భారత సైన్యానికి కొత్త యూనిఫాం

V6 Velugu Posted on Jan 15, 2022

ఆధునికత వైపు క్రమంగా అడుగులు వేస్తున్న భారత సైన్యం.. యూనిఫాం విషయంలోనూ కొత్తగా కన్పించనుంది.వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా 13 లక్షల మంది సైనికుల పోరాట దుస్తుల్లో మార్పు జరిగింది. జవాన్లకు మరింత సౌకర్యం కలిగించేలా, యుద్ధ క్షేత్రంలో శత్రువులను మెరుగ్గా ఏమార్చేలా వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ (శనివారం) వీటిని తొలిసారి ప్రదర్శించారు.

సైనిక దళాలకు ప్రత్యేకత తెచ్చేది వారు ధరించే విలక్షణ యూనిఫామే. సందర్భానికి తగ్గట్లు దుస్తులు వేసుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న సైనిక ఆనవాయితీ. ఇందులో పోరాట యూనిఫాం (కంబాట్‌ డ్రెస్‌)కు ఎనలేని ప్రాధాన్యం ఉంది. తీవ్ర వేడి, చలి నుంచి సైనికులను రక్షించడం, పరిసరాలకు అనుగుణంగా మారుతూ మెరుగ్గా కలిసిపోయి  శత్రువులను తెలివిగా బోల్తా కొట్టించడం వీటి ఉద్దేశం. ఇందుకోసం వస్త్రంపై భిన్న వర్ణాలను ఒక పద్ధతిలో కలపడం ద్వారా ఒక ప్యాటర్న్‌ను ఏర్పరుస్తారు.

ప్రస్తుతం సైన్యం వాడే పోరాట దుస్తులు బహిరంగ మార్కెట్‌లోనూ లభ్యమవుతున్నాయి. వివిధ శాఖల ఆధ్వర్యంలోని భద్రతా విభాగాలూ వాటిని విరివిగా ఉపయోగిస్తున్నాయి. ఆ శాఖల సిబ్బందిని కూడా సైనికులుగా ప్రజలు పొరబడుతున్నారు. దీంతో శాంతి భద్రతల విధుల్లో సైన్యాన్ని వాడుతున్నారన్న అపోహలు చెలరేగుతున్నాయి.

ప్రస్తుతం పోరాట యూనిఫాం జీవితకాలం 18 నెలలుగా ఉంది. దీంతో మరింత మన్నిక కలిగిన, ఎక్కువ సౌకర్యంతో కూడిన ఆధునిక వస్త్రం అవసరమైంది. సైనికుల సౌకర్యం, వారు విధులు నిర్వర్తించే భిన్న భౌగోళిక ప్రదేశాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్‌ రూపొందించారు. తీవ్ర వేడి, చలిని తట్టుకొనేలా పటిష్ఠత, తక్కువ బరువు కలిగిన వస్త్రాన్ని ఎంపిక చేశారు. ఇందులో 70 శాతం కాటన్‌, 30 శాతం పాలిస్టర్‌ను ఉపయోగించారు.

కొత్త యూనిఫాంను అన్ని భౌగోళిక ప్రదేశాలకూ అనువుగా తీర్చిదిద్దారు. దీంతో సైనికులు తమ పరిసరాలతో సులువుగా కలిసిపోతారు.ఈ కొత్త డ్రస్‌ను టక్‌ చేయరు. బెల్టు బయటకు కనిపించదు. లోపల టి షర్టు ధరించాలి. ప్యాంట్‌కు అదనపు జేబులు ఉంటాయి. ప్యాంట్‌ దిగువ భాగం.. బూట్లలోకి ఒదిగిపోతుంది. పోరాట దుస్తుల్లో ర్యాంకును సూచించే చిహ్నాలను భుజాలపై కాకుండా.. ముందు భాగంలో గుండీల దగ్గర ప్రదర్శించే అవకాశం ఉంది. మెరుగైన కమోఫ్లాజ్‌ కోసం వాటిని నలుపు రంగులో ప్రదర్శిస్తారన్న అభిప్రాయమూ ఉంది. కొత్త యూనిఫాం 13 సైజుల్లో లభ్యమవుతుంది. వీటిని పూర్తిగా సైన్యానికే ప్రత్యేకించారు. భద్రతా కారణాల కారణంగా పౌరులకు అందుబాటులో ఉంచరాదని ప్రభుత్వం నిర్ణయించింది.

మరిన్నివార్తల కోసం..

పాక్ సరిహద్దులో 1400 కిలోల భారత జాతీయ జెండా

Tagged first time, Army displays, new combat uniform

Latest Videos

Subscribe Now

More News