ఆహార కల్తీలో హైదరాబాద్‌‌ టాప్! .. మొత్తం కేసుల్లో 84 శాతం మన దగ్గరే 

ఆహార కల్తీలో హైదరాబాద్‌‌ టాప్!  .. మొత్తం కేసుల్లో 84 శాతం మన దగ్గరే 
  • దేశంలోని 19 సిటీల్లో 291 కేసులు నమోదు
  • ఒక్క హైదరాబాద్‌‌లోనే 246 కేసులు
  • నేషనల్‌‌ క్రైమ్‌‌ రికార్డ్స్‌‌ బ్యూరో నివేదికలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు : ఆహార కల్తీలో హైదరాబాద్ సిటీ ఫస్ట్​ ప్లేస్​లో నిలిచింది. 2022 ఏడాదికి గాను దేశంలోని 19 ప్రధాన నగరాల్లో మొత్తం 291 ఆహార కల్తీ కేసులు నమోదు కాగా, అందులో 246 కేసులు హైదరాబాద్‌‌లోనే రికార్డయ్యాయి. ఐపీసీ సెక్షన్లు 272, 273, 274, 275, 276 కింద కేసులు నమోదయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌‌సీఆర్‌‌‌‌బీ) విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. మొత్తం 19 సిటీల్లో నమోదైన కేసుల్లో 84 శాతం కేసులు హైదరాబాద్‌‌లోనే నమోదు కావడం గమనార్హం.

అయితే అధికారులు మాత్రం మిగతా సిటీల కంటే తామే ఎక్కువ శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నామని, అందుకే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని చెబుతున్నారు. కాగా, 2022లో తెలంగాణలో మొత్తం 1,631 ఆహార కల్తీ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 2022లో 4,694 ఆహార కల్తీ కేసులు నమోదు కాగా, 2021లో అత్యధికంగా 8,320 కేసులు రికార్డయ్యాయి. 

ఫుడ్‌‌లో బల్లి, బొద్దింక.. 

రెండు నెలల క్రితం సికింద్రాబాద్‌‌లోని ఆల్ఫా హోటల్‌‌లో ఇద్దరు యువకులు మటన్ కీమా, రోటీ తిని అస్వస్థతకు గురయ్యారు. ఆ హోటల్‌‌ను చెక్ చేసిన అధికారులు అక్కడి పరిసరాలు శుభ్రంగా లేవని, ఆహారంలో నాణ్యత లేదని నిర్ధారించి సీజ్ చేశారు. అలాగే బావర్చి నుంచి ఆన్‌‌లైన్‌‌లో బిర్యానీ ఆర్డర్ చేస్తే బల్లి వచ్చిందని అంబర్‌‌‌‌పేటకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దానిని పరిశీలించిన అధికారులు ఆ హోటల్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. గత సోమవారం గచ్చిబౌలిలోని ఓ హోటల్‌‌లో ఫుడ్‌‌లో బొద్దింక వచ్చిందంటూ కంప్లైంట్ రాగా, శాంపిల్ కలెక్ట్ చేసుకున్న అధికారులు టెస్టింగ్‌‌కు పంపించారు. హైదరాబాద్‌‌లోని చాలా ప్రాంతాల్లో ఆహారం తయారీకి నాసిరకం సరుకులనే వాడుతున్నారు. సిటీ శివారులో కల్తీ సరుకులు తయారీ చేసి, హోటళ్లకు, రెస్టారెంట్లకు తక్కువ అమ్ముతున్నారు. పలుమార్లు దాడులు జరిపి ఆయా ఫ్యాక్టరీలను సీజ్‌‌ చేసినా.. అవి పుట్టుకొస్తూనే ఉన్నాయి. కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల గుండె, కాలేయం, చర్మ సంబంధ వ్యాధులు, అల్సర్‌‌‌‌, క్యాన్సర్‌‌‌‌ వచ్చే ప్రమాదం ఉంది. 

నామమాత్రపు చర్యలు..

హైదరాబాద్‌‌లోని వ్యాపారులు అల్లం, పాలు, కారం, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, స్నాక్స్ ఇలా.. ప్రతీది కల్తీ చేస్తున్నారు. కానీ అధికారులు మాత్రం నామమాత్రపు తనిఖీలు చేసి వదిలేస్తున్నారు. స్ట్రీట్ ఫుడ్స్, చిన్నచిన్న టిఫిన్ సెంటర్లను పట్టించుకునే నాథుడే ఉండడు. ఏ నూనెలు వాడుతున్నారో, ఎన్నిసార్లు వేడి చేసిన నూనెను వాడుతున్నారో తెలుసుకోవడం కూడా కష్టం. ఒకవేళ చెకింగ్స్‌‌లో నాసిరకం ఫుడ్, అరిశుభ్రత, కల్తీ ప్రొడక్ట్స్‌‌ కనిపిస్తే నోటీసులు ఇవ్వడం, నామమాత్రపు జరిమానా విధిస్తున్నారు. దీంతో ఆహారం కల్తీ చేసేవారికి భయం లేకుండా పోతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చట్టాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. జీహెచ్‌‌ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లు ఉండగా, 16 మంది మాత్రమే ఫుడ్ ఇన్‌‌స్పెక్టర్లు ఉన్నారు. దీంతో ఒక్కో ఇన్‌‌స్పెక్టర్ రెండు సర్కిళ్లను చూసుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. కొత్త ప్రభుత్వంలోనైనా సరిపడా సిబ్బందిని నియమించి కల్తీ ఆహారానికి చెక్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

తనిఖీలు చేస్తున్నాం..

హైదరాబాద్‌‌ సిటీలో మొత్తం 30 సర్కిళ్లు ఉంటే 16 మంది ఫుడ్ ఇన్‌‌స్పెక్టర్లు మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ రెగ్యూలర్‌‌‌‌గా తనిఖీలు చేస్తున్నాం. కల్తీ జరిగినట్లు గుర్తిస్తే నోటీసులు జారీ చేస్తున్నాం. కేంద్ర గైడ్ లైన్స్ ప్రకారం శాంపిల్స్ ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాం కాబట్టే, కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయి. 

 సుదర్శన్ రెడ్డి, గెజిటెడ్ ఫుడ్ ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌​

ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదు..

ఆహారం కల్తీ జరిగిందని గుర్తిస్తే ఎవరికి కంప్లైంట్ చేయాలో చాలా మంది కస్టమర్లకు తెలియదు. ప్రభుత్వం, అధికారులు చట్టాలపై ప్రజలకు అవేర్‌‌‌‌నెస్ కల్పించాలి. ప్రతి రెస్టారెంట్‌‌లో ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక క్యూఆర్ కోడ్ లేదా ఫోన్ నంబర్‌‌‌‌ ఏర్పాటు చేయాలి. నామమాత్రపు చర్యల వల్ల వ్యాపారులకు భయం లేకుండా పోతుంది. ఆహార కల్తీకి పాల్పడితే లైసెన్స్‌‌ను రద్దు చేయాలి. అప్పుడే భయపడతారు. అధికారులు కూడా కస్టమర్లు కంప్లైంట్ చేస్తేనే తనిఖీలు చేస్తున్నారు. లేదంటే పట్టించుకోవట్లేదు.

హరీశ్‌‌ దాగా, యాక్టివిస్ట్