నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు

నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు

మహిళకు మాతృత్వం గొప్ప అనుభూతి. దాన్ని పొందాలని అందరు ఆశపడతారు. అయితే కొందరు మహిళలు అందం, శరీర ఆకృతి పోతుందని పిల్లలను కనడం పూర్తిగా మానేస్తుండటమో ఇతర విధానాలు అవలంబిస్తుండటమో చేస్తున్నారు. మరికొందరు పిల్లల్ని కంటున్నా వారికి తల్లిపాలు ఇవ్వడం లేదు. సెలబ్రెటీలు, సినీ నటులు సహా ధనవంతుల, ఇతర కుటుంబాల్లో అక్కడక్కడ ఇలాంటివి కనిపిస్తాయి. ఈ విధానం ఎంత మాత్రమూ సరికాదని వైద్య నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఇందులో భాగంగానే ఆగస్టు1 నుంచి7 వరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు(వరల్డ్ ​బ్రెస్ట్ ​ఫీడింగ్​ వీక్)​నిర్వహిస్తారు.

బిడ్డ, తల్లుల జీవితాల్లో తల్లిపాల ప్రాముఖ్యత, దాని ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడం ఈ వారోత్సవాల ముఖ్య లక్ష్యం. ఇది గ్లోబల్ ​క్యాంపెయిన్. వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ సమన్వయంతో 120 కంటే ఎక్కువ దేశాల్లో తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన కార్యక్రమాలు ఏటా కొనసాగుతున్నాయి. 1990ల్లో డబ్ల్యూహెచ్ వో, యూఎన్ అనుబంధ సంస్థ యూనిసెఫ్​ తల్లి పాలివ్వడాన్ని ప్రోత్సహించేందుకు మొదటిసారి ఒక మెమోరాండం ప్రవేశపెట్టాయి. దీంతో1992 నుంచి వారోత్సవాలు మొదలయ్యాయి. మొదట70 దేశాల్లో మొదలైన ఈ క్యాంపెయిన్​ ఇప్పుడు 120కి పైగా దేశాల్లో కొనసాగుతోంది. 2022 ఏడాదికి గానూ ‘తల్లిపాల కోసం మరో అడుగు ముందుకు– అవగాహన పెంచి మద్దతిద్దాం’(స్టెప్ అప్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్: ఎడ్యుకేట్ అండ్ సపోర్ట్) అనే థీమ్​తో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.

తల్లిపాలు అమృతం..
తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన కొవ్వులు, పిండి పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్ల వంటి పోషకాలన్నీ తల్లిపాలలో సమతూకంలో ఉంటాయి. కాన్పు తర్వాత మొదటి రెండు, మూడు రోజుల్లో వచ్చే ముర్రుపాలు చాలా ముఖ్యమైనవి. భావి ఆరోగ్యానికి తొలి బీజం వేసేవి ఇవే. ఇవి ఒక రకంగా తొలి టీకా లాంటివి. ఇందులో ఉండే ఇమ్యునోగ్లోబులిన్లు బిడ్డ రోగనిరోధకశక్తి పెంపొందటానికి తోడ్పడతాయి. ఇన్‌‌‌‌ఫెక్షన్ల బారినపడకుండా కాపాడతాయి. ఐదారు రోజులకు పాలు కాస్త పలుచబడినప్పటికీ వాటిలో కొవ్వులు, లాక్టోజ్ బాగా ఉంటాయి. అవి బిడ్డకు మరింత శక్తినిస్తాయి. రెండు వారాల తర్వాత తల్లిపాలలో 90% నీరు.. 8% పిండి పదార్థాలు, కొవ్వులు, ప్రొటీన్లు.. 2% ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. ఇలా బిడ్డ అవసరాలకు అనుగుణంగా మారిపోయే తల్లిపాలను మించిన ఆహారం మరొకటి ఉండదు. 

వివిధ సంస్థలు ఏం చెబుతున్నాయ్​?
తల్లిపాల ఆవశ్యకతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్(యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్)లు ప్రతి బిడ్డకు తల్లిపాలు పట్టాలని సూచిస్తున్నాయి. శిశువు పుట్టిన గంటలోపు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని, కనీసం ఆరు నెలల పాటు కొనసాగించాలని సిఫార్సు చేశాయి. అయితే బిడ్డ పూర్తిగా అభివృద్ధి చెందాలంటే కనీసం రెండు సంవత్సరాలు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని చెబుతున్నాయి. పేద దేశాలు సహా అమెరికా లాంటి అగ్రదేశాల్లో కూడా తల్లిపాలు ఇయ్యని మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. సెంటర్స్​ఫర్ ​డిసీజ్ ​కంట్రోల్ ​అండ్​ప్రివెన్షన్ (సీడీసీ) లెక్కల ప్రకారం 60 శాతం మంది తల్లులు నిర్దేశించినంత కాలం(రెండేండ్లపాటు) బిడ్డలకు పాలు ఇవ్వడం లేదని తేలింది. బిడ్డకు ఇచ్చేన్ని పాలు లేవనేది నిజం కాదు, భ్రమ మాత్రమేనని, ప్రతి తల్లి తన బిడ్డకు సరిపోను పాలు ఇవ్వగలదని నిపుణులు చెబుతున్నారు.

పిల్లలకు కనీసం ఆరు నెలల పాటు కచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, నేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిపుణులు సిఫార్సు చేస్తున్నప్పటికీ బిడ్డలకు తల్లిపాలు ఇవ్వని మహిళల సంఖ్య పూర్తి స్థాయిలో తగ్గకపోవడం ఆందోళనకరం. అయితే గత పదేండ్లను పోల్చి చూస్తే చాలా మంది మహిళల్లో అవగాహన పెరగడం శుభపరిణామం. జాతి వైరం మరిచి కొన్ని జంతువులు ఇతర జీవుల పిల్లలకు కూడా పాలు ఇస్తుండటం అనేక సార్లు చూసే ఉంటాం.. కానీ కన్నబిడ్డలకు పాలు ఇవ్వడానికి అందం, శరీర ఆకృతి, సౌష్ఠవం పాడవుతుందని అడ్డుచెప్పే మహిళలు వాటిని చూసైనా మారాలని ఆశిద్దాం. ఆరోగ్యమంతమైన మానవ భవిష్యత్ ​నిర్మాణానికి పునాది రాయి తల్లిపాలే!.