తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్! రేసులో ఉన్నది వీళ్లే..

తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్! రేసులో ఉన్నది వీళ్లే..
  • రేసులో డీకే అరుణ, అర్వింద్, రఘునందన్​రావు
  • సామాజిక సమీకరణాలు పరిగణనలోకి 
  • నేతలతో చర్చలు జరుపుతున్న హైకమాండ్​

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో బీజేపీకి కొత్త సారథి రానున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి మరోసారి కేంద్రమంత్రిగా అవకాశం ఇవ్వడంతో, రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష మార్పు అనివార్యమైంది. ఇప్పటికే పార్టీ హైకమాండ్​ కూడా ఆ మేరకు చర్చలు ప్రారంభించింది. కాగా, రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సరిగ్గా ఏడాది క్రితం అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ని  పక్కనపెట్టిన బీజేపీ హైకమాండ్​, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించింది. దీనిపై పార్టీ కేడర్​నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, కేవలం ఎన్నికల కోసమే మార్పు జరిగిందని, పూర్తికాగానే కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని అధిష్టానం వారిని శాంతింపజేసింది. తాజాగా, లోక్​సభ ఎన్నికలు ముగిసి, ఎన్​డీఏ వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. దీంతో కేబినెట్​కూర్పు పూర్తవగానే పార్టీపై ఫోకస్ పెట్టాలని హైకమాండ్ ఇప్పటికే​ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడితో పాటు అన్ని రాష్ట్రాల అధ్యక్షులను మార్చడంపై దృష్టిపెట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్​రెడ్డికి తాజాగా కేబినెట్​బెర్త్​ ఖాయం కావడంతో తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిని తక్షణమే నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు మంత్రి పదవులు ఆశించి, భంగపాటుకు గురైన నేతల్లో ఒకరికి ఆ పదవి కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోనున్నట్టు సమాచారం. 

రేసులో పలువురు 

బీజేపీ అధ్యక్ష పదవి రేసులో  మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్,  మెదక్ ఎంపీ రఘునందన్,  మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్, తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా మరోసారి స్టేట్ చీఫ్ బాధ్యతలు తీసుకునేందుకు సుముఖంగా ఉన్నారు. ఇప్పటికే పార్టీ పెద్దల వద్ద తన ఆకాంక్షను వెల్లడించినట్టు తెలిసింది. అదే సమయంలో బీజేపీ  హైకమాండ్​ కూడా  కొత్త అధ్యక్ష పదవి కోసం వీరి పేర్లను సీరియస్​గా పరిశీలిస్తోంది. 

 కేంద్ర పదవి ఆశించి భంగపడ్డ ఈటల రాజేందర్, డీకే అరుణ పేర్లను పరిశీలిస్తున్నట్టు చెప్తున్నారు. సోమవారం అమిత్ షా.. ఈటల రాజేందర్ తో భేటీ అయ్యే అవకాశముందని పార్టీ వర్గాల్లో టాక్​ నడుస్తోంది.  మరోపక్క బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ముందు వరుసలో ఉన్నారు.  మహిళా కోటాతో పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈమె పేరును కూడా హైకమాండ్​ సీరియస్​గానే పరిశీలిస్తున్నట్టు సమాచారం. అటు  బీసీ, మాస్ లీడర్​గా ఉన్న నిజామాబాద్ ఎంపీ అర్వింద్​ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా గెలిచారు. బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్​లీడర్​గా రెడ్డికి అవకాశం ఇచ్చినందున రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే అర్వింద్​కు, ఈటల రాజేందర్​కు మధ్య పోటీ తప్పదనే చర్చ జరుగుతోంది.