ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. కనిపించని బాస్!​

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. కనిపించని బాస్!​
  • ఉద్యోగుల పనితీరుపై నిఘా పెట్టే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌
  • వాడుతున్న కస్టమర్ కేర్ ,ఇన్సూరెన్స్​ కంపెనీలు
  • అమెజాన్ , ఐబీఎం వంటి కంపెనీల్లోనూ సొంత ఏఐ
  • ఎప్పటికప్పుడు ఉద్యోగుల పనిపై రివ్యూలు

మేనేజరో లేదంటే డిపార్ట్​మెంట్​ ఇన్​చార్జ్​కో ఏదైనా కంపెనీ ఉద్యోగులు రిపోర్ట్​ చేస్తూ ఉంటారు. ప్రతి ఉద్యోగికి సంబంధించిన చిట్టా ఆ ఇన్​చార్జ్​ చేతిలో ఉంటుంది. ఉద్యోగి పెర్ఫార్మెన్స్​, యాటిట్యూడ్​ తదితర వ్యవహారాలన్నింటిపైనా ఓ కన్నేసి ఉంచుతుంటారు. కానీ, ఆ పనులన్నీ ‘బాస్‌‌’లా ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ– కృత్రిమ మేధ) చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా ఉద్యోగులను ఏఐ రీప్లేస్​ చేసేస్తోందన్న వార్తలను చదివే ఉంటాం కదా. కానీ, కొన్ని కంపెనీలు ఏఐకి నేరుగా బాస్​ స్థానాన్నే కట్టబెట్టేస్తున్నాయి. అమెరికాలోని బోస్టన్​కు చెందిన కాగిటో అనే ఏఐ సంస్థ అందుకు ఓ సాఫ్ట్​వేర్​ను తయారు చేసింది. ఆ సాఫ్ట్​వేరే ఉద్యోగుల పనితనాన్ని అంచనా వేస్తుంది. వాళ్ల పనిని అడుగడుగునా కాచుకుంటుంది. మాట్లాడే పద్ధతి, పనిలో ఉత్సాహం, గొంతులో సానుభూతి వంటి విషయాలను పసిగడుతుంది. తర్వాత వాళ్ల పనితీరుకు హార్ట్​, కాఫీ కప్​ వంటి గుర్తులతో రియల్​టైంలో మార్కులిస్తుంది. ప్రస్తుతం కొన్ని కస్టమర్​ కేర్​ కంపెనీలు, ఇన్సూరెన్స్​ సంస్థలు ‘ఏఐ బాస్​’లను నియమించుకుంటున్నాయి. దాదాపు 20 వేల మంది యూజర్లు తమ ఏఐ బాస్​ను నియమించుకున్నట్టు కాగిటో పేర్కొంది. మెట్​లైఫ్​, హ్యుమానా వంటి హెల్త్​ ఇన్సూరెన్స్​ కంపెనీలు ఆ సేవలు వినియోగించుకుంటున్నాయి. ఏఐ బాస్​ను పెట్టుకున్న తర్వాత కస్టమర్​లను సంతృప్తి పరచడంలో 13 శాతం పెరుగుదల నమోదైందట.

అణువణువూ నిఘా

ఏఐ బాస్​ ప్రధాన ఉద్దేశం ఉద్యోగుల పనితీరును పెంచడమేనని కాగిటో సీఈవో జోషువా ఫీస్ట్​ చెబుతున్నారు. ఇప్పటికే చాలా కస్టమర్​ కేర్​ కంపెనీలు ఈ కాగిటో ఏఐని వాడుతున్నాయి. ఉదాహరణకు, ఓ ఉద్యోగి కస్టమర్​తో ఫోన్​లో మాట్లాడేటప్పుడు, అతడి కంప్యూటర్​కింద చిన్న బాక్స్​ కనిపిస్తుంది. అక్కడ అతడి మాటతీరుపై రిమార్క్స్​ ఇస్తుంటుంది ఏఐ. ఒకవేళ అతడు స్పీడ్​గా మాట్లాడుతున్నాడంటే.. వెంటనే అలర్ట్​ చేస్తుంది. మాటల్లో ఇంకాస్త ఎనర్జీ కావాలంటే ‘కాఫీ’ కప్పును అక్కడ చూపిస్తుంది. మాటతీరు బాగాలేకుంటే ‘హార్ట్​’ సింబల్​ను ఇస్తుంది.

