ప్రతిపక్షాల కూటమి ఇండియా..కూటమి సారథిపై క్లారిటీ ఇవ్వని కాంగ్రెస్ చీఫ్..

ప్రతిపక్షాల కూటమి ఇండియా..కూటమి సారథిపై క్లారిటీ ఇవ్వని కాంగ్రెస్ చీఫ్..
  • 26 పార్టీలతో ‘ఇండియన్ నేషనల్ డెవలప్‌‌మెంటల్ 
  • ఇన్​క్లూసివ్ అలయెన్స్‌‌’ ఏర్పాటు
  • బెంగళూరులో సుదీర్ఘ భేటీ తర్వాత ఖర్గే ప్రకటన
  • త్వరలో ముంబైలో మరోసారి సమావేశమైతం
  • 11 మందితో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేస్తం
  • కూటమికి కన్వీనర్‌‌‌‌ను కూడా నియమిస్తం
  • కూటమి సారథిపై క్లారిటీ ఇవ్వని కాంగ్రెస్ చీఫ్.. 
  • ఇది ఇండియా వర్సెస్ ఎన్డీఏ: రాహుల్

న్యూఢిల్లీ/బెంగళూరు: 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలు జట్టు కట్టాయి. 26 అపొజిషన్ పార్టీలు కలిసి కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. తమది ‘ఇండియన్ నేషనల్ డెవలప్‌‌మెంటల్ ఇన్​క్లూసివ్ అలయెన్స్‌‌ (ఐఎన్​డీఐఏ-– ఇండియా)’ అని ప్రకటించాయి. మంగళవారం కర్నాటకలోని బెంగళూరులో నాలుగు గంటలపాటు సమావేశం నిర్వహించిన తర్వాత కాంగ్రెస్‌‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారికంగా  కూటమి పేరును ప్రకటించారు. అయితే దీన్ని నడిపించేది ఎవరు? అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే ముంబైలో మరోసారి సమావేశమవుతామని, 11 మందితో కమిటీని ఏర్పాటు చేస్తామని, కూటమికి కన్వీనర్‌‌‌‌ను ప్రకటిస్తామని ఖర్గే వెల్లడించారు. 


ప్రతిపక్షాల రెండు రోజుల సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన భేటీలో కూటమి పేరుపై చర్చించారు. అభ్యంతరాలను, సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ‘ఇండియా’ అని వచ్చేలా ‘ఐఎన్​డీఐఏ’ పేరును ఖరారు చేశాయి. కూటమికి ‘ఇండియా’ పేరును మమతా బెనర్జీ సూచించినట్లుగా వివిధ వర్గాలు వెల్లడించాయి. ‘ఇండియా’కు ఫుల్‌‌‌‌ఫామ్‌‌‌‌ విషయంలో విస్తృతంగా చర్చించినట్లు చెప్పాయి. ‘అలయెన్స్’ అనే పదాన్ని ‘ఫ్రంట్’గా మార్చాలని లెఫ్ట్ పార్టీలు కోరాయని, ప్రతిపక్షాల ప్రస్తావన లేని పేరు ఉండాలని శివసేన (ఉద్ధవ్) కోరిందని వెల్లడించాయి. ‘‘తొలుత ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇంక్లూసివ్ అలయెన్స్‌‌‌‌ పేరును ప్రతిపాదించారు. ఎన్డీయే మాదిరే ఉందని కొందరు అభ్యంతరం తెలపడంతో తర్వాత ‘డెమోక్రటిక్’ స్థానంలో ‘డెవలప్‌‌‌‌మెంటల్‌‌‌‌’ను పెట్టారు. ‘నేషనల్‌‌‌‌’ను తీసేయాలని కొందరు పట్టుబట్టారు. అయితే చివరికి కొనసాగించాలని నిర్ణయించారు” అని వివరించాయి. ‘ఇండియా’కు త్వరలోనే ట్యాగ్‌‌‌‌లైన్‌‌‌‌ను కూడా పెట్టనున్నట్లు సమాచారం. మీటింగ్‌‌‌‌ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి అధికారంపై కానీ, ప్రధాని పదవిపై కానీ ఆసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశం ఉద్దేశం అధికారాన్ని దక్కించుకోవడం కాదని, మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవడమేనని చెప్పారు. గత ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లను సొంతగా సాధించలేదని, మిత్రపక్షాల ఓట్లను ఉపయోగించుకుని, తర్వాత ఆయా పార్టీలను విస్మరించిందని మండిపడ్డారు.

