
బీజేపీకి అన్నాడీఎంకే బ్రేకప్ చెప్పింది. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఎన్డీయే కూటమి నుంచి అన్నాడీఎంకే పార్టీ వైదొలగింది. తమిళనాడు బీజేపీ నేత అన్నామలై చేసిన వ్యాఖ్యను నిరసిస్తూ.. అన్నాడీఎంకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేపీ మునుస్వామి ఎన్డీఏ నుంచి అన్నాడీఏంకే వైదొలిగినట్లు వెల్లడించారు.బీజేపీ, ఎన్డీఏతో అన్ని సంబంధాలను తెంపుకుంటున్నట్లు ప్రకటించారు. ఎంపీలు, ఎమ్మెల్యే, జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఏడాది నుంచి తమిళనాడులోని బీజేపీ వర్సెస్ అన్నాడీఎంకే నేతలు అన్నట్లు కొనసాగింది. పలు అంశాలపై రెండు పార్టీల నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఈ విభేదాలు, విమర్శలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే తాజా నిర్ణయం తీసుకుంది. అన్నాడీఏంకే నిర్ణయం పట్ల ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై దివంగత ముఖ్యమంత్రి జయలలితను విమర్శించారు. అన్నాడీఎంకే అధికారంలో ఉన్న సమయంలో జరిగిన అవినీతి జాబితాను విడుదల చేస్తానని అన్నారు. అలాగే, దివంగత సీఎం అన్నాదురై పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై న్నాడీఎంకే నేతలు ఖండించారు. దీంతో ఆ పార్టీలో సీనియర్లంతా అన్నామలై తీరుపై నిప్పులు చెరిగారు. దీనికి తోడు మాజీ మంత్రి జయకుమార్ సైతం అన్నామలై తీరుపై ఇటీవల ఘాటుగానే స్పందించారు. ఢిల్లీలో బీజేపీ నేతలను అన్నాడీఎంకే నేతలు కలవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే అన్నామలై తీరుపై ఢిల్లీ బీజేపీ పెద్దలకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఢిల్లీ పెద్దల ప్రోద్బలంతోనే అన్నామలైన విమర్శలు చేసి ఉంటారని పళనిస్వామి భావించారు. అలాగే బీజేపీ వల్లే గత ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయిందన్న అభిప్రాయం కూడా ఉంది. అటు సీట్ల కేటాయింపు అంశంలో రెండు పార్టీలకు పొసగలేదు. వీటన్నింటి వల్ల బీజేపీతో సంబంధాలలను అన్నా డీఎంకే తెంపుకుంది.