అమెజాన్​ ఉద్యోగులనూ తీసేసింది

అమెజాన్​ కూడా ఉద్యోగుల పనితీరును పరిశీలించేందుకు ఏఐని పెట్టింది. కానీ, అది చాలా సంక్లిష్టంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫుల్​ఫిల్​మెంట్​ సెంటర్లలో పనిచేసే ఉద్యోగుల పనితీరును బేరీజు వేసేందుకు అమెజాన్​ ఏఐని వాడుతున్నట్టు ఈ ఏడాది మొదట్లో ద వెర్జ్​ అనే వార్తా పత్రిక వెల్లడించింది. బాగా పనిచేయని వాళ్లను, టార్గెట్స్​ను చేరుకోని వాళ్లను ఉద్యోగం నుంచి తీసేసేందుకు ఆ ఏఐ పేపర్​వర్క్​ తయారు చేసేదట. ఐబీఎం కూడా వాట్సన్​ అనే సొంత ఏఐ ప్లాట్​ఫాంను వాడుతోంది. ఉద్యోగుల పనితీరు భవిష్యత్తులో ఎట్ల ఉంటుందన్న దానిపై రివ్యూలు చేస్తోంది. దాని వల్ల 96 శాతం ఫలితాలు కచ్చితత్వంతో వస్తున్నాయని కంపెనీ చెబుతోంది. ఇక, చాలా స్టార్టప్​ కంపెనీలు కాగిటో ఏఐని వాడుతున్నాయి. ఇటీవలే ఊబెర్​, లిఫ్ట్​ వంటి కంపెనీలు, షెడ్యూలింగ్​, పేరోల్​, పెర్ఫార్మెన్స్​ రివ్యూలపై ఇలాంటి ఏఐ బాస్‌‌లతోనే విదేశాలకు సేవలందించాయి.

ఉద్యోగాలు పోతయ్

నిజానికి ఇలా ఉద్యోగులను మానిటర్​ చేయడానికి ఏఐ వాడడం ఇది కొత్తేం కాదు. 20వ శతాబ్దం ప్రారంభంలోనే ఫ్రెడరిక్​ విన్​స్లో టేలర్​ అనే వ్యక్తి ఈ ఏఐ సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఏఐని బాస్​ల స్థానంలోకి తీసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆటేమేషన్​ వల్ల చాలా ఉద్యోగాలు పోయాయని, మళ్లీ వీటిని కూడా తీసుకొస్తే మరిన్ని ఉద్యోగాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, సంస్థలు మాత్రం దీని వల్ల ఉద్యోగుల పనితీరు మెరుగవుతుందని చెబుతున్నాయి. 1500 మంది పనిచేస్తున్న తమ కాల్​సెంటర్​లో మెట్​లైఫ్ కాగిటో ఏఐని పెట్టింది. నేరుగా తాను ఉద్యోగుల పనితీరును రివ్యూ చేయడం కన్నా, ఇలా ఏఐతో రివ్యూ చేయించడాన్ని చాలా మంది ఉద్యోగులు స్వాగతించారని మెట్​లైఫ్ గ్లోబల్​ ఆపరేషన్స్​ హెడ్ క్రిస్టోఫర్​ స్మిత్ చెప్పారు. మనుషులతో అది మమేకమవుతోందన్నారు. అమెరికాకు చెందిన ఆల్​టర్టిల్స్​, పైమెట్రిక్​ తదితర స్టార్టప్ లతో పాటు పోస్ట్​మేట్స్​, డోర్​డాష్​ వంటి డెలివరీ సంస్థలూ ఈ ఏఐ బాస్​ను వాడుతున్నాయి. మనుషులు చేసే తప్పులను సరిదిద్దడానికి ఏఐ కరెక్ట్​ సాధనమని కొందరు నిపుణులు చెబుతున్నారు.