జీవితంలో ఒక్కసారైనా ‘ఛంఫై’ టూర్ వేయాలంటున్న ట్రావెలర్స్

జీవితంలో ఒక్కసారైనా ‘ఛంఫై’ టూర్ వేయాలంటున్న ట్రావెలర్స్

జీవితంలో ఒక్కసారైనా ‘ఛంఫై’ టూర్ వేయాలి అంటున్నారు ట్రావెలర్స్. అంతగా ఆకర్షించేందుకు అక్కడ ఏముంది? అంటున్నారా... చుట్టూ చెట్లతో నిండిన కొండలు.. ఆకుపచ్చని మైదానాలు.. ఊరంతా వరి పొలాలు. అక్కడక్కడ కనిపించే ఇండ్లు.. మనసారా ఇంట్లోకి ఆహ్వానించే మనుషులు.. అందమైన పక్షులు, అరుదైన జంతువులు.. ఇలా చెప్పుకుంటూపోతే బోలెడన్ని సంగతులు. 

అందమైన కొండల నడుమ ప్రశాంతంగా సేదతీరుతున్న జిల్లా ఛంఫై. ఈ జిల్లాలో చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. పురాతన స్మారకాలు, ఏకశిలా నిర్మాణాలు ఉన్నాయి. అవి మిజో తెగల చారిత్రక ధైర్య సాహసాలను, సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేస్తాయి. వాటిలో మొదటగా చెప్పుకోవాల్సింది అక్కడి పొలాల గురించి. స్పెషాలిటీ ఏంటంటే... మామూలుగా అయితే పొలాల్లో వేర్వేరు పంటలు పండిస్తారు. ఛంఫైలో మాత్రం వరిపొలాలే ఎక్కువ. పచ్చని వరి పైరుతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. ఏ ఇంట్లో చూసినా ధాన్యరాశులతో నిండు కుండలా ఉంటాయి. ఒక్కపూట కూడా పస్తు ఉండడం అన్నమాట వినిపించదు. ఈ జిల్లాలో వరి సాగు ఎక్కువగా ఉండడం వల్ల మిగతా చోట్ల ఉన్నా లేకున్నా.. మిజోరాం అంతటికీ సరిపడా తిండి గింజలు అందిస్తుంది. అందుకే ఈ ఊరిని ‘రైస్​ బౌల్​ ఆఫ్ మిజోరాం’ అంటారు. 

ద్రాక్షతోటలకూ... 

ఈ ఊరి గురించి చాలా కథలు ఉన్నాయి. వాటిలో ఒకటి వైనరీ గురించిన కథ. ఛంఫైలోని చిన్న గ్రామం నలన్. అది1954 వరకు సెయిలో తెగల పాలనలో ఉండేది. ఆ గ్రామం వైన్​ ఉత్పత్తికి చాలా ఫేమస్. ఇంకా చెప్పాలంటే ఈ గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ వైనరీలో భాగస్తులే. ఇక్కడికి వచ్చిన టూరిస్ట్​లు ద్రాక్షతోటలు పండించడం, వైన్​ తయారీ విధానం వంటివాటి గురించి తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కావాలంటే అక్కడ వైన్ బాటిల్స్​ కొనుక్కోవచ్చు. 

రిహ్ దిల్

అందమైన హృదయాకార సరస్సు ఇది. స్వచ్ఛమైన నీళ్లతో ప్రశాంతంగా ఉన్న ఆ సరస్సును చూస్తే మనసు పులకిస్తుంది. ఇది ఆ రాష్ట్రంలోనే అతిపెద్ద సరస్సు. ఈ సరస్సును ఫొటోల్లో చూస్తే బ్యూటిఫుల్ పెయింటింగ్​లా అనిపిస్తుంది. మిజో కల్చర్​కి ఈ సరస్సుతో దగ్గరి సంబంధం కలిగి ఉంది. ఆత్మలు తమ తదుపరి ప్రదేశానికి వెళ్లేటప్పుడు ఈ సరస్సును దాటి వెళ్తాయనేది మిజో తెగ ప్రజల నమ్మకం. ఈ సరస్సు గురించి మిజోరం సాహిత్యం, ఆర్ట్​లో కూడా ఉంటుంది.

కవుల కోసం..

ఛంఫైలో చూడదగ్గ ప్రదేశాల్లో లాకుంగ్​పుయ్ మువల్​ ఒకటి. ఈ కట్టడాన్ని మిజోరం కవులకు గుర్తుగా కట్టారు. అందుకే దీన్ని ‘మిజో పోయెట్స్ స్క్వేర్’​ అని కూడా ఉంటారు. నిజానికి మొదటిసారి ఆ రాష్ట్రంలోని ఇద్దరు గొప్ప కవులైన పట్యా, దమయువల కోసం కట్టారు. ఆ తర్వాత ప్రతి కవి సమాధి ఇక్కడే ఉండాలని నిర్ణయించారు. ఇప్పుడు అక్కడ చాలామంది గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన కవుల సమాధులు ఉన్నాయి. అవి కూడా టూరిస్ట్​ ప్లేస్​లో భాగమయ్యాయి. ప్రస్తుతం అక్కడున్న సమాధులను చూడటానికి వచ్చే టూరిస్ట్​ల కోసం అక్కడే చిన్న పార్క్​ కూడా ఏర్పాటు చేశారు.

