చైనాలో పెను భూకంపం .. 127 మంది మృతి

చైనాలో పెను భూకంపం .. 127 మంది మృతి
  • చైనాలో పెను భూకంపం .. 127 మంది మృతి
  • 7 వేల ఇండ్లు నేలమట్టం..  700 మందికి పైగా గాయాలు
  • గన్సు, క్వింఘై ప్రావిన్స్​లలోభారీగా ప్రాణ, ఆస్తి నష్టం
  • రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.2గా రికార్డు
  • రంగంలోకి రెస్క్యూ టీమ్స్
  • శిథిలాల కింద మరికొంత మంది
  • మృతుల సంఖ్య పెరిగే చాన్స్ ఉందన్న అధికారులు

బీజింగ్: చైనాలో పెను భూకంపం సంభవించింది. గన్సు, క్వింఘై ప్రావిన్స్‌‌ల్లో సంభవించిన భూకంపం కారణంగా 127 మంది చనిపోయారు. 600 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో భూమి కంపించిందని, రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2 గా గుర్తించామని చైనా ఎర్త్​క్వేక్ నెట్​వర్క్ సెంటర్(సీఈఎన్​సీ) మంగళవారం ప్రకటించింది. భూకంప తీవ్రతకు పెద్ద సంఖ్యలో భవనాలు కూలిపోయాయి. వాటి శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. మృతులతో పాటు గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. లియుగౌ టౌన్​షిప్ నుంచి 8 కి.మీ. దూరంలో.. 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తిం చారు. భూమి కంపిస్తున్నప్పుడు ఇండ్లు, రెస్టారెంట్ల నుంచి ప్రజలు బయటికి పరుగులు తీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

తరచూ సంభవిస్తున్న భూకంపాలు

క్వింఘై ప్రావిన్స్ టిబెట్ హిమాలయన్ రీజియన్​కు ఆనుకుని ఉంటుంది. ఇక్కడ భూమి లోపల కాంటినెంటల్ ప్లేట్స్ లో కదలికల కారణంగా తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. క్వింఘైకు పొరుగున ఉన్న జిన్​జియాంగ్ ఉయ్​గుర్ అటానమస్ రీజియన్​లో మంగళవారం ఉదయం 9.46 గంటలకు మళ్లీ భూమి కంపించింది. భూకంపం కారణంగా గన్సు, క్వింఘై ప్రావిన్స్​లో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. గన్సులో 113 మంది, క్వింఘైలో 14 మంది వరకు చనిపోయారని అధికారులు ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లో 700 మంది వరకు గాయపడినట్లు తెలిపారు.

మంచు కారణంగా సహాయక చర్యలకు ఆటంకం

కరెంట్ లేకపోవడంతో బ్యాటరీల సాయంతో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. దీనికితోడు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తున్నది. జిషిషాన్ సిటీలో మైనస్ 10 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతున్నది. సహాయక చర్యలకు వాతావరణం కూడా సహకరించడంలేదని అధికారులు తెలిపారు. 580 మంది రెస్క్యూ సిబ్బంది, 88 ఫైర్ ఇంజిన్స్, 12 సెర్చ్ అండ్ రెస్క్యూ డాగ్స్, 10 వేలకు పైగా డిజాస్టర్ ఎక్విప్​మెంట్​తో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

భూకంపం సంభవించిన ప్రాంతాల గుండా వెళ్లే ప్యాసింజర్, కార్గో రైళ్లను అధికారులు నిలిపివేశారు. రైల్వే ట్రాక్​లను చెక్ చేసిన తర్వాతే సేవలు పునరుద్ధరిస్తామని తెలిపారు. గన్సు స్టేట్ కమ్యూనిస్ట్ పార్టీ చీఫ్ హు చాంగ్​షెంగ్, గవర్నర్ రెన్ ఝెన్హ్యూ భూకంప ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ప్రాణ నష్టం తగ్గించేందుకు పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలని అధ్యక్షుడు జిన్‌‌పింగ్ అధికారులను ఆదేశించారు.

రోడ్లు డ్యామేజ్.. బ్రిడ్జికి బీటలు

భూకంపం ధాటికి ఒక్క జిషిషాన్‌‌ సిటీలోనే 6,381 ఇండ్లు దెబ్బతిన్నాయి. గ్రామాలకు వెళ్లే రోడ్లు కూడా డ్యామేజ్ అయ్యాయి. టెలికమ్యూనికేషన్ నెట్​వర్క్ దెబ్బతిన్నది. ఆయా ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. రంగంలోకి దిగిన అధికారులు.. పవర్​తో పాటు టెలికమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నారు. కరెంట్ లేకపోవడంతో చాలా పట్టణాలు, గ్రామాల్లోని ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ట్రాన్స్​పోర్ట్ మినిస్ట్రీ రోడ్ల మరమ్మతులు చేపడుతున్నది. ఎల్లో రివర్ మీద ఉన్న బ్రిడ్జికి పగుళ్లు ఏర్పడగా సిబ్బంది రిపేర్‌‌‌‌ చేస్తున్నారు.