వ్యవసాయ రుణాలు వసూలు కావట్లే!

వ్యవసాయ రుణాలు వసూలు కావట్లే!
  • రూ. ఏడు లక్షల కోట్లకు కిసాన్ క్రెడిట్ కార్డుల బకాయిలు 
  • బ్యాంకుల ఎన్‌‌పీఏల్లో అగ్రికల్చర్ సెక్టార్ వాటా రూ. 1.28 లక్షల కోట్లకు
  • కరోనా దెబ్బకు ఈ ఎన్‌‌పీఏలు 2020-21 లెక్కల్లో మరింత పెరిగే అవకాశం

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: కిసాన్‌ క్రెడిట్ కార్డులు (కేసీసీ) తీసుకొచ్చి 28 ఏళ్ల అవుతోంది. తక్కువ వడ్డీకే రైతులకు అప్పులిచ్చి, వారి అవసరాలను తీర్చడానికి  నాబార్డ్ 1993 లో  కిసాన్‌ క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. అప్పటి నుంచి అగ్రికల్చర్‌‌‌‌ లోన్లలో కీలకంగా మారిన ఈ కార్డులు, ప్రస్తుతం బ్యాంకులకు గుదిబండలా తయారయ్యాయి. 2019–20 నాటికి దేశంలో మొత్తం 65,280 కిసాన్‌ క్రెడిట్ కార్డులు యాక్టివ్‌‌గా ఉన్నాయి.  ఈ కార్డులు కింద తీసుకున్న అప్పుల్లో రూ.ఏడు లక్షల కోట్లు  ఇంకా తీర్చలేదని, ఇవి అవుట్‌‌ స్టాండింగ్‌‌ లోన్లుగా పడి ఉన్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. అదే  మన రాష్ట్రంలో 4,079 కిసాన్‌ క్రెడిట్‌‌ కార్డులు యాక్టివ్‌‌గా ఉండగా, మొత్తం రూ. 35,796 కోట్లు అవుట్‌‌ స్టాండింగ్‌‌ లోన్లుగా పడి ఉన్నాయి.  ఇటువంటి లోన్లలో కొన్ని లోన్లు మొండి బాకీలుగా కూడా మారుతున్నాయి. 2019–2020 నాటికి,  షెడ్యూల్డ్‌‌ కమర్షియల్ బ్యాంకులు, రీజినల్ బ్యాంకులు, కో–ఆపరేటివ్ బ్యాంకుల మొత్తం ఎన్‌‌పీఏలలో అగ్రికల్చర్‌‌ సెక్టార్ వాటా రూ. 1.28 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే ఈ బ్యాంకుల ఎన్‌‌పీఏల్లో ఈ సెక్టార్‌‌‌‌ వాటా15 శాతానికి పెరిగింది. 202‌‌0–21 లెక్కల్లో బ్యాంకుల ఎన్‌‌పీఏల్లో  అగ్రికల్చర్‌‌‌‌ సెక్టార్‌‌ వాటా మరింత పెరుగుతుందని అంచనా. నార్త్ ఇండియా, సెంట్రల్ ఇండియాలోని రాష్ట్రాల్లో కేసీసీల వాడకం ఎక్కువగా ఉంది. 
కేసీసీతో రైతులకు తక్కువ వడ్డీకే లోన్లు.. 
వడ్డీ వ్యాపారుల బారి నుంచి రైతులను కాపాడడానికి ప్రభుత్వం కేసీసీ స్కీమ్‌‌ తీసుకొచ్చింది. బ్యాంకులు సాధారణంగా ఇచ్చే అగ్రిలోన్ల కంటే, కేసీసీ లోన్లు తక్కువ వడ్డీకే దొరుకుతాయి. ఇంకా ఈ లోన్లను తీసుకోవడానికి ఎటువంటి కొలేటరల్‌‌, గ్యారెంటీలను పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా పాత అప్పు తీర్చేస్తే మళ్లీ కొత్తగా అప్పు తీసుకోవడానికి రైతులకు వీలుంటుంది. తాజాగా ప్రభుత్వం కేసీసీని పీఎం-–కిసాన్‌‌కు లింక్‌‌ చేసింది. దీంతో  4 శాతం వడ్డీకే రూ. 1.6 లక్షల వరకు లోన్లు తీసుకోవడానికి రైతులకు వీలుంటోంది. దేశ ఎకానమీకి అగ్రికల్చర్‌‌ సెక్టార్ చాలా కీలకం. మెజార్టీ జనాభాకి ఈ సెక్టారే ఉపాధి కల్పిస్తోంది.  బ్యాంకులు కూడా అగ్రికల్చర్‌‌ సెక్టార్‌‌‌‌ను ప్రాధాన్య సెక్టార్‌‌‌‌గా చూస్తున్నాయి. సాధారణంగా పంటలు వేసే ముందు రైతులకు బ్యాంకులు లోన్లు ఇస్తాయి.  పంట చేతికందిన తర్వాత లోన్లను రైతులు తీరుస్తుంటారు. పంటలు సరిగ్గా పండకపోతే తిరిగి అప్పులు చెల్లించడం రైతులకు కష్టమవుతోంది. ఇది  బ్యాంకులు అసెట్స్ క్వాలిటీపై ప్రభావం చూపుతోంది. 

