
యూట్యూబ్‌లో ‘సూపర్‌ఉమన్’గా పాపులర్‌అయ్యింది. కమెడియన్, రైటర్, టెలివిజన్ హోస్ట్‌గా కూడా పేరు తెచ్చుకుంది లిల్లీ సింగ్. అంతేకాదు.. వీడియోల్లో తన కామెడీ టైమింగ్‌తో అందర్నీ ఆకట్టుకుంటూనే ఇన్స్పిరేషన్ వ్లాగ్స్ కూడా చేసింది. ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులను సంపాదించింది. ఒక సాధారణ యూట్యూబర్‌గా జర్నీ మొదలుపెట్టి ఒక అమెరికన్ లేట్ నైట్ టాక్ షోకి హోస్ట్‌గా చేసి చరిత్ర సృష్టించింది.
భారత సంతతికి చెందిన లిల్లీ సైనీ సింగ్ 1988 సెప్టెంబర్ 26న పుట్టింది. తల్లిదండ్రులు మాల్విందర్ కౌర్, సుక్విందర్ సింగ్ పంజాబ్‌లోని హోషియార్‌పూర్ నుంచి కెనడాకు వలస వెళ్లారు. లిల్లీసింగ్ అక్కడే టొరంటోలో పుట్టింది. చదువు కూడా అక్కడే పూర్తి చేసుకుంది. మేరీ షాడ్ పబ్లిక్ స్కూల్, లెస్టర్ బి. పియర్సన్ కాలేజియేట్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకుంది. ఆ తర్వాత టొరంటోలోని యార్క్ యూనివర్సిటీలో సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీని చేసింది. యూట్యూబ్ చానెల్ పెట్టకముందు కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేసింది.
ఓసారి ట్రై చేద్దామని..
లిల్లీ సింగ్ 2010 అక్టోబర్‌లో ‘సూపర్ ఉమన్’(2020లో ఈ చానెల్ పేరుని లిల్లీసింగ్‌గా మార్చింది) పేరుతో యూట్యూబ్ చానెల్ పెట్టింది. అందుకే ఇప్పటికీ ఆమెని అందరూ ఆ పేరుతోనే పిలుస్తుంటారు. ఆమె తల్లిదండ్రులకు యూట్యూబ్‌లో వీడియోలు చేయడం ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఆమెని ఎలాగైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించాలి అనుకున్నారు. లిల్లీ కూడా యూట్యూబ్‌లో సక్సెస్ రాకపోతే మళ్లీ చదువుకోవాలి అనుకుంది. కానీ.. చానెల్ పెట్టిన ఏడాదిలోనే మంచి ఫాలోయింగ్ వచ్చింది.
►ALSO READ | కలలో కూడా అనుకోలేదు.. యాక్సిడెంటల్‌గా యాక్టర్నైపోయా: మాథ్యూ
దాంతో 2011 డిసెంబర్‌లో ‘‘సూపర్‌ఉమన్ వ్లాగ్స్” పేరుతో మరో చానెల్ పెట్టింది. ఇందులో డైలీ రొటీన్ వ్లాగ్స్ అప్‌లోడ్ చేసేది. అప్పుడే ఆమెకు ‘స్పీడీ సింగ్స్, థాంక్యూ’ సినిమాల్లో అవకాశం వచ్చింది. 2012లో చానెల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య లక్షకు చేరింది. ఆ తర్వాత చానెల్‌తోపాటు ఆమె కూడా చాలా పాపులర్ అయ్యింది. తన చానెళ్లలో రెగ్యులర్‌గా కామెడీ, పంజాబీ సంస్కృతి ప్రతిబింబించే వీడియోలు పోస్ట్ చేసేది. తన తల్లిదండ్రులను ఆధారంగా చేసుకుని సృష్టించిన ‘‘పరమ్‌జీత్’’, ‘‘మన్‌జీత్’’ అనే ఫిక్షనల్ క్యారెక్టర్‌లు బాగా పాపులర్ అయ్యాయి.
వరల్డ్ టూర్
2015లో లిల్లీసింగ్ ‘‘ఎ ట్రిప్ టు యూనికార్న్ ఐలాండ్” పేరుతో వరల్డ్ టూర్ ప్రారంభించింది. అందులో భాగంగా ఇండియాతోపాటు ఆస్ట్రేలియా, హాంకాంగ్, సింగపూర్, దుబాయ్, యునైటెడ్ స్టేట్స్‌ని చుట్టేసింది. ఈ టూర్‌ని డాక్యుమెంట్ చేసి యూట్యూబ్ ప్రీమియంలో రిలీజ్ చేసింది. ఆమె సామాజిక కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ ముందుంటుంది. ‘గర్ల్‌లవ్’ పేరుతో ఒక క్యాంపెయిన్ చేసింది. దానిద్వారా మహిళల ఐక్యతను ప్రోత్సహించింది. 2017లో యూనిసెఫ్ గ్లోబల్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపికై పిల్లల హక్కుల కోసం పనిచేసింది.
టాప్ 100 చానెల్స్‌లో
లిల్లీసింగ్ చానెల్ ‘న్యూ మీడియా రాక్‌స్టార్స్ టాప్ 100 చానెల్స్ లిస్ట్-2014’లో 39వ స్థానంలో నిలిచింది. 2015లో ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలోని అత్యధిక ఆదాయం సంపాదించే మహిళా యూట్యూబర్లలో 8వ స్థానంలో, 2016లో 3వ స్థానంలో, 2017లో మొదటి స్థానంలో నిలిచింది. ఒక స్టడీ ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలోని నాలుగో ధనిక మహిళా యూట్యూబర్ లిల్లీ సింగ్. ఆమెకు యూట్యూబ్‌తోపాటు స్పాన్సర్‌షిప్‌లు, బ్రాండ్ డీల్స్, టెలివిజన్ ప్రాజెక్ట్‌ల ద్వారా ఆదాయం వస్తోంది.
14.3 మిలియన్లు
‘లిల్లీ సింగ్’ చానెల్‌కు ఇప్పుడు 14.3 మిలియన్ల మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌లో చేరినప్పటి నుంచి 1,224 వీడియోలు అప్‌లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ చానెల్‌లో పాడ్‌కాస్ట్‌లు మాత్రమే అప్‌లోడ్ చేస్తోంది. తన రెండో చానెల్ ‘లిల్లీ సింగ్ వ్లాగ్స్’ని 2.62 మిలియన్ల మంది సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు. ఇందులో 1,537 వీడియోలను అప్‌లోడ్ చేసింది. మూడేళ్ల నుంచి ఈ చానెల్‌లో వీడియోలు అప్‌లోడ్ చేయడంలేదు. వీటితోపాటు ఆమె మరో చానెల్‌ని కూడా నడుపుతోంది. లిల్లీ సింగ్‌ని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా లక్షలమంది ఫాలో అవుతున్నారు.