పెలోసీ టూర్​కు ప్రతీకారంగానే ఆర్మీ డ్రిల్స్​

పెలోసీ టూర్​కు ప్రతీకారంగానే ఆర్మీ డ్రిల్స్​

బీజింగ్​: చైనా, తైవాన్​మధ్య పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. తాము ఎంత తీవ్రంగా హెచ్చరించినా పట్టించుకోకుండా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్​ నాన్సీ పెలోసీ తైవాన్​లో పర్యటించడంపై చైనా ఆగ్రహంగా ఉంది. తమ హెచ్చరికలను బేఖాతరు చేసినందుకు తైవాన్​జలసంధిలో గురువారం మధ్యాహ్నం చైనా మిలిటరీ సైనిక విన్యాసాలు చేపట్టింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వ మీడియా చైనా డైలీ తెలిపింది. తైవాన్​ను చైనా తన భూభాగంలో భాగంగా చూస్తున్నది. అమెరికా స్పీకర్​పెలోసీ.. తైవాన్​లో పర్యటించడాన్ని చైనా జీర్ణించుకోలేకపోతోంది. గత 25 ఏళ్లలో యూఎస్​ స్పీకర్​అక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి. తమ వినతులు, హెచ్చరికలను పట్టించుకోకుండా పెలోసీ తైవాన్​లో పర్యటిస్తే  చైనా‌‌‌‌–అమెరికా మధ్య సంబంధాలపై తీవ్రంగా ప్రభావం పడుతుందని చైనా ఇప్పటికే అమెరికాకు వార్నింగ్​ ఇచ్చింది. అయినా అవేమీ పట్టించుకోకుండా పెలోసీ.. తైవాన్​లో అడుగుపెట్టారు. బుధవారం ఇక్కడి నుంచి ఆమె వెళ్లిపోయారు. అప్పటి నుంచి అమెరికాపై చైనా కోపంగా ఉంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం తైవాన్​తూర్పు భాగాల్లోని జలసంధిలో పీపుల్స్​లిబరేషన్​ ఆర్మీ (పీఎల్ఏ) ఈస్టర్న్​ థియేటర్​ కమాండ్​సైనిక విన్యాసాలు (ఆర్మీ డ్రిల్స్) చేపట్టిందని చైనా డైలీ వెల్లడించింది. ‘‘మంగళవారం రాత్రి నుంచే తైవాన్​ భూభాగాల్లోని గగనతలం, జలాల్లో పీఎల్ఏ సైనిక విన్యాసాలు జరుపుతోంది. ​తాజాగా చేసిన డ్రిల్స్ లో అనుకున్న  ఫలితాలను పీఎల్ఏ సాధించింది” అని ఆ దేశ మీడియా ఓ ప్రకటనలో తెలిపింది. ఇంతకుమించిన వివరాలను వెల్లడించలేదు. అక్కడి సముద్ర జలాల్లో ఉన్న నౌకలకు ఎంతమేర నష్టం జరిగిందో తెలియరాలేదు. పెలోసీని తమ భూభాగంలో అడుగుపెట్టనివ్వడం వల్ల.. ఇలాంటి డ్రిల్స్​నిర్వహించి తైవాన్​ను మరింత బెదిరింపులకు గురిచేయాలన్నది చైనా వ్యూహంగా కనబడుతోంది. తద్వారా తైవాన్​ను పూర్తిగా అష్టదిగ్బంధం చేయాలని భావిస్తోంది. చైనా ఆర్మీ డ్రిల్స్​ నిర్వహిస్తున్న తైవాన్​నైరుతి ప్రాంతంలో అమెరికా నేవీ వివిధ యుద్ధ నౌకలు, హెలికాప్టర్లతో ఇంతకుముందే అక్కడికి చేరుకుంది. 

ఫ్లైట్లను క్యాన్సిల్ ​చేసిన తైవాన్​

తమ దేశ భూభాగాల్లో చైనా ఆర్మీ డ్రిల్స్ చేసిన నేపథ్యంలో తైవాన్​ దేశం ఎయిర్​ లైన్​ఫ్లైట్లను రద్దు చేసుకుంది. తైవాన్ ​నుంచి కనీసం 40 విమానాలు రద్దయి ఉండవచ్చని చైనా మీడియా పేర్కొంది. సముద్ర మార్గం ద్వారా వివిధ సరుకులను చేరవేసేందుకు అక్కడున్న నౌకలపై చైనా సైనిక విన్యాసాలు ఏ మేరకు  ప్రభావం చూపాయో తైవాన్​ మీడియా వెల్లడించలేదు. కాగా చైనా ఆర్మీ డ్రిల్స్​తో అన్ని వైపుల నుంచి తైవాన్​ పూర్తిగా దిగ్బంధం అయిందని హాంగ్​కాంగ్ ​న్యూస్ ​పేపర్​‘ద సౌత్​చైనా మార్నింగ్ ​పోస్ట్’ పేర్కొంది.