ఇయ్యాలా GHMC లో కౌన్సిల్ మీటింగ్

ఇయ్యాలా GHMC లో కౌన్సిల్ మీటింగ్
  • చర్చకు వచ్చిన ప్రశ్నలు మొత్తం126 
  • ఇందులోంచి 30  మాత్రమే సెలెక్ట్
  • మూడేండ్ల జీహెచ్ఎంసీ పాలనపై చర్చ
  • కొత్త సర్కార్ ఏర్పాటయ్యాక తొలిసారి కౌన్సిల్ భేటీ

హైదరాబాద్, వెలుగు: బల్దియా కౌన్సిల్ మీటింగ్ కు అంతా సిద్ధమైంది. ఎనిమిదోసారి నిర్వహించే సమావేశం సోమవారం హెడ్డాఫీసులోని కౌన్సిల్​హాల్ లో జరగనుంది. ఉదయం10.30 గంటలకు మీటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సభ్యుల నుంచి మొత్తం126  ప్రశ్నలు రాగా, వాటిలో 23 ప్రశ్నలపై మాత్రమే చర్చించే అవకాశం ఉంది. ఇప్పటివరకు జరిగిన ఏడు సమావేశాల్లో  ఏ ఒక్కటి సక్రమంగా నిర్వహించలేదు.

గతేడాది ఆగస్టు 23న జరిగిన చివరి మీటింగ్ కేవలం3 గంటల్లోనే ముగిసింది. సిటీ సమస్యలపై పెద్దగా చర్చకు రాలేదు. అంతకు ముందు జరిగిన మీటింగ్ ను అధికారులు బాయ్ కాట్ చేయగా.. ఎలాంటి చర్చ లేకుండానే 20 నిమిషాల్లో పూర్తయింది.  రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా బల్దియా కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది.

ఇన్నాళ్లు రాష్ట్రంలో, బల్దియాలో బీఆర్ఎస్​నే అధికారంలో ఉండగా.. సభ్యులు అడిగిన చాలా ప్రశ్నలకు సరైన సమాధానాలు వచ్చేవి కావు.  ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మారగా, బల్దియాలో మాత్రం బీఆర్ఎస్​మేయర్ ఉన్నారు. దీంతో మీటింగ్ ఎలా జరుగుతుందనే ఆసక్తి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులపై ప్రతి మీటింగ్ లో సభ్యులు ఎంత అడిగిన కూడా జవాబులు చెప్పలేదు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడగా అన్ని వివరాలు తెలిపేందుకు.. అధికారులు కూడా గతంలో మాదిరిగా కాకుండా అన్ని  విషయాలపై కౌన్సిల్ కు  సిద్ధమైనట్టు తెలిసింది. 

గత అధికార పార్టీ చెందినవారు మినహా..  

సిటీ ప్రజా సమస్యలపై ఈసారినా ఎంత వరకు చర్చిస్తారనేది వేచి చూడాలి.  గతంలో జరిగిన ప్రతి మీటింగ్ లోనూ సభ్యుల నుంచి వచ్చిన ఏ ఒక్క ప్రశ్నపైనా సుదీర్గంగా చర్చ జరగలేదు. మరోవైపు సభ్యులు సంతృప్తి చెందేలా అధికారులూ సమాధానాలు చెప్పలేదు. అధికార పార్టీ మినహా మిగతా సభ్యులకు మాట్లాడేందుకు పెద్దగా చాన్స్ ఇవ్వకపోగా పలువురు సభ్యులు ఆందోళనలు కూడా చేశారు.

ALSO READ : మేడిగడ్డ పనులకు బ్రేక్ .. బ్యారేజీకి చేరుకున్న అన్నారం నీళ్లు

ఇప్పుడు కూడా ప్రభుత్వ అనుకూల ఉన్న ప్రశ్నలపైనే చర్చించకుండా ప్రతి సభ్యుడు అడిగిన వాటిపైనా చర్చజరగాలని పలువురు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా సమస్యలపై కౌన్సిల్ లో నిలదీసేందుకు కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ కార్పొరేటర్లు  ఈసారి పలు సమస్యలను లేవనెత్తనున్నట్లు తెలిసింది.  పదేండ్లలో సిటీకి  గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందనే  దాంతో పాటు, ప్రస్తుత కౌన్సిల్ ఏర్పటైన మూడేండ్ల పాలనపై కూడా మీటింగ్ లో చర్చకు పట్టుబట్టే చాన్స్ ఉంది.

పార్టీల కార్పొరేటర్ల బలాబలాలు

మూడేండ్ల కిందట గ్రేటర్ ఎన్నికల్లో  బీఆర్ఎస్​నుంచి 56, బీజేపీ నుంచి 48 , ఎంఐఎం నుంచి 44, కాంగ్రెస్​ నుంచి 2 చొప్పున కార్పొరేటర్లు గెలుపొందారు. ఇందులో బీజేపీ నుంచి గెలిచిన లింగోజీగూడ కార్పొరేటర్ ప్రమాణ స్వీకారానికి ముందే మరణించాడు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్​ గెలిచింది. దీంతో బీజేపీకి 47, కాంగ్రెస్​కు ముగ్గురు కార్పొరేటర్లు ఉన్నారు. అనంతరం ఎంఐఎం కార్పొరేటర్లు మినహా మిగతా పార్టీల కార్పొరేటర్లు పార్టీలు మారారు. ప్రస్తుతం బీఆర్ఎస్​ కు 54 . ఎంఐఎంకు 44 , బీజేపీకు 40, కాంగ్రెస్​ కు 11 మంది కార్పొరేటర్లు ఉన్నారు. గత కౌన్సిల్ మీటింగ్ లో కాంగ్రెస్​కు నలుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు.  అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఆ తర్వాత బీఆర్ఎస్​లోంచి కార్పొరేటర్లు కాంగ్రెస్​లోకి రాగా ఆ సంఖ్య11కు చేరింది.