ఇటలీలో కరోనా వ్యాప్తికి కారణాలు వివరించిన ప్రత్యక్ష సాక్షి

ఇటలీలో కరోనా వ్యాప్తికి కారణాలు వివరించిన ప్రత్యక్ష సాక్షి

ఇటాలియన్లు ఏం తప్పులు చేశారంటే..

ఇటలీ కొంపముంచింది నిర్లక్ష్యమే

అక్కడేం జరిగిందో చెప్పిన ప్రత్యక్ష సాక్షి

ఇటలీలో కరోనా వైరస్​ జనాన్ని వేటాడుతోంది. ఇప్పటివరకు 2,500 మంది చనిపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కొంత, ప్రజలు పట్టించుకోకపోవడం వల్ల కొంత..  దీనితో, జస్ట్​ రెండు వారాల్లో ఇటలీ పరిస్థితి భయంకరంగా తయారైంది . స్టేజ్​ 3 నుంచి స్టేజ్​ 6కి రావడానికి జస్ట్​ 5 రోజులే పట్టింది.

చిన్న నిర్లక్ష్యం.. పెద్ద ఆపద మోసుకొస్తుంది. చిన్న జాగ్రత్త.. ఓ పెద్ద ప్రమాదాన్ని తప్పిస్తుంది. ప్రస్తుతం ఇటలీకి, ఇతర దేశాలకు మధ్య ఉన్న పెద్ద తేడా అదే. అక్కడ మరణాలు, కేసులు శరవేగంగా పెరిగిపోవడానికి కారణం నిర్లక్ష్యమే. ‘మాకేం అవుతుందిలే’ అన్న అశ్రద్ధ, అజాగ్రత్తలే ఇప్పుడు ఆ దేశం కొంపముంచాయి. ముందు ముందే జాగ్రత్తపడి చర్యలు తీసుకున్న మిగతా దేశాలు ప్రమాదం నుంచి బయటపడ్డాయి. ఇటలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి​ వివిధ స్టేజ్​లలో ఆ దేశంపై కరోనా చూపించిన ప్రభావాన్ని కళ్లకు కట్టారు. ఆ దేశం ఎట్ల ఎఫెక్ట్​ అయిందో వివరించారు.

స్టేజ్ 1

వైరస్​ ఉందన్న విషయం అందరికీ తెలుసు. దేశంలో తొలి కేసులు నమోదయ్యాయన్న సంగతీ తెలుసు. కానీ, చాలా మంది జస్ట్​ అదో ఫ్లూ అనుకున్నారు. భయపడాల్సిన అవసరం లేదనుకున్నారు.

‘నాకేమైనా 75 ఏళ్లున్నాయా? నాకేమవుతుంది? నేను సేఫ్​. అందరూ లేనిపోని గందరగోళాన్ని క్రియేట్​ చేస్తున్నారు. మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? టాయిలెట్​ పేపర్లు స్టాక్​ పెట్టుకోవాల్సిన అవసరమా? నా బతుకు నేను బతుకుతా. భయపడాల్సిన పనిలేదు’ అనుకున్నారు.

స్టేజ్ 2

కేసుల సంఖ్య ఎక్కువైపోతోంది. రెడ్​జోన్​గా ప్రకటించారు.

ముందు ఓ రెండు చిన్న టౌన్లలో మాత్రమే లాక్​డౌన్​. ఎక్కడికక్కడ క్వారెంటైన్​. అయినా జనాల్లో భయం లేదు.

కరోనా మరణాలు నమోదయ్యాయి. అయినా చనిపోతున్నది ముసలోళ్లే కదా అన్న భావన. వ్యూస్​ కోసం మీడియానే భయాలు సృష్టిస్తోందన్న అపోహ.
జనం వాళ్ల బతుకేదో బతికేస్తున్నారు. అంటే, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా బయటకు వెళ్లడం మానలేదు. స్నేహితులను కలవడం ఆపేది లేదు. వైరస్​ నాకు సోకదులే అన్న అతినమ్మకం. అందరూ బాగానే ఉన్నారన్న భావన.

స్టేజ్ 3

కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. చావులూ ఎక్కువవుతున్నాయి.

