బలగం షోలలో పొలిటికల్ టీజర్స్

బలగం షోలలో పొలిటికల్ టీజర్స్
  • బలగం షోలలో పొలిటికల్ టీజర్స్
  • సినిమా షోకు ముందు లీడర్ల సెల్ఫ్ ప్రమోషన్
  • ఎల్ఈడీ బిగ్ స్క్రీన్లకు పెరిగిన డిమాండ్
  • ఒక షోకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు వసూలు చేస్తున్న ఓనర్లు

కరీంనగర్, వెలుగు : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన బలగం సినిమా.. లీడర్ల  పొలిటికల్ క్యాంపెయినింగ్​కు అడ్డాగా మారింది. జనాల్లో తమను, తమ పార్టీ కార్యక్రమాలను ప్రమోట్​చేసుకునేందుకు కొందరు లీడర్లు ఈ మూవీ షోలను వాడవాడలా వేస్తున్నారు. సినిమా షోకు ముందు పొలిటికల్​టీజర్లు రిలీజ్​చేస్తున్నారు. మొదట్లో పల్లెలకే పరిమితమైన బలగం సినిమా షోలు ఇప్పుడు  పట్టణాలతోపాటు కరీంనగర్ లాంటి సిటీలకూ విస్తరించాయి. వేలాది మంది సమక్షంలో స్కూల్, కాలేజీ, మున్సిపల్ గ్రౌండ్లలో ఈ మూవీని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఎల్ఈడీ బిగ్​స్క్రీన్లకు ఒక్కసారిగా డిమాండ్​పెరిగింది. 

ఖర్చు తక్కువ.. పబ్లిసిటీ ఎక్కువ 

పొలిటికల్ మీటింగ్ కు వేలాది మందిని తరలించాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సిన ఈ రోజుల్లో..  కేవలం రూ.10 వేల నుంచి రూ.20 వేల  ఖర్చుతో గ్రామాల్లో, పట్టణాల్లో లీడర్లు సెల్ఫ్ ప్రమోషన్  చేసుకుంటున్నారు. ఈ సినిమా ప్రదర్శనకు ముందు తమ గురించి ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలు ప్లే చేస్తూ పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు తాము చేసిన అభివృద్ధి పనుల గురించి బలగం షోలలో ప్రచారం చేసుకోవడం ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో బలగం మూవీ ప్రదర్శిస్తున్న వివిధ గ్రామాల్లో రాష్ట్ర బీసీ సంక్షేమం, సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వీడియోలు ప్లే చేస్తున్నారు. 

ముందుగానే స్ర్కీన్ల బుకింగ్​

బలగం సినిమాను తమ గ్రామాల్లో ప్రదర్శించాలనే డిమాండ్ జనాల నుంచి రోజురోజుకు పెరుగుతోంది. దీంతో సినిమా షో వేసేందుకు లోకల్ లీడర్లు పోటీ పడుతున్నారు. వచ్చేది ఎలక్షన్ ఇయర్ కావడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనుకుంటున్న అభ్యర్థులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే విలేజీ లీడర్లు  బలగం సినిమా చూపించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో సినిమా ప్రదర్శించడానికి అవసరమైన ఎల్ఈడీ స్క్రీన్లకు డిమాండ్ పెరిగింది. అనుకున్న తేదీల్లో సినిమా వేసేందుకు లీడర్లు ముందస్తుగా  స్క్రీన్లను బుక్ చేసుకుంటున్నారు. ‘మీరు కూడా మీ ఊరి బలగంతో కలిసి బలగం  సినిమాను అత్యాధునికమైన ఎల్ఈడీ స్క్రీన్లపై చూడానుకుంటే మమ్మల్ని సంప్రదించండి’ అంటూ ఎల్ఈడీ స్క్రీన్ల ఓనర్లు సోషల్ మీడియాలో తమ ఫోన్ నంబర్లను ప్రచారం చేస్తున్నారు. 

రూ.14 వేలు తీసుకుంటున్నాం 

బలగం సినిమా షో వేసేందుకు వివిధ పార్టీలు, అసోసియేషన్ల లీడర్ల నుంచి బుకింగ్స్ వస్తున్నాయి. బలగం సినిమా ప్రదర్శనకు స్క్రీన్, దూరాన్ని బట్టి రూ.14 వేల వరకు తీసుకుంటున్నం. బలగం సినిమా ప్రదర్శనకు లీడర్ల మధ్య పోటీ పెరగడంతో మాకు కూడా డిమాండ్ పెరిగింది. 

- సిరి రవి, జిల్లా అధ్యక్షుడు, ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్