బిహార్ హూచ్ విషాదంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) "ఆన్-స్పాట్" విచారణ నిర్వహించడానికి స్వంత దర్యాప్తు బృందాన్ని నియమించాలని నిర్ణయించింది. బీహార్‌లోని రెండు జిల్లాల్లో కల్తీ మద్యం సేవించి ఇప్పటివరకు 70మంది మృత్యువాత పడ్డారు. కానీ అధికారులు మాత్రం కేవలం 30మంది మాత్రమే చనిపోయినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ హెచ్ఆర్సీ స్పాట్ విచారణ కోసం తమ సభ్యులలో ఒకరి నేతృత్వంలోని సొంత దర్యాప్తు బృందాన్ని నియమించాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేసింది.
ఈ ఘటనలో బాధితులకు ఎక్కడ, ఎలాంటి వైద్యం అందజేస్తున్నారో చెప్పాలని ఈ సందర్భంగా కమిషన్ కోరింది. వీరిలో చాలా మంది పేద కుటుంబాలకు చెందిన వారే ఉన్నారని, వారికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించుకోలేరని తెలిపింది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వారికి అందుబాటులో ఉన్న చోట సాధ్యమైనంత ఉత్తమమైన వైద్య చికిత్సను అందించడం చాలా అవసమని ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇప్పటికే మద్యం నిషేధం అమలుచేస్తోన్న బిహార్ ప్రభుత్వం.. దాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుందో తెలుసుకోవాలనుకుంటున్నామని కమిషన్ పేర్కొంది.