అందమైన పీఠభూమి

ఛంఫైలో ఉన్న చూడచక్కని పీఠభూమి ‘తైసియామా సెనొ నైన’. కొందరు మహాత్ములు తిరిగిన ప్రదేశంగా దీనికి పేరు. రోజులు గడిచేకొద్దీ అక్కడి స్థానికులు వచ్చి పోతుండేవాళ్లు. ఈ ప్రదేశం గురించి ఒక కథ ఉంది. ఒక రైతు దగ్గర ఉన్న ఆవుని ఇక్కడికి తీసుకొచ్చి దేవుడికి మొక్కుకుంటే.. ఆశీర్వాదం దొరుకుతుందని... అప్పటినుంచి ఆ రైతు జీవితం మారిపోతుందని అక్కడి వాళ్ల నమ్మకం. అయితే ఇప్పటికీ ఆవులనే కాదు.. ప్రజల దగ్గర ఏ పశువులున్నా వాటిని ఇక్కడికి తీసుకొస్తుంటారు. ఎవరైనా సరే ఇక్కడికి  రావాలంటే కొండకు నిటారుగా ఉన్న మెట్లు ఎక్కాలి.  

  • ముర పక్.. ఇది చరిత్రకారులకు ఇష్టమైన ప్రదేశంగా చెప్పొచ్చు. ఇక్కడ ఏడు పురాతన గుహలు ఉన్నాయి. వీటి గురించి కచ్చితమైన రికార్డులు ఏమీ లేవు. కానీ, ఎన్నో జానపద కథల్లో ఈ గుహల గురించి చెప్పారు. 
  • ముర్లెన్ నేషనల్ పార్క్.. ఈ పార్క్​లో ఎన్నో జాతుల పక్షులు, పులులు, చిరుతలు, జింకలు, హిమాలయన్ బ్లాక్ బేర్, సాంబార్ వంటి జంతువుల్ని చూడొచ్చు. అలాగే అందమైన రకరకాల ఆర్చిడ్​ పూలు చూడచక్కగా ఉంటాయి. 
  • లెంగ్​టెంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ.. 80 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్నో రకాల పక్షులు, జంతువులు, చెట్లు, మొక్కలకు నిలయమిది. రాష్ట్రంలోని రెండో అతిపెద్ద శిఖరం ఈ శాంక్చురీలోనే ఉంది. 

ఫుడ్ లవర్స్ ఎక్కువ

మిజోరాం ఫుడ్​కి ఫేమస్. ఇక్కడ నార్త్​ ఈస్ట్, నార్త్​ ఇండియా ప్రాంతాల ఫుడ్ దొరుకుతుంది. అక్కడి వాళ్లు అన్నం ఎక్కువ తింటారు. దాంతోపాటు నాన్​ వెజ్ తప్పనిసరి. ప్రతి వంటలో నాన్​ వెజ్​కి సంబంధించి చికెన్, ఫిష్​, పోర్క్, బీఫ్ ఇలా ఏదో ఒకటి ఉండాల్సిందే. ఈ వంటలకు ఫలానా నూనెతోనే చేయాలనేం ఉండదు. ఏ నూనెతోనైనా వంటలు చేస్తారు మిజో ప్రజలు.

మిజోరాంలో పాపులర్​ డిష్​ పేరు బాయ్. దీన్ని ఉడికించిన కూరగాయలు, పులియబెట్టిన సోయాబీన్స్​తో కలిపి చేస్తారు. లేదంటే పులియబెట్టిన పంది మాంసంతో అన్నం తింటారు. ఇదేకాకుండా సాఛియర్ అనే కామన్ డిష్​ కూడా ఎక్కువగా తింటారు. ఇదెలా చేస్తారంటే బియ్యంతో పాటు బీఫ్, చికెన్, పోర్క్​ వంటి మాంసాలతో కలిపి వండుతారు. దాంతోపాటు సంప్రదాయబద్ధమైన కోట్ పిఠా అనే స్వీట్​ కూడా ఫేమస్. దాన్ని బియ్యప్పిండి, అరటి పండ్లతో తయారుచేస్తారు.

మూడు పండుగలు

మిజోరాంలో ప్రధానంగా మూడు పండుగలు చేసుకుంటారు. అవి చప్​చర్ కట్, పాల్ కట్, మిమ్​ కట్. ఇవి మూడు అగ్రికల్చర్​కు సంబంధించినవే. ఈ పండుగల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటారు. ట్రెడిషనల్ డాన్స్​లతో అలరిస్తారు. 
ž
ఎలా వెళ్లాలి?

ఛంఫైకి దగ్గర్లో ఉన్న ఐజ్వల్​లో లెంగ్​పుయ్ ఎయిర్​పోర్ట్ ఉంది. అక్కడి నుంచి కారు లేదా బస్​లో150 పైగా కిలోమీటర్లు జర్నీ చేయాలి. ఐజ్వల్​ నుంచి బస్​లో వెళ్తే దాదాపు ఎనిమిది గంటలు పడుతుంది. ఐజ్వల్​కి వెళ్లాలంటే కలకత్తా, ఇంపాల్, గువహటిల నుంచి రోజూ విమానాలు ఉంటాయి. దీన్ని బట్టి హైదరాబాద్ నుంచి వెళ్లాలంటే ముందు పైన చెప్పిన ఏదో ఒక సిటీకి వెళ్లాలి. అక్కడి నుంచి ఐజ్వల్​ వెళ్లాలి. ఆ తర్వాతే అసలైన డెస్టినేషన్​ ఛంఫై చేరుకుంటారు.