాట్ కూడా తన స్పాట్‌లైట్ ప్లాట్‌ఫామ్‌లో కంటెంట్‌ను షేర్ చేసే క్రియేటర్ల కోసం 1 మిలియన్ డాలర్లను విడుదలచేసింది. షేర్‌చాట్ అధ్వర్యంలోని నడుస్తున్న స్వదేశీ షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్ మోజ్ గత సంవత్సరం క్రియేటర్ల కోసం 100 మిలియన్ డాలర్ల ఫండ్‌ను ప్రకటించింది.