మాఫీ వస్తదని..
2015–16 ఆర్థిక సంవత్సరం నాటికి, ప్రభుత్వ బ్యాంకులు వ్యవసాయ రంగానికి ఇచ్చిన లోన్లలో రూ. 48,800 కోట్లు ఎన్‌‌పీఏలుగా మారాయి. 2019–20 నాటికి ఈ ఎన్‌‌పీఏలు రూ. 1.28 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంటే అగ్రిలోన్లు తీసుకున్న రైతులు తిరిగి అప్పులు చెల్లించడంలో ఇబ్బంది పడుతున్నారనే విషయం అర్థమవుతోంది. దీంతో పాటు చాలా రాష్ట్రాలు రైతు రుణ మాఫీలను ప్రకటిస్తున్నాయి. రైతులు కూడా రుణ మాఫీ జరుగుతుందనే ఆశతో తెచ్చిన అప్పులను తీర్చడానికి ఇష్టపడడం లేదు. రైతు రుణ మాఫీలు  2014–15 తర్వాత ఎక్కువగా పెరిగాయని ఎనలిస్టులు చెబుతున్నారు. 2015–16 నుంచి 2018–19 మధ్య  10 రాష్ట్రాలు రూ. 2.4 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశాయని పేర్కొన్నారు. రుణ మాఫీలు క్రెడిట్ సైకిల్‌‌ను దెబ్బతీస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాలు  మాఫీ ప్రకటించాక, బ్యాంకులు ఎన్‌‌పీఏలు వేగంగా పెరగడం చూడొచ్చని పేర్కొన్నారు. ఇలాంటి చర్యల వలన రైతులు అప్పులు తీర్చడానికి పెద్దగా ఇష్టపడడం లేదని అభిప్రాయపడ్డారు. రైతుల తరపున లోన్లను ప్రభుత్వాలు చెల్లిస్తున్నా, మొత్తం అప్పులు తీర్చడానికి 4–5 ఏళ్ల టైమ్‌‌ తీసుకుంటున్నాయి. దీంతో ప్రభుత్వ బ్యాంకులపై మరింతగా ఒత్తిడి పడుతోందని నిపుణులు తెలిపారు. కిసాన్‌ క్రెడిట్ కార్డులు ఇలాంటి పరిస్థితినే వివరిస్తున్నాయి. బిహార్‌‌‌‌లో కేసీసీల ద్వారా తీసుకున్న అప్పుల్లో 30 శాతం మొండిబాకీలుగా మారయని అంచనా. ఈ రాష్ట్రంలో చిన్న రైతులు చాలా ఎక్కువ. దీంతో రైతులకు పంటల ద్వారా పెద్దగా ఆదాయం రావడం లేదని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.