తెలంగాణలో ఖైదీలతో జైళ్లు ఫుల్

తెలంగాణలో ఖైదీలతో జైళ్లు ఫుల్
  • 5,800 దాటిన ప్రస్తుత  ఖైదీల సంఖ్య 
  • దేశంలోని జైళ్లల్లో 5.73 లక్షల మంది
  • ఎన్‌‌సీఆర్‌‌‌‌బీ రిపోర్ట్ వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోని జైళ్లలో  ఖైదీల సంఖ్య భారీగా పెరిగిపోతున్నది. వివిధ నేరాల్లో ప్రతి ఏటా దాదాపు వెయ్యి మందికి పైగా జైలుకు వెళ్తున్నారు. కోర్టు విచారణలో దోషులుగా తేలిన వారు శిక్షలు అనుభవిస్తున్నారు. పీడీ యాక్ట్‌‌పై అరెస్టయిన వారు జైలు నిర్బంధంలో ఉంటున్నారు. దీనికి తోడు బెయిల్ లభించినా జామీను ఇచ్చే వారు లేక మరికొందరు జైలు గోడలకే పరిమితం అవుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న  37  జైళ్లు ఖైదీలతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ విషయాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్‌‌ బ్యూరో(ఎన్‌‌సీఆర్‌‌‌‌బీ) వెల్లడించింది. 

మెన్‌‌ ఖైదీలకు 35 జైళ్లు

రాష్ట్రంలో బోస్టల్‌‌ స్కూల్‌‌తో పాటు మొత్తం 37 జైళ్లు ఉన్నాయి. అందులో 694 మంది కెపాసిటీతో  రెండు మహిళా జైళ్లు,7,294 మంది మెన్‌‌ కెపాసిటీతో 35 జైళ్లు ఉన్నాయి. మొత్తం  జైళ్లలో 7,997 మంది  ఖైదీల సామర్థ్యం ఉంది. ఎన్‌‌సీఆర్‌‌‌‌బీ నివేదిక ప్రకారం..గతేడాది డిసెంబర్ 31 నాటికి 372 మంది మహిళా ఖైదీలు.. 6,116 మంది పురుషులు జైళ్లల్లో ఉన్నారు. ఇద్దరు ఖైదీలు ఆత్మహత్య చేసుకోగా.. మరో 11 మంది అనారోగ్యంతో  మృతి చెందారని 
ఎన్‌‌సీఆర్‌‌‌‌బీ పేర్కొంది.

దేశంలోని జైళ్లల్లో సామర్థ్యానికి మించి ఖైదీలు

దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో  పరిమితికి మించి ఖైదీలు ఉన్నారని ఎన్‌సీఆర్‌‌బీ తెలిపింది. దేశంలో మొత్తం1,330 జైళ్లు ఉన్నాయి. ఇందులో 4,36,266 మంది ఖైదీలను ఉంచేందుకు అవకాశం ఉంది. ఐతే గతేడాది డిసెంబర్‌‌ 31 వరకు అన్ని రాష్ట్రాల్లోని జైళ్లలో 5,73,220 మంది ఖైదీలు ఉన్నట్లు ఎన్‌‌సీఆర్‌‌‌‌బీ వెల్లడించింది. అత్యధికంగా ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, జార్ఖండ్‌‌ రాష్ట్రాల్లోని జైళ్లల్లో.. సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారని పేర్కొంది.

2,102 మంది మాత్రమే దోషులు

గతేడాది డిసెంబర్‌‌‌‌ వరకు దోషులుగా తేలిన మొత్తం 2,102 మంది జైళ్లల్లో శిక్షలు అనుభవిస్తున్నారు.  9 మంది ట్రాన్స్‌‌జెండర్స్ సహా 4,221 మందిపై కోర్టులో  ఇంకా విచారణ జరుగుతున్నది. వీరిలో బెయిల్స్‌‌పై విడుదలైన వారు, శిక్షలు పూర్తి చేసుకున్నవారు మినహా ఈ నెల 12వ తేదీ వరకు రాష్ట్ర  జైళ్లల్లో 5,800  మందికి పైగా ఖైదీలు ఉన్నారు. వీరిలో 354 మంది మహిళలు కాగా.. 5,482 మంది పురుషులు జైలు అడ్మిషన్‌‌లో ఉన్నారు. బెయిల్‌‌పై రిలీజ్‌‌ అయ్యే వారితో ఖాళీ అవుతున్న బ్యారక్స్,సెల్స్‌‌లోకి కొత్త ఖైదీలను భర్తీ చేస్తున్నారు. ఇలా ప్రతి ఏటా దాదాపు 1500 మంది ఖైదీలకు అదనంగా అకామిడేషన్ ఇచ్చే విధంగా రాష్ట్ర జైళ్లు ఉన్నాయి. తెలంగాణ జైళ్ల కెపాసిటీలో ప్రస్తుతం 81.2 శాతం, ఏపీ జైళ్లలో 83.8 శాతం ఖైదీలు ఉన్నారని ఎన్‌‌సీఆర్‌‌‌‌బీ తెలిపింది. ఆయా రాష్ట్రాల జైళ్ల శాఖలు అందించిన వివరాల ఆధారంగా నివేదికను రూపొందించింది.