మెదక్​లో టఫ్​ ఫైట్​.. హ్యాట్రిక్​ కోసం ఒకరు.. అరంగేట్రానికి మరొకరు!

మెదక్​లో టఫ్​ ఫైట్​..  హ్యాట్రిక్​ కోసం ఒకరు..  అరంగేట్రానికి మరొకరు!

మెదక్, వెలుగు:  మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి వరుసగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తుండగా, కాంగ్రెస్​ నుంచి బరిలో దిగిన డాక్టర్​మైనంపల్లి రోహిత్ రావు తొలిసారి అసెంబ్లీలో​అడుగుపెట్టేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పద్మా దేవేందర్ రెడ్డి గెలుపును మంత్రి హరీశ్ రావు, కొడుకు రోహిత్ గెలుపును ఆయన తండ్రి, మల్కాజ్​గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సవాల్ గా తీసుకొని వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తుండడంతో మెదక్​పాలిటిక్స్​ హీటెక్కాయి.  3 నెలల కింద బీఆర్ఎస్ ను వీడి కాషాయ కండువా కప్పుకున్న నిజాంపేట్ జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్​కు బీజేపీ టికెట్​ దక్కడంతో విజయమే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. ప్రధానంగా యూత్​, బీసీ ఓట్లపై విజయ్​కుమార్​ ఆశలుపెట్టుకోగా, ఆయా వర్గాలు ఎటు మొగ్గుచూపుతాయనేది ఆసక్తిరేపుతోంది.

 అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పద్మ ఆశలు

2‌014, 2018 వరుస ఎన్నికల్లో గెలిచిన పద్మాదేవేందర్​రెడ్డి హ్యాట్రిక్​ రేసులో ఉన్నారు. ఈసారి గెలిస్తే మంత్రి పదవి ఖాయమని ఆమె అనుచరులు ప్రచారం చేస్తున్నారు. గడిచిన పదేండ్లలో ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పద్మ ఆశలు పెట్టుకున్నారు. మెదక్  జిల్లా కేంద్రం కావడం,  మెడికల్​ కాలేజీ మంజూరు,  రామాయంపేట కేంద్రంగా రెవెన్యూ డివిజన్​ ఏర్పాటు లాంటి  అంశాలను తన ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. మాజీ  ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు, ఆయా మండలాలకు చెందిన  పలువురు  స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నుంచి బీఆర్ ఎస్ పార్టీలో చేరడం తనకు కలిసి వస్తాయని ఆమె భావిస్తున్నారు. 

ప్రత్యర్థులైన కాంగ్రెస్​, బీజేపీ అభ్యర్థులిద్దరికకీ  ఇదివరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అనుభవం లేకపోవడం తనకు అనుకూలాంశమని చెప్తున్నారు. హరీశ్​ మద్దతు పద్మకు అదనపు బలం. కాగా మూత పడ్డ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపించకపోవడం, ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు పనులు పెండింగ్ లో ఉండడం, కాళేశ్వరం ప్రాజెక్ట్ కాల్వల నిర్మాణం జరగక పోవడం, టూరిజం సర్య్కూట్​ ఏర్పాటు మాటలకే పరిమితం కావడం, జిల్లా కేంద్రమైన మెదక్ లో మినీ ట్యాంక్ బండ్, రైతు బజార్​, ఇంటిగ్రేటెడ్ మార్కెట్అసంపూర్తిగా ఉండడం, రింగ్ రోడ్డు మంజూరు కాకపోవడంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. నిజాంపేట్ జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ బీజేపీలోకి, పాపన్నపేట ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి  వెళ్లడం  పద్మకు మైనస్. 

ప్రభుత్వ వ్యతిరేకత, తండ్రి బలం..

బీఆర్​ఎస్ ​ప్రభుత్వం మీద, స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మీద ప్రజల్లో ఉన్నవ్యతిరేకత తనకు కలిసి వస్తుందని కాంగ్రెస్​ అభ్యర్థి మైనంపల్లి రోహిత్​ రావు​ అంటున్నారు. రైతు రుణ మాఫీ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత బంధు, బీసీ బంధు, గృహ లక్ష్మి వంటి స్కీమ్ లు కొందరికే దక్కడం, మెజారిటీ ప్రజలకు అందకపోవడం,  నియోజక వర్గంలో ప్రధాన పనులు పెండింగ్ లో ఉండడం, తనకు కలిసి వస్తుందని నమ్ముతున్నారు.  తాను చైర్మెన్​గా ఉన్న మైనంపల్లి సోషల్ సర్వీస్​ ఆర్గనైజేషన్​ ద్వారా సొంత నిధులతో నియోజకవర్గం వ్యాప్తంగా చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలు రోహిత్​రావుకు అదనపు బలం అని భావిస్తున్నారు.

 నియోజక వర్గంలో అతిపెద్ద, కీలకమైన  మండలమైన పాపన్నపేట  ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బీఆర్​ఎస్​ను వీడి  కాంగ్రెస్ పార్టీ లో చేరడం ఆయనకు ప్లస్​ పాయింట్​ అయ్యింది. తండ్రి మల్కాజ్​ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రచారం చేస్తుండటం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. కాగా  కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా పటిష్టంగా లేక పోవడం,  కాంగ్రెస్​ టికెట్ ఆశించి భంగపడ్డ కీలక నేతలు, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు పార్టీకి రిజైన్ చేసి బీఆర్ఎస్ లో చేరడం మైనస్​గా మారింది. ప్రత్యక్ష రాజకీయల్లోకి రావడం ఇదే మొదటి సారి కావడం, అనుభవజ్ఞులు అయిన పెద్ద నాయకుల అండ లేక పోవడం లాంటివి   మైనంపల్లి రోహిత్ కు ప్రతికూల అంశాలు.

ALSO READ : మజ్లిస్​ మైండ్ ​గేమ్!... అజారుద్దీన్ ను ఓడించేందుకు ప్లాన్​

యువత, బీసీ ఓట్లపైనే బీజేపీ ఆశలు

బీజేపీ అభ్యర్థి పంజా విజయ్ కుమార్ పీఎం నరేంద్ర మోదీ చరిష్మా, యూత్, బీసీ ఓటర్లపై ఆశలు పెట్టుకున్నారు. కీలకమైన మెదక్, రామా యంపేట పట్టణాల్లో విద్యావంతులు, యువ ఓటర్లు ఎక్కువ మంది బీజేపీ పట్ల అనుకూలం గా ఉండడం, ప్రత్యర్థి పార్టీలైన బీఆర్​ఎస్​, కాం గ్రెస్​ అభ్యర్థులిద్దరూ రెడ్డి, వెలమ సామాజిక వర్గాలకు చెందిన వారు కాగా, తాను బీసీ అభ్యర్థి కావడం, నియోజకవర్గంలో ముదిరాజ్ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడం తనకు కలిసి వస్తుందని విజయ్​కుమార్​ భావి స్తున్నారు. కాగా పార్టీ పట్టణ ప్రాంతాల్లో తప్ప నియోజక వర్గంలోని మండలాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బలంగా లేకపోవడం మైనస్ పాయింట్.  బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేయకున్నా, టికెట్​ ఆశించి భంగపడ్డ పార్టీ ముఖ్య నేతలు ఎన్నికల్లో ఏ మేరకు సహకరిస్తారన్న సందేహాలు పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతున్నాయి.