చైనాలో జలవిలయం... 140 ఏళ్ల రికార్డ్ కు బ్రేక్

చైనాలో  జలవిలయం... 140 ఏళ్ల రికార్డ్ కు బ్రేక్

డోక్సూరి తుపాను  కారణంగా చైనా   అల్లాడిపోతోంది. కొన్ని రోజులుగా ఆ దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు  వరదలు  పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా రాజధాని బీజింగ్ వరదలకు అతలాకుతలమైంది.  పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో రోడ్లు, ప్రధాన వీధులు, నివాస సముదాయాలన్నీ నదులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ వంతెనలు తెగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద నీటిలో కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోతున్నాయి. 5 లక్షల మందికిపైగా ప్రజలు ఈ వరదలకు ప్రభావితులయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

చైనా రాజధాని బీజింగ్‌తో పాటు దాని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆ తర్వాత వాతావరణ శాఖ బుధవారం (ఆగస్టు 2) బీజింగ్‌లో ఇటీవలి రోజుల్లో కురిసిన వర్షాలు 140 సంవత్సరాల క్రితం సంభవించిన భారీ వర్షాల రికార్డును బద్దలు కొట్టాయని తెలిపింది. ఈ తుఫాను సమయంలో అత్యధికంగా 744.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని బీజింగ్ వాతావరణ శాఖ తెలిపింది.చాంగ్‌పింగ్‌లోని వాంగ్జియాయువాన్ రిజర్వాయర్‌లో ఈ వర్షం కురిసింది. గత 140 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతం. ఫిలిప్పీన్స్‌లో దోక్సూరి తుఫాను బీభత్సం సృష్టించింది.  దక్షిణ ఫుజియాన్ ప్రావిన్స్‌ను తాకిన తర్వాత, అది చైనా ఉత్తర దిశగా కదిలింది.

ఇదిలా ఉంటే  చైనా దేశంలో ఆగస్టు నెలలో పలు టైఫూన్లు తాకే అవకాశం ఉందని ఆ దేశ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. చైనాలో భారీ వర్షాల మధ్య, ఉత్తర. దక్షిణ చైనాలోని పలు ప్రాంతాల్లో ఆగస్టులో రెండు లేదా మూడు టైఫూన్‌లు దేశవ్యాప్తంగా తీరాన్ని తాకే అవకాశం ఉన్నందున వరదలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. డోక్సూరి టైఫూన్ వల్ల బీజింగ్, హెబీ ప్రావిన్సు ప్రాంతాల్లో భారీవర్షాలు కురవడం వల్ల వరదలు వెల్లువెత్తాయి.

యాంగ్జీ నది ఎగువ ప్రాంతాలు, పోయాంగ్ సరస్సు, పసుపు నది ఎగువ ప్రాంతాలు, సాంగ్హువా నది నిర్దేశిత హెచ్చరిక స్థాయిలను మించి వరదలు వచ్చే అవకాశం ఉంది. ప్రాంతీయ తుపాన్లు, వరదలు హువైహే, తైహు సరస్సు, జుజియాంగ్ నది,హైనాన్ ద్వీపంలోని నదుల్లో వరదనీరు పొంగి ప్రవహించవచ్చని అధికారులు చెప్పారు. రెండు నుంచి మూడు టైఫూన్లు ల్యాండ్ ఫాల్ లేదా దేశవ్యాప్తంగా వాతావరణ వ్యవస్థలను ప్రభావితం చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

వర్షంలో కోల్పోయిన లేదా చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేయాలని అధ్యక్షుడు జి జిన్‌పింగ్  ప్రకటించారు. చైనా ప్రస్తుతం విపరీతమైన పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. వాతావరణ మార్పుల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సంవత్సరంలో ఆరవ తుఫాను అయిన ఖానూన్ టైఫూన్ రాకపై దేశం ఇప్పుడు అప్రమత్తంగా ఉంది.

చైనాలో వరదల వల్ల  ( వార్త రాసమయానికి) 20 మంది మరణించారు. బీజింగ్ నగరంలో వరదల్లో విధి నిర్వహణలో ఉన్న 11మంది అధికారులు మృత్యువాత పడ్డారు. వరదల్లో మరో 13 మంది గల్లంతు అయ్యారు. యాంగ్జీ నది వరదల సందర్భంగా చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వశాఖ, అత్యవసర నిర్వహణ మంత్రిత్వశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అధిక వర్షపాతంతో చైనాలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.