ప్రతిపక్షాలకు ప్రధాని భయపడుతుండు: ఖర్గే 

మీటింగ్ తర్వాత మీడియాతో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేయాలని బీజేపీ చూస్తున్నదని ఆరోపించారు. సీబీఐ, ఈడీ తదితర సంస్థలను ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై ప్రయోగిస్తున్నదని మండిపడ్డారు. కూటమిని ఎవరు నడిపిస్తారని మీడియా ప్రశ్నించగా ఆయన దాటవేశారు. ‘‘మేం 11 మందితో కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ముంబైలో జరిగే సమావేశంలో ఆ 11 మంది ఎవరు? కన్వీనర్‌‌‌‌‌‌‌‌గా ఎవరు ఉంటారు? తదితర వివరాలన్నీ వెల్లడిస్తాం. ఇవి చాలా చిన్న విషయాలు” అని అన్నారు. ముంబై మీటింగ్‌‌‌‌ ఎప్పడనేది త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ప్రతిపక్షాలకు బీజేపీ భయపడుతోందని అన్నారు. ‘‘నిన్నటి దాకా వాళ్లు మిత్ర పక్షాలను అసలు పట్టించుకోలేదు. కనీసం మాట్లాడలేదు.. దీంతో ఎన్డీఏ ముక్కలు అయ్యింది. ఇప్పుడు అందరినీ ఒక్కచోటుకు చేర్చాలని ప్రధాని ప్రయత్నిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రతిపక్షాలంటే ఆయన భయపడుతున్నారనేది అర్థమవుతున్నది. 
ఎన్డీఏ మీటింగ్‌‌‌‌కు హాజరవుతున్న పార్టీలపై ఖర్గే స్పందిస్తూ.. ‘‘వాళ్లు ఎవరో తెలియదు. అవి రిజిస్టర్ పార్టీలేనా? దేశంలో అన్ని పార్టీలు ఉన్నట్లు నేనెప్పుడూ వినలేదు” అని ఎద్దేవా చేశారు. మరోవైపు క్యాంపెయిన్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం ఢిల్లీలో ఉమ్మడి సెక్రటేరియెట్‌‌‌‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇతర సమస్యల పరిష్కారం కోసం కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ‘‘మా మధ్య విభేదాలు ఉండొచ్చు.. కానీ వాటన్నింటినీ పక్కన పెడుతాం. 2024 ఎన్నికల్లో ఐక్యంగా పోరాడుతాం, గెలుస్తాం’’ అని అన్నారు.

కులాల వారీగా జనాభాను లెక్కించాలి

దేశంలో కులాల వారీగా జనాభాను లెక్కించాలని 26 ప్రతిపక్ష పార్టీలూ డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఉమ్మడి తీర్మానాన్ని విడుదల చేశాయి. ‘‘మన రిపబ్లిక్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌పై ఓ క్రమపద్ధతిలో బీజేపీ దాడి చేస్తోంది. మన దేశ చరిత్రలో మనం అత్యంత కీలకమైన దశలో ఉన్నాం. భారత రాజ్యాంగం పునాదులైన లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమత్వం, సామాజిక న్యాయం, ఫెడరలిజాన్ని ఓ పద్ధతి ప్రకారం బీజేపీ అణగదొక్కుతోంది’’ అని ఆరోపించాయి. రాజ్యాంగం, ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగ హక్కులపై కొనసాగుతున్న దాడిని ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు తెలిపాయి. ‘‘మన రాజ్యాంగం సమాఖ్య నిర్మాణాన్ని బలహీనపరిచేందుకు ఉద్దేశపూర్వక ప్రయత్నం జరుగుతోంది. నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల పాత్ర అన్ని రాజ్యాంగ నిబంధనలను మించిపోయింది” అని ఆరోపించాయి. రాజకీయ ప్రత్య ర్థులకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం ఏజెన్సీలను దుర్వినియో గం చేయడం ద్వారా ప్రజా స్వామ్యాన్ని దెబ్బతీస్తోందని మండిపడ్డాయి. ‘‘మైనారిటీలపై జరుగుతున్న హింసను ఓడిం చడానికి మేం కలిసి వచ్చాం. మహిళలు, దళితులు, ఆదివాసీలు, కాశ్మీరీ పండిట్లపై పెరుగు తున్న నేరాలను ఆపాలి. ముందుగా కుల గణనను ప్రారంభించాలి” అని డిమాండ్ చేశాయి.

హాజరైంది వీళ్లే

కాంగ్రెస్ నేతలు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌‌‌‌తోపాటు రాష్ట్రాల సీఎంలు స్టాలిన్, నితీశ్ కుమార్, అర్వింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్ యా దవ్, తేజస్వీ యాదవ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తదితరులు హాజరయ్యారు.

కూటమిలోని పార్టీలివే

కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆప్, జేడీయూ, ఆర్జేడీ, జేఎంఎం, ఎన్సీపీ (శరద్ పవార్ గ్రూప్), శివసేన (ఉద్ధవ్), ఎస్పీ, ఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌డీ, అప్నా దళ్ (కామెరవాడి), నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్, ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్పీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, ఎండీఎంకే, వీసీకే, కేఎండీకే, ఎంఎంకే, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (ఎం), కేరళ కాంగ్రెస్ (జే).

ముగిసిన యూపీఏ ప్రస్థానం

2004 సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ఏర్పాటైంది. చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌గా సోనియా వ్యవహరించారు. లెఫ్ట్, ఇతర పార్టీల మద్దతుతో 2004లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2009లోనూ గెలిచి మళ్లీ అధికా రాన్ని దక్కించుకుంది. 19 ఏండ్ల తర్వాత యూపీఏ కాస్తా.. ‘ఇండియా’గా మారింది. కొన్ని పార్టీలు యూపీఏ నుంచి వెళ్లిపోగా, కొన్ని కొత్త పార్టీలు జతకలిశాయి.

ఇండియాను సవాల్ చేయగలరా?: మమత

మీటింగ్ చాలా బాగా, నిర్మాణాత్మకంగా, ఫలవంతంగా సాగిందని టీఎం సీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ముంబైలో జరిగే తర్వాతి మీటింగ్‌‌‌‌లో కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌‌‌‌పై ఫోకస్‌‌‌‌ పెడుతామని వెల్లడించారు. ‘‘ఎన్డీఏ, బీజేపీ.. ‘ఇండియా’ను చాలెంజ్ చేయ గలరా?” అంటూ ప్రశ్నించారు. ‘‘మేం మా మాతృ భూమిని ప్రేమి స్తాం. మేం దేశభక్తులం. మేం దేశం కోసం, ప్రపంచం కోసం, రైతుల కోసం, దళితుల కోసం, అందరి కోసం’’ అని అన్నారు. బెంగాల్‌‌‌‌, మణిపూ ర్‌‌‌‌‌‌‌‌లోని ప్రజలకు బీజేపీ వల్ల ముప్పు ఉందని ఆరోపించారు.

ఇండియానే గెలుస్తది:  రాహుల్ గాంధీ

2024 ఎన్నికలు ఇండియా వర్సెస్ ఎన్డీఏ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘‘మేం రాజ్యాంగాన్ని, భారతీయుల గొంతుకను, ఇండియా ఆలోచనను పరిరక్షిస్తున్నాం. ఇండియాతో ఫైట్‌‌‌‌ చేయాలని ఎవరైనా అనుకుంటే ఏమ వుతుందో, ఎవరు గెలుస్తారో తెలుసుకదా! ఈ పోరాటం ఎన్డీఏకి, ఇండియాకి మధ్య.. మోదీకి, ఇండియాకి మధ్య.. ఆయన భావజాలానికి, ఇండియాకి మధ్య జరుగుతున్నది. అన్ని పోరాటాల్లోనూ ఇండియానే గెలుస్తుంది” అని చెప్పారు. ‘‘దేశం గొంతు నొక్కుతున్నారు. ఈ యుద్ధం దేశం గొంతుక కోసం జరుగుతున్నది. అందుకే మేం ‘ఇండియా’ను ఎంచుకున్నాం” అని వివరించారు. యాక్షన్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించినట్లు చెప్పారు.