జొమాటో ప్రో నిలిపివేత

జొమాటో ప్రో నిలిపివేత

న్యూఢిల్లీ : ఆన్‌‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన లాయల్టీ ప్రోగ్రామ్​ ‘జొమాటో ప్రో’ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.   కంపెనీ కొంత కాలం క్రితం జొమాటో ప్రో ప్లస్​ అనే  ప్రీమియం లాయల్టీ ప్రోగ్రామ్‌‌ను కూడా ఆపేసింది. ఈ సబ్‌‌స్క్రిప్షన్ స్విగ్గీ వన్ మెంబర్‌‌షిప్ లాగా పని చేస్తుంది.  ఆన్‌‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్‌‌పై అదనపు డిస్కౌంట్లను, ఫ్రీ  డెలివరీ వంటి సదుపాయాలను అందిస్తుంది. గడువు ముగిసిన ప్రో మెంబర్‌‌షిప్‌‌ను రెన్యువల్​ చేయడం కుదరదని జొమాటో తెలిపింది.  జొమాటో ప్రో సభ్యత్వం నిలిపివేయడం వెనుక కారణం ఏంటో కంపెనీ తెలియజేయలేదు. జొమాటో ప్రో స్థానంలో కంపెనీ "కొత్త ప్రోగ్రామ్" తేనుందని సమాచారం. దీని గురించి కంపెనీ ఇంకా వివరాలను వెల్లడించలేదు.  కొత్త ప్రోగ్రామ్‌‌ను రూపొందించడానికి  కస్టమర్లతో,  రెస్టారెంట్లతో కలిసి పని చేస్తున్నామని పేర్కొంది.  

జొమాటో ప్రో యాక్టివ్​ మెంబర్లు మాత్రం ఎప్పట్లాగే డిస్కౌంట్లు పొందవచ్చు. సభ్యత్వం ముగిసిన తర్వాత వాటిని రెన్యువల్ ​చేయలేరు.  జొమాటో ప్రో మెంబర్‌‌షిప్ 2020 సంవత్సరంలో ప్రారంభమయింది. జొమాటో ప్రో ప్లస్​ 2021లో అందుబాటులోకి వచ్చింది. జొమాటో  ప్రత్యర్థి స్విగ్గీ  2021 నవంబర్‌‌లో తెచ్చిన  లాయల్టీ ప్రోగ్రామ్, స్విగ్గీ వన్​ను కొనసాగిస్తోంది. స్విగ్గీ వన్​ కింద మూడు నెలలకు రూ. 299 చొప్పున,  సంవత్సరానికి రూ. 899 చొప్పున రెండు రకాల సభ్యత్వాలను అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్ కింద  స్విగ్గీ వినియోగదారులు రూ. 99 కంటే ఎక్కువ ఆర్డర్‌‌లపై కొన్ని రెస్టారెంట్ల నుంచి,  ఇన్‌‌స్టామార్ట్ నుంచి అపరిమిత ఉచిత డెలివరీ వంటి సేవలను పొందుతారు.  సర్జ్ ఛార్జీలను కూడా తొలగిస్తారు.