శ్రీరామనవమికి భద్రాద్రి ముస్తాబు..ఇంటికే రామయ్య తలంబ్రాలు

శ్రీరామనవమికి భద్రాద్రి ముస్తాబు..ఇంటికే రామయ్య తలంబ్రాలు
  •     17న సీతారాముల కల్యాణం, 18న మహాపట్టాభిషేకం
  •     రూ. 2.88 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్న ఆఫీసర్లు
  •     ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో కల్యాణ, పట్టాభిషేక టికెట్లు

భద్రాచలం, వెలుగు : తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం ముస్తాబవుతోంది. ఈ నెల 9 నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 17న సీతారాముల కల్యాణం, 18న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాలకు సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తారని ఆఫీసర్లు అంచనా వేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు.

స్పీడ్‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతున్న పనులు

భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు సౌలత్‌‌‌‌‌‌‌‌లు కల్పించడంతో పాటు, బ్రహ్మోత్సవాల కోసం దేవస్థానం రూ. 2.88 కోట్లను కేటాయించింది. ఇందులో 1.30 కోట్లతో ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ పనులు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయం దగ్గర పడుతుండడంతో పనులు స్పీడ్‌‌‌‌‌‌‌‌గా నిర్వహిస్తున్నారు. ఈఈ రవీందర్‌‌‌‌‌‌‌‌ రాజు ఆధ్వర్యంలో భద్రాచలం, పర్ణశాల ఆలయాలకు రంగులు వేస్తున్నారు. మిథిలా ప్రాంగణంలోని కల్యాణ మండపానికి రంగులు వేయడంతో పాటు భక్తుల సౌకర్యం కోసం చలువ పందిళ్ల నిర్మాణం జరుగుతోంది. 

అలాగే తాత్కాలిక వసతి, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు నిర్మించడంతో పాటు, మంచినీటి సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రధాన ఆలయం, ఉపాలయాలు, పర్ణశాల వద్ద గల రామాలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. అలాగే భద్రాచలం పట్టణంతో పాటు, బూర్గంపాడు, మణుగూరు క్రాస్‌‌‌‌‌‌‌‌ రోడ్ల వద్ద స్వాగతతోరణాలు నిర్మించడంతో పాటు, తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ముద్రించిన వాల్‌‌‌‌‌‌‌‌ పోస్టర్లను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌, ఒడిశాల్లో అంటించారు.  

ఉగాది రోజునే బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్నందున ఆలోగా పనులన్నీ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఈవో ఎల్.రమాదేవి వెల్లడించారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ప్రియాంక అలా, ఐటీడీఏ పీవో ప్రతీక్‌‌‌‌‌‌‌‌జైన్‌‌‌‌‌‌‌‌, ఆర్డీవో దామోదర్‌‌‌‌‌‌‌‌ల పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతుండగా, భద్రతా ఏర్పాట్లను ఎస్పీ రోహిత్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌, ఏఎస్పీ పంకజ్‌‌‌‌‌‌‌‌ పరితోశ్‌‌‌‌‌‌‌‌ పర్యవేక్షిస్తున్నారు.

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో టిక్కెట్లు

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే కల్యాణం, మహాపట్టాభిషేక కార్యక్రమాలకు హాజరయ్యే భక్తుల కోసం ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో టికెట్లను అందుబాటులో ఉంచారు. కల్యాణానికి సంబంధించి రూ. 7,500, రూ.2,500, రూ.2,000, రూ.1,000, రూ.300, రూ.150 సెక్టార్లుగా విభజించారు. వీటికి సంబంధించిన మొత్తం 11,440 టికెట్లను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో పెట్టగా ఇప్పటివరకు కేవలం 1,100 టికెట్‌‌‌‌‌‌‌‌ మాత్రమే బుక్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. మహాపట్టాభిషేక కార్యక్రమం కోసం రూ.1,500, రూ.500, రూ.100 సెక్టార్లుగా విభజించారు. వీటితో పాటు ఇటు కల్యాణానికి, అటు మహాపట్టాభిషేకానికి ఫ్రీ సెక్టార్లు సైతం అందుబాటులో ఉన్నాయి. ఉత్సవాలకు హాజరుకాలేని భక్తులు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో పరోక్ష సేవలను పొందేందుకు కూడా వెసులుబాటు కల్పించారు. ఈ టికెట్ల ధరలను రూ.5 వేలు, రూ.1,116లుగా నిర్ణయించారు. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో టికెట్లను బుక్‌‌‌‌‌‌‌‌ చేసుకునేందుకు ప్రత్యేకంగా bhadradritemple.telangana.gov.in అనే వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ను తెరిచారు.

కోటి గోటి తలంబ్రాల సమర్పణ

ఖమ్మంకు చెందిన మహిళా భక్తులు బియ్యం గింజపై శ్రీరామ నామాన్ని రాసి, గోటితో వలిచిన కోటి తలంబ్రాలను గురువారం భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో అందజేశారు. శ్రీగిరి సేవా సమితికి చెందిన 150 మంది మహిళలు శ్రావణమాసం నుంచి కోటి గోటి తలంబ్రాలను తయారు చేశారు. గురువారం పాదయాత్రగా భద్రాచలం వచ్చారు. సీతమ్మ వారికి చీర, సారె, ఐదు క్వింటాళ్ల బియ్యాన్ని అందజేశారు. గత ఐదేళ్లుగా వీరు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

ఇంటికే రామయ్య తలంబ్రాలు

రాములవారి కల్యాణం అనంతరం తలంబ్రాలను భక్తుల ఇండ్లకు సరఫరా చేయనున్నారు. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 5 నుంచి 18వ తేదీ వరకు ఆర్టీసీ లాజిస్టిక్‌‌‌‌‌‌‌‌ కేంద్రాల్లో రూ.151 చెల్లించి, తమ వివరాలతో బుక్‌‌‌‌‌‌‌‌ చేసుకున్న భక్తులకు మాత్రమే ఆర్టీసీ కార్గో ద్వారా తలంబ్రాలను అందజేయనున్నారు. ఖమ్మం, సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు డిపోల్లో ఈ అవకాశం అందుబాటులో ఉంది. ఈ సారి ఐదు లక్షల తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేసేందుకు ఆలయ ఆఫీసర్లు యాక్షన్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ తయారు చేశారు. ఆర్టీసీ ద్వారా 3.50 లక్షల ప్యాకెట్లు, పోస్టల్‌‌‌‌‌‌‌‌ ద్వారా లక్ష ప్యాకెట్ల ఆర్డర్‌‌‌‌‌‌‌‌ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆలయంలో కూడా ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను భక్తులకు విక్రయించనున్నారు. శ్రీరామనవమి కోసం 3 లక్షల లడ్డూలను తయారు చేయనున్నారు.