ఒక్కరోజులోనే రెట్టింపయ్యాయి. ఎక్కువ కేసులు నమోదైన నాలుగు రీజియన్లను బంద్​చేశారు. రెడ్​జోన్లుగా ప్రకటించారు. క్వారెంటైన్​ చేశారు.

స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. పావు వంతు దేశం బంద్​ అయింది. బార్లు, రెస్టారెంట్లు, వర్క్​ప్లేస్​లు మాత్రం నడుస్తున్నాయి.

రెడ్​జోన్​లో ఉన్న 10 వేల మంది తప్పించుకున్నారని ఓ న్యూస్​పేపర్​ వార్త రాసింది. మిగతా మూడొంతుల దేశంలో జనం ఫ్రీగా తిరిగేస్తున్నారు. క్వారెంటైన్​ అయిన కొందరూ సిటీ వీధుల్లో తిరిగారు. కానీ, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మాత్రం వాళ్లు అర్థం చేసుకోలేకపోయారు.

వైరస్​ గురించి మాట్లాడుతున్నారే తప్ప జాగ్రత్తలు తీసుకోలేదు. చేతులు కడుక్కోవడం,  గుమిగూడకుండా ఉండడం వంటివి చేయకూడదని ప్రభుత్వమూ చెప్పింది. కానీ, అది జనాల బుర్రల్లోకి పోలేదు.

స్టేజ్ 4

కేసుల తీవ్రత మరింత ఎక్కువైంది. దేశం మొత్తం అన్నీ బంద్​ అయ్యాయి.

స్కూళ్ల నుంచి మాళ్ల దాకా అన్నీ క్లోజ్​. హెల్త్​ ఎమర్జెన్సీ అని ప్రభుత్వం ప్రకటించింది. హాస్పిటళ్లు నిండిపోయాయి. కరోనావైరస్​ పేషెంట్ల కోసం అంతా ఖాళీ చేశారు. కానీ, పేషెంట్లకు తగ్గట్టు డాక్టర్లు, నర్సులూ లేరు.

రిటైర్డ్​ డాక్టర్లు, నర్సులను రంగంలోకి దించారు. ఇంకా చదువు పూర్తికాని వారిని యూనివర్సిటీల నుంచి రప్పించారు. షిఫ్టుల్లేవు. పనిభారం పెరిగింది.

డాక్టర్లూ, నర్సులకూ వైరస్​ సోకింది. వాళ్లు తమ కుటుంబాలకూ అంటించారు. న్యుమోనియా కేసులు పెరిగాయి. ఐసీయూలో బాధితుల సంఖ్య పెరిగింది. కానీ, వాళ్లకు సరిపడినన్ని ఐసీయూలు, వసతుల్లేవు. ఏదో యుద్ధ రంగంలో ఉన్నట్టే ఉంది.

ఎవరికి ట్రీట్​ చేయాలన్నది డాక్టర్ల ఇష్టం. ట్రీట్​మెంట్​ చేస్తే బతుకుతారనుకున్న వాళ్లకే ట్రీట్​మెంట్​. వృద్ధులు, గుండెజబ్బులు, ఇతర జబ్బులున్నోళ్లకు ట్రీట్​మెంట్​ చెయ్యలేదు. కేసులు తగ్గించాలన్నదే ముఖ్యం. సరైన వనరులు లేవు కాబట్టి, ఉన్న వాటితోనే మెరుగైన ఫలితాలు తీసుకురావాలన్నది వాళ్ల ఆలోచన. అందుకే చనిపోయిన వాళ్ల సంఖ్య పెరిగింది.

కేసులు ఎక్కువవుతున్నాయి. కానీ స్పేస్​ లేదు. ట్రీట్​మెంట్​ చేసే డాక్టర్లు, వసతులు లేవు. అదే ఎక్కువ మంది మరణానికి కారణమైంది. తన కళ్ల ముందే ముగ్గురు పేషెంట్లు చనిపోయినా, చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఓ డాక్టర్​ది. ఏం చేయాలో పాలుపోక ఏడ్చేసిన నర్సులు. వ్యవస్థ మొత్తం కుప్పకూలుతోంది.

