కరోనా స్థాయిలో డెంగ్యూ కేసులు.. 2 లక్షల మంది బాధితులతో దేశం అల్లకల్లోలం

కరోనా స్థాయిలో డెంగ్యూ కేసులు.. 2 లక్షల మంది బాధితులతో దేశం అల్లకల్లోలం

డెంగ్యూ.. ఇది సీజనల్ గా వచ్చేది.. వాతావరణ మార్పుల సమయంలో రావటం ఇప్పటి వరకు చూశాం.. పరిస్థితులు మారిపోయాయి. డెంగ్యూ అనేది ప్రపంచ వ్యాప్తంగా భయపెడుతుంది. ముఖ్యంగా భారతదేశానికి పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ దేశాన్ని డెంగ్యూ ఇప్పుడు అల్లకల్లోలం చేస్తుంది. గత ఏడు, ఎనిమిది నెలలుగా 2 లక్షల మంది డెంగ్యూ బారిన పడ్డారు. వెయ్యి మంది చనిపోయారు. గతంలో ఎప్పుడు.. ఎన్నడూ చూడని ఆరోగ్య విపత్తు అంటోంది ఆ దేశం. కరోనా తర్వాత ఆ స్థాయిలో డెంగ్యూ విరుచుకుపడటం ఇప్పుడు.. బంగ్లాదేశ్ దేశాన్ని కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఆ దేశ అధికారిక లెక్కల ప్రకారమే 2 లక్షల మంది అంటే.. అనధికారికంగా.. లెక్కల్లోకి రాని కేసులను పరిగణలోకి తీసుకుంటే.. ఇది 4 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 

డెంగ్యూతో ఓ దేశం మొత్తం అల్లాడిపోవటం.. ప్రపంచ ఆరోగ్య చరిత్రలో ఇదే ప్రథమం అంటోంది ప్రపంచం ఆరోగ్యం సంస్థ.. WHO. ఒక్క బంగ్లాదేశ్ దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో డెంగ్యూ కేసులు, మరణాలు పెరగటం 2023లోనే చూస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్ లో ప్రతి మూడు కుటుంబాల్లో ఒకరు డెంగ్యూ బారిన పడినట్లు ఆ దేశం లెక్కలు చెబుతున్నాయి. ఈ మహమ్మారి కారణంగా బంగ్లాదేశ్ లో  మరణించిన వారిలో 100 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో ఎక్కువ మంది 15 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆసుపత్రులు, చిన్నచిన్న వైద్య కేంద్రాల్లో పెద్దఎత్తున రద్దీ నెలకొంది. మరోవైపు బాధితులకు సరైన వైద్యం అందడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. 

“నా కొడుక్కి డెంగ్యూ ఎలా సోకిందో నాకు తెలియదు  అకస్మాత్తుగా అతనికి జ్వరం వచ్చింది. నేను అతనిని అసుపత్రికి తరలించానని , ఆపై అతనికి డెంగ్యూ ఉందని వైద్యులు కనుగొన్నారు, ”అని ఢాకాలోని ముగ్దా జనరల్ హాస్పిటల్‌లో తన కొడుకును జాయిన్ చేర్చిన ఓ తల్లి తెలిపింది.  ఆసుపత్రలకు   ఢాకా నుంచి  రోగులు తగ్గినప్పటికీ, దేశంలోని గ్రామీణ ప్రాంతాల నుండి అడ్మిట్ అవుతున్న వారి సంఖ్య పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. . 

జనసాంద్రత అధికంగా ఉన్నఈ దక్షిణాసియా దేశంలో డెంగ్యూ వేగంగా విస్తరిస్తోంది. డెంగ్యూ అనేది ఉష్ణమండల ప్రాంతాలలో కనిపించే వ్యాధి. అధిక జ్వరం, తలనొప్పి, వికారం, వాంతులు, కండరాల నొప్పి, రక్తస్రావం మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలు. వాతావరణ మార్పుల వల్ల డెంగ్యూ, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్‌, జికా వంటి దోమల వల్ల వచ్చే వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. డెంగ్యూ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్స అందించే టీకా లేదా మందు ఇంతవరకూ అందుబాటులో లేదు. డెంగ్యూని వ్యాప్తి చేసే ఏడిస్ ఈజిప్టి దోమ నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో వృద్ధి చెందుతుంది. అందుకే మన ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు.