డేంజర్​లో అన్నారం బ్యారేజీ .. పునాదుల కింద కటాఫ్​ వాల్స్​కు గండి

డేంజర్​లో అన్నారం బ్యారేజీ .. పునాదుల కింద కటాఫ్​ వాల్స్​కు గండి
  • సమస్యను శాశ్వతంగా పరిష్కరించేదాకా బ్యారేజీలో నీళ్లు నిల్వ చేయొద్దు
  • 2020-------21 వాటర్​ఇయర్​లోనూ లీకేజీ

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో రెండో బ్యారేజీ అన్నారం కూడా డేంజర్ లో పడింది. బ్యారేజీ పునాదుల కింద కటాఫ్​వాల్స్ కు గండ్లు పడినట్టు నేషనల్​డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) గుర్తించింది. ఈ నెల 2వ తేదీన అన్నారం బ్యారేజీని సందర్శించిన ఎన్డీఎస్ఏ బృందం ఇటీవల స్టేట్​డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్​కు రిపోర్టు అందజేసింది. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్​లో పిల్లర్లు కుంగిన తర్వాత అన్నారం బ్యారేజీకి బుంగలు ఏర్పడ్డాయి. బ్యారేజీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన నేషనల్ ​డ్యామ్ సేఫ్టీ అథారిటీ సదరన్ ​రీజియన్ ​డైరెక్టర్​ఆర్.తంగమని, సీడబ్ల్యూసీ డైరెక్టర్లు రమేశ్​కుమార్, పి.దేవేందర్​రావుతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఈనెల 2న అన్నారం బ్యారేజీని పరిశీలించింది.

బ్యారేజీ 28, 38 గేట్ల ముందు నుంచి నీళ్లు లీక్​అవుతున్నాయని గుర్తించారు. వాటిని నివారించేందుకు ఇసుక బస్తాలు, బౌల్డర్లు వేసి రింగ్ బండ్ ​నిర్మించారని తెలిపారు. బ్యారేజీ గేట్ల ముందు కాంక్రీట్​బ్లాకులతో ఆప్రాన్​నిర్మించగా ఆ బ్లాకులన్నీ కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. బ్యారేజీ నుంచి వదిలిన నీరు ఉధృతంగా దిగువకు ప్రవహిస్తే గేట్ల కింద ఉన్న ఏరియా కోతకు గురికాకుండా రక్షణ కోసం భారీ కాంక్రీట్ బ్లాకులతో ఆప్రాన్​నిర్మిస్తారని, ఒక్కో బ్లాక్​బరువు 5 టన్నులు ఉంటుందని వెల్లడించారు. కాంక్రీట్​బ్లాకులకు దిగువన నిర్మించిన ఇన్​వర్టెడ్ కూడా కొట్టుకుపోయిందని తెలిపారు.

సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలే 

అన్నారం బ్యారేజీ 28, 38 గేట్ల ముందు ఏర్పడిన బుంగలను వెంటనే పూడ్చేసి లీకేజీలు అరికట్టాలని కమిటీ సభ్యులు సూచించారు. ఇది టెంపరరీ చర్య మాత్రమేనని.. శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు. గ్రౌండ్​పెనెట్రేటింగ్​రాడార్స్​(జీపీఆర్) లాంటి టెక్నికల్ లేదా ఇతర పద్ధతులతో బ్యారేజీలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలని, కటాఫ్​వాల్స్​కు, కటాఫ్ వాల్స్– రాఫ్ట్ మధ్య పగుళ్లు ఎక్కడ వచ్చాయో నిర్ధారించాలని సూచించారు. 
కటాఫ్​ వాల్స్

పగుళ్లను జల్ది పూడ్చేయడంతో పాటు పునాదుల కింద బుంగలు పడితే ఆ ప్రాంతాల్లో తవ్వి వాటిని పూడ్చేయాలని సూచించారు. సమస్య ఎందుకు తలెత్తుతుందో గుర్తించి శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని, అప్పటి వరకు బ్యారేజీలో నీటిని నిల్వ చేయరాదని సూచించారు. బ్యారేజీ రాఫ్ట్​(పునాది) కింద 12 మీటర్ల లోతులో ఎగువ కటాఫ్​ వాల్, 17.5 మీటర్ల లోతులో దిగువ కటాఫ్​వాల్​ నిర్మించారు. బ్యారేజీలోని నీళ్లు ఎగువ కటాఫ్​వాల్​ నుంచి కిందికి వచ్చే సరికి వేగం బాగా తగ్గిపోతుందని, ఆ నీళ్లు దిగువ కటాఫ్​ వాల్ ​వద్దకు చేరే వరకు వేగం పూర్తిగా తగ్గిపోతుంది. రాఫ్ట్​ కింద 17.5 మీటర్ల లోతులో ఉన్న దిగువ కటాఫ్​వాల్​ నుంచి బ్యారేజీ దాటే సరికి ఆ నీళ్లు ఉబికి వచ్చే సమయంలో ఇసుక కోతకు గురికాకుండా ఈ ఇన్వర్టెడ్​ ఫిల్టర్​నిర్మించారని తెలిపారు. వీటిలోని లోపాలను గుర్తించి సరి చేయాలన్నారు.

గతంలోనూ బ్యారేజీకి లీకులు

‘‘2020–21 వాటర్ ఇయర్​లోనూ బ్యారేజీలో ఇదే తరహా లీకులు వచ్చాయని కమిటీ సభ్యులు తెలిపారు. 3, 4 బ్లాకులతో పాటు 44వ గేట్​ ఎదుట అప్పట్లో బుంగలు ఏర్పడితే ఇసుక బస్తాలు, బౌల్డర్లతో రింగ్​ బండ్​ ఏర్పాటు చేసి పూడ్చేశారు. ఆ తర్వాత పాలిమర్​ఆధారిత సీలెంట్​ అనే కెమికల్ ​కాంప్లెక్స్​తో లీకేజీలను అరికట్టారు” అని వారు పేర్కొన్నారు. స్టీల్​ రీఎన్​ఫోర్స్​డ్, స్టీల్ ​లేని కాంక్రీట్​ పిల్లర్లను ఒకదాని పక్కన మరొక్కటి పేర్చి బ్యారేజీల పునాదులకు రెండు వైపులా భూగర్భంలో కటాఫ్​ వాల్స్​ నిర్మిస్తారని.. రీఎన్​ఫోర్స్​డ్ చేయని పిల్లర్లకు పగుళ్లు వచ్చి ఎగువ, దిగువ కటాఫ్​వాల్స్​కు గండ్లు పడే అవకాశముందని తెలిపారు. స్టీల్​ ఎన్​ఫోర్స్​డ్, స్టీల్ ​లేని పిల్లర్ల మధ్య ఉన్న దృఢత్వంలో వ్యత్యాసంతో కటాఫ్​ వాల్స్​ నిలువునా పగుళ్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.

ALSO READ : సెగ్మెంట్ రివ్యూ.. వరంగల్‍ తూర్పులో ట్రయాంగిల్ ఫైట్