స్టేజ్ 5

రెడ్​జోన్​ నుంచి పారిపోయిన పది వేల మంది, ఇటలీ మొత్తానికి వైరస్​ అంటించేశారు. మార్చి 9 నాటికి దేశం మొత్తం రెడ్​జోన్​ అయిపోయింది.

ఈ టైంలో వైరస్​ను కట్టడి చేయడమే ముఖ్యం. దీంతో ఎవరూ బయటకు రావొద్దని ప్రభుత్వం ఆర్డరేసింది. అయితే, ఎకానమీ నష్టపోవద్దన్న ఉద్దేశంతో చిన్న షాపులు, ఆఫీసుల వంటి వాటిని లాక్​డౌన్​ నుంచి మినహాయించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దన్న కండిషన్​ పెట్టింది.

అదే అదునుగా జనం ఇష్టమొచ్చినట్టు ఆఫీసులకు, రెస్టారెంట్లకు పోయారు. షాపింగ్​ చేశారు. బార్లలో తెగ తాగారు. ఫ్రెండ్స్​ను వెంటేసుకుని తిరిగారు. క్వారెంటైన్​లో ఉండాలన్న వినిపించుకోలేదు.

స్టేజ్ 6

ఆఫీసులు, షాపులు, అన్ని బిజినెస్​లూ మూసేయాలని సర్కార్​ నుంచి ఆర్డర్స్​. బార్లు, రెస్టారెంట్లు, షాపింగ్​ సెంటర్లు అన్నీ బంద్​.

నిత్యావసరాలు దొరికే సూపర్​ మార్కెట్లు, అత్యవసరమైన మందుల షాపులకు మినహాయింపు.

సర్కార్​ ఇచ్చే సర్టిఫికెట్​ ఉంటే తప్ప బయటకు వెళ్లలేని పరిస్థితి. ఎక్కడి నుంచి వస్తున్నావ్​.. ఎక్కడికి పోతున్నావ్​ వంటి వివరాలతో అధికారులు ఇచ్చే సర్టిఫికెట్​ అది.ఎక్కడికక్కడ పోలీస్​ చెక్​ పాయింట్లున్నాయి. సరైన కారణం లేకుండా బయటకు పోతే 206 యూరోల ఫైన్​. ఒకవేళ కరోనా పేషెంట్​ అని తెలిసి బయటకు పోతే ఏడాది నుంచి 12 ఏండ్ల జైలు.

ఇదీ రెండు వారాల్లో ఇటలీ పరిస్థితి. స్టేజ్ 3 నుంచి స్టేజ్ 6కు రావడానికి కేవలం 5 రోజులే పట్టింది. ఇటలీ, చైనా, కొరియాలను పక్కనపెడితే మిగతా దేశాలన్నీ ఇప్పుడు స్టేజ్ 1లోనే ఉన్నాయి. స్టేజ్ 2లోకి ఇప్పుడిప్పుడే పోతున్నాయి. కాబట్టి ఎప్పుడు ఏది మనకు వస్తుందో ఎవరూ ఊహించలేరు. రెండు వారాల క్రితం ఇటలీ పరిస్థితి ఇదే. ఇది వైరస్ మోసుకొచ్చే డేంజర్ మాత్రమే కాదు. దాని పట్ల జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల కలిగే అనర్థాలివి. చాలా దేశాలు ప్రజల బాగు కోసం ఎన్నో చర్యలు తీసుకున్నాయి. అంతా బాగానే ఉంది కదా అని నిర్లక్ష్యంగా ఉండడానికి లేదు. అలాంటి నిర్లక్ష్యమే దేశాల కొంప ముంచుతుంది. మున్ముందు అమెరికా పరిస్థితి కూడా అదే అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. కాబట్టి అందరూ ఇటలీలా కాకుండా అందరూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

For More News..

 నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలోకి కవిత

ప్రభుత్వం చెబుతున్నా.. పబ్లిక్ పట్టించుకోట్లే..

ఇంటర్​ క్వశ్చన్ ​పేపర్లలో తప్పులే తప్పులు