అధికారులు చట్టానికి లోబడి పనిచేయడం మరిచిపోయారు

అధికారులు చట్టానికి లోబడి పనిచేయడం మరిచిపోయారు

గతంలో గవర్నర్ బంగ్లా ముందు ధర్నాకు కూర్చున్న బెంగాల్ గవర్నర్.. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.  ప్రభుత్వ అధికారులెవరూ చట్టాన్ని పాటించడంలేదని బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తానొక గవర్నర్‎ను అని.. ఫోన్ చేస్తే చీఫ్ సెక్రటరీ కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడంలేదని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ మంగళవారం రాష్ట్ర బ్యూరోక్రాట్‌లపై విరుచుకుపడ్డారు. గవర్నర్‎కు ఏయే అధికారులుంటాయో కూడా ప్రభుత్వ అధికారులకు తెలియదని గవర్నర్ అన్నారు.

మంగళవారం పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌.. ‘ప్రతి ఒక్కరూ చట్ట ప్రకారం పనిచేయాలని నేను చాలా ప్రయత్నించాను. ప్రభుత్వ అధికారులు చట్టానికి లోబడి పనిచేయడం మరిచిపోయారు. గవర్నర్ హౌస్ ఏంచేయగలదో కూడా వారికి తెలియదు’అని ఆయన అన్నారు.

బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీపై కూడా గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హౌరా మున్సిపాలిటీ బిల్లు వంటి బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‎లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేసిందని ఆయన అన్నారు. అసలు తన కార్యాలయంలో ఎటువంటి బిల్లులను పెండింగ్‎లో ఉంచలేదని గవర్నర్ జగదీప్ అన్నారు. 

‘నేను ఏ బిల్లును హోల్డ్‌లో ఉంచలేదు. నేను ఎల్లప్పుడూ అన్ని బిల్లులను 48 గంటల్లోనే పాస్ చేస్తాను. ఏ బిల్లు నా టేబుల్‌పై లేదు. అసెంబ్లీ నుంచి నాకు కొన్ని వివరణలు కావాలి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ చట్టానికి మించి వ్యవహరిస్తున్నారు. ఆయన పనితీరు చూసి నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను’జగదీప్ ధన్‌ఖర్ అన్నారు. 

కాగా.. జగ్‌దీప్ ధన్‌ఖర్ ఆరోపణలపై స్పీకర్ బిమన్ బెనర్జీ స్పందించారు. ‘గవర్నర్ ఇలాంటి వ్యాఖ్యలకు ఈ వేదికను ఉపయోగించుకుంటారని మాకు తెలియదు. ఆయన ఈ మీడియా ఇంటరాక్షన్‌ని అసెంబ్లీలో కాకుండా.. గవర్నర్ హౌస్‎లోనే చేసి ఉంటే బాగుండేది’అని అన్నారు.

For More News..

కలిసున్న కవలలకు సెపరెట్ ఓటర్ కార్డులు

ఒలింపిక్ విజేతకు రిపబ్లిక్ డే సత్కారం

పంజాబ్ ఎన్నికల్లో కొత్త ప్రచారం.. వైరల్‎గా వీడియో