
న్యూఢిల్లీ: బలవంతపు వసూళ్ల కేసులో ముంబై పోలీసు మాజీ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్‌కు రక్షణ కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయన ఎక్కడ ఉన్నారనే విషయాన్ని తమకు చెప్పాలని కోర్టు ఆదేశించింది. ఆ వివరాలు చెప్పేంత వరకు పరమ్‌బీర్ పిటిషన్‌పై విచారణ చేపట్టబోమని కోర్టు స్పష్టం చేసింది. తనపై నమోదైన కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానాన్ని పరమ్‌బీర్ ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆయన ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని తమకు వెల్లడించాలని సుప్రీం ఆదేశించింది.
‘మీరు (పరంబీర్‌ను ఉద్దేశించి) ఎక్కడ ఉన్నారు? ఈ దేశంలోనే ఉన్నారా లేదా విదేశాల్లోనా? ఏదైనా రాష్ట్రంలో ఉన్నారా? మీరు ఎక్కడ ఉన్నారో చెబితేనే ఈ కేసును విచారిస్తాం. ఈ వ్యవస్థపై మీకు నమ్మకం లోపించినట్లుగా కనిపిస్తోంది. రక్షణ ఉత్తర్వులు కోరుతున్నారు. కోర్టు రక్షణ కల్పిస్తేనే భారత్‌కు వస్తారా? మీ మైండ్‌లో ఏముందో మాకు అర్థం కావడం లేదు. మీరు ఎక్కడున్నారో చెప్పే దాకా రక్షణ కల్పించే ప్రసక్తే లేదు’ అని జస్టిస్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది. కాగా, రూ.15 కోట్ల కోసం పరంబీర్, మరో ఐదుగురు పోలీసులు తనను బెదిరించాడని ఈ ఏడాది జూలైలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన ముంబై పోలీసులు.. పరమ్‌బీర్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలో ఉంటున్నారు.