నా వల్ల కాదు.. నేను దిగిపోతా: చేతులేత్తేసిన బంగ్లా తాత్కలిక ప్రధాని యూనస్

నా వల్ల కాదు.. నేను దిగిపోతా: చేతులేత్తేసిన బంగ్లా తాత్కలిక ప్రధాని యూనస్

ఢాకా: బంగ్లాదేశ్‎లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంగ్లా తాత్కలిక ప్రధాని యూనస్‎కు, ఆ దేశ ఆర్మీ చీఫ్‎కు మధ్య గ్యాప్ వచ్చింది. ఎన్నికల నిర్వహణలో జాప్యంపై యూనస్ సర్కార్‏పై సైన్యం తీవ్ర అసహనంగా ఉంది. ఎన్నికలు నిర్వహించకుండా అమెరికా మద్దతుతో పాలన కంటిన్యూ చేసేందుకు యూనస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయనపై ఆర్మీ ఆగ్రహంగా ఉంది. అంతేకాకుండా మయన్మార్ రఖైన్ ప్రాజెక్ట్ విషయంలో కూడా యూనస్ ప్రభుత్వానికి, ఆర్మీ జనరల్ కు మధ్య చీలికలు వచ్చాయి. 

రఖైన్ కారిడార్ ప్రాజెక్ట్‎ను బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఖైన్ కారిడార్ ప్రాజెక్ట్ విషయంలో యూనస్ సర్కార్ వెనక్కి తగ్గింది. ఇదిలా ఉంటే.. ఎన్నికల నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీల నుంచి ఏకాభిప్రాయం రాకపోవడం కూడా యూనస్‎కు తలనొప్పిగా మారింది. అటు ఆర్మీ, ఇటు పొలిటికల్ పార్టీలతో పొసగకపోవడంతో ఇక నా వల్ల కాదని.. పదవి నుంచి దిగిపోయేందుకు యూనస్ సిద్ధపడ్డట్లు తెలుస్తోంది. బీబీసీ బంగ్లా కూడా ఈ మేరకు ఒక కథనం ప్రచురించింది. రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావడంలో విఫలమైనందున యూనస్ సమర్థవంతంగా పనిచేయడం కష్టతరం అవుతోందని పేర్కొంది.  

యూనస్ రాజీనామా వార్తలపై నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు నిద్ ఇస్లాం స్పందించారు. ఆయన బీబీసీ బంగ్లాతో మాట్లాడుతూ.. యూనస్ రాజీనామా వార్తలు విని వెంటనే ఆయనను కలవడానికి వెళ్లా. నిజంగానే రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ఆయన నాకు చెప్పారు. ప్రస్తుత పరిస్థితిలో తాను పని కొనసాగించలేనని ఆయన భావిస్తున్నారు. రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రాకపోతే తాను పని చేయనని చెప్పాడు. దేశ భద్రత, దాని భవిష్యత్తు కోసం బలంగా ఉండమని నేను అతనికి చెప్పాను. రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి యూనస్ తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించడానికి అవసరమైన సహకారాన్ని అందిస్తాయని తాను ఆశిస్తున్నా’’ అని అన్నారు. 
 
కాగా, ప్రభుత్వ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరుద్యోగుల పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. విద్యార్థుల ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. దీంతో  ఆ దేశ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచిపారిపోయారు. బంగ్లాలో షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలింది. యూనస్ నేతృత్వంలో బంగ్లాలో తాత్కలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు యూనస్ సర్కార్ పై కూడా వ్యతిరేకత వస్తుండటంతో బంగ్లాలో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది.