రామయ్య పట్టాభిషేకంలో గవర్నర్‌ను పట్టించుకోని అధికారులు

రామయ్య  పట్టాభిషేకంలో గవర్నర్‌ను పట్టించుకోని అధికారులు

భద్రాద్రిలో కల్యాణ రాముడి పట్టాభిషేకం వైభవంగా జరిగింది. సీతా సమేత శ్రీరాముడికి పట్టాభిషేకం నిర్వహించారు ఆలయ అధికారులు. ఈ సందర్భంగా సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు గవర్నర్ దంపతులు. అయితే ముందుగా కలశాలు, ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీరామచంద్రుడికి అష్టోత్తర శతనామార్చన చేశారు.

పట్టాభిషేక మహోత్సవంలో భాగంగా...పాదుకలను శ్రీరాముడికి సమర్పించారు ఆలయ పూజారులు. రాజదండం, రాజ ముద్రిక, రాజ ఖడ్గం, ఛత్రం, చామరలు, రామదాసు పచ్చల పతకం ఇలా ఒక్కోటిగా శ్రీరాముడికి అలంకరించారు. తర్వాత వైభవంగా రామచంద్రునికి కిరీటధారణ చేశారు. చివరగా వివిధ నదుల తీర్థాలతో సీతా లక్ష్మణ సమేత శ్రీరాముల వారికి అభిషేకం నిర్వహించారు.

గవర్నర్ ప్రొటోకాల్ పట్టించుకోని అధికారులు

గవర్నర్ పర్యటన విషయంలో మరోసారి ప్రొటోకాల్ ను పట్టించుకోకుండా అధికారులు వ్యవహరించారు. సీతారాముల పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొంటానని ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో గవర్నర్ తమిళి సై ప్రకటించినా కూడా ఇవాళ అక్కడికి వెళ్లిన ఆమెకు స్వాగతం చెప్పేందుకు అధికారులెవరూ రాలేదు. గవర్నర్ పర్యటనలో కనీసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీలు కనిపించలేదు. జిల్లా అధికారులు పట్టాభిషేకానికి కూడా హాజరు కాలేదు. భద్రాద్రి ఆలయ ఈవో, టెంపుల్ అధికారులు మాత్రమే స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ తమిళి సై దంపతులు, రామయ్య పట్టాభిషేకాన్ని ఆశాంతం తిలకించారు. కాగా, యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవం, అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లో గవర్నర్ ప్రసంగం రద్దు, ఉగాది ఉత్సవాలకు ప్రభుత్వం వైపు నుంచి అంతా దూరంగా ఉండడం సహా పలు సందర్భాల్లో గవర్నర్ ప్రొటోకాల్ ను రాష్ట్ర సర్కారు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై ఇటీవలే గవర్నర్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అవమానం జరిగింది తమిళి సైకి కాదని, రాజ్ భవన్ కు అని ఆమె ఆ సందర్భంగా అన్నారు.

మరిన్ని వార్తల కోసం...

తెలంగాణ రైతులు ఏం పాపం చేశారు?

అన్నదాతల భూములు అమ్మాలని కేంద్రం యత్నం

బరిలోకి కేజీఎఫ్.. రిలీజ్ వాయిదా వేసుకున్న హిందీ మూవీ