ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా: దేశంలో 39కి చేరిన పాజిటివ్ కేసులు

ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా: దేశంలో 39కి చేరిన పాజిటివ్ కేసులు

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తోంది ప్రాణాంతక కరోనా వైరస్. ప్రపంచ వ్యాప్తంగా 95 దేశాలకు వ్యాప్తి చెందిన ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 3500 మందికి పైగా మరణించారు. దాదాపు లక్ష మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. కరోనా పాజిటివ్ కేసులు భారత్‌లో క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే కేరళలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా సోకింది. ఆ కుటుంబంలో ముగ్గురు కొద్ద రోజుల క్రితం ఇటలీ వెళ్లి వచ్చారు. అక్కడ వైరస్ సోకిన వారు ఇంటికి వచ్చాక మరో ఇద్దరికి కూడా కరోనా వచ్చింది. తాజాగా ఈ ఐదుగురితో కలిపి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 39కి చేరాయి.

ఆస్పత్రిలో చేరేందుకు ఒప్పుకోని కుటుంబం

పథనంతిట్ట జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురికి కరోనా వచ్చినట్లు కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ ఆదివారం ప్రకటించారు. ఆ కుటుంబంలోని ముగ్గురు కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఇటలీ నుంచి తిరిగి వచ్చినప్పటికీ.. వారు తమ ట్రావెల్ హిస్టరీ గురించి చెప్పకపోవడంతో ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ కూడా చేయలేదని తెలిపారామె. అయితే తొలుత ఆ కుటుంబం ఆస్పత్రిలో చేరేందుకు కూడా ఒప్పుకోలేదని, వైద్య అధికారులు అతి కష్టం మీద నచ్చజెప్పి పథనంతిట్ట ప్రభుత్వాస్పత్రికి తరలించారని చెప్పారు మంత్రి. ప్రస్తుతం వారంతా డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు జలుబు, దగ్గు కనిపించినా సరే స్వచ్ఛందంగా వచ్చి టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

ఆ కుటుంబంతో కలిసిన కొందరు బంధువులు కరోనా లక్షణాలతో ఆస్పత్రికి వచ్చారు. వారిని ఐసోలేషన్ వార్డుకు పంపినప్పుడు తమ బంధువులు ఇటలీ నుంచి వచ్చారని, వారిని కలిశాక తమలో కరోనా లక్షణాలు కనిపిండంతో ఆస్పత్రికి వచ్చామని చెప్పారు. దీంతో వైద్య శాఖ అధికారులు వారి ఇంటికి వెళ్లి వైరస్ తీవ్రత వివరించి.. అతి కష్టం మీద ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. వారి శాంపిల్స్ టెస్టు చేయగా ఆ కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది.

భారత్‌లో తొలి మూడు కరోనా కేసులు కేరళలోనే నమోదయ్యాయి. వైరస్ పుట్టిన చైనాలోని వుహాన్ సిటీ నుంచి వచ్చిన మెడికల్ స్టూడెంట్ల ముగ్గురు దాని బారినపడ్డారు. వారికి చికిత్స అందించిన తర్వాత పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి వెళ్లాక కూడా మరో 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు.

More News:

హ్యాట్సాఫ్ సునైనా: 8 నెలల గర్భంతో నక్సల్స్ వేట

పోలీసులకు స్మార్ట్ హెల్మెట్.. రోడ్లపై తిరిగే కరోనా పేషెంట్లను పట్టేస్తరు!

ఈ డెబిట్/క్రెడిట్ కార్డులు 16లోపు వాడండి: లేదంటే సర్వీసులు బ్లాక్