రెవెన్యూ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించండి : జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి

రెవెన్యూ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించండి : జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి
  •     తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి డిమాండ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రెవెన్యూ శాఖలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులకు అన్ని స్థాయిల్లో పదోన్నతులు కల్పించడంతో పాటు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ), లోకేష్ కుమార్‌‌‌‌ను తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రాములు, తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ నేతలు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, గ్రామ పాలన అధికారుల సంఘం అధ్యక్షుడు గరికె ఉపేంద్రరావులతో కలిసి లచ్చిరెడ్డి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25 అదనపు కలెక్టర్ పోస్టులను అర్హులైన డిప్యూటీ కలెక్టర్లతో వెంటనే భర్తీ చేయాలని, 85 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలని కోరారు. అలాగే, సీనియర్ అసిస్టెంట్ నుంచి డిప్యూటీ తహసీల్దార్‌‌‌‌గా, డిప్యూటీ తహసీల్దార్ నుంచి తహసీల్దార్‌‌‌‌గా ప్రమోషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. భూముల రీసర్వే బడ్జెట్‌‌‌‌ను విడుదల చేయాలని, తొలగించిన కంప్యూటర్ ఆపరేటర్లను విధుల్లోకి తీసుకోవడంతో పాటు 61 ఏండ్లు నిండిన వీఆర్ఏలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

ఇంటర్ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తాం..

ఇంటర్మీడియెట్ బోర్డును పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసే ప్రతిపాదనల నేపథ్యంలో బోర్డులో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది సర్వీసు ప్రయోజనాలు, ఉద్యోగ భద్రతకు ప్రభుత్వం పూర్తి భరోసా కల్పించాలని వి.లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఇంటర్మీడియెట్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్‌‌‌‌ను జేఏసీ బృందంతో కలిసి వినతిపత్రం అందజేసి పలు సమస్యలపై చర్చించారు.  ఇంటర్ విలీనం వల్ల ఉత్పన్నమయ్యే ఉద్యోగుల సమస్యలన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపుతామని లచ్చిరెడ్డి పేర్కొన